Sunday, January 19, 2025
HomeజాతీయంINDIA: బలోపేతమవుతున్న ఇండియా కూటమి

INDIA: బలోపేతమవుతున్న ఇండియా కూటమి

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్.డి.ఏ కూటమి మూడోసారి అధికారంలోకి రాబోతోందనే తరుణంలో భిన్న సంకేతాలు వస్తున్నాయి. ఇండియా కూటమి క్రమంగా బలపడుతోంది. ఒక్కో పార్టీతో పొత్తుల చిక్కులు విప్పుకుంటూ కాంగ్రెస్ ముందుకు వెళుతోంది.

రాబోయే లోకసభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు ఆప్, కాంగ్రెస్ మధ్య జరిగిన చర్చలు సఫలీకృతం అయ్యాయి. రెండు పార్టీల మధ్య ఉప్పు నిప్పుగా ఉన్న వ్యవహారం కొలిక్కి వచ్చినట్టయింది. ఈ రెండు పార్టీలు జతకడితే ఢిల్లీతో పాటు గోవా, ఛత్తీస్ గడ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో లబ్ది పొందే అవకాశం ఉంది. పంజాబ్ లో పొత్తులపై చర్చలు కొలిక్కి రాలేదు. ప్రాథమికంగా ఎవరికీ వారు పోటీ చేయాలని భావిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు 17 ఎంపి సీట్లు ఇచ్చి SP అధినేత అఖిలేష్ యాదవ్ పెద్ద మనసు చాటుకున్నారు. కాంగ్రెస్కు అంతగా బలం లేకపోయినా పొత్తు మర్యాద పాటించి అఖిలేష్ ఉభయతారకంగా నిర్ణయం తీసుకున్నారని ఎస్పి నేతలు అంటున్నారు. అయితే రాహుల్ గాంధి జోడో యాత్ర ప్రభావం కలిసి వస్తుందనే అఖిలేష్ దోస్తీ చేశారని కాంగ్రెస్ వారు అంటున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తులు కుదిరినా ఇరు పార్టీల నేతలు చిత్తశుద్దితో పనిచేస్తేనే బిజెపిని నిలువరించగలుగుతారు.

అటు బీహార్లో సిఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని JD(U)… ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్ళిపోవటంతో RJD-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలు సులువైందని చెప్పవచ్చు. బీహార్లో ఇండియా కూటమికి అధికంగా సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేల్లో వెల్లడవుతోంది. సిఎం నితీష్ కుమార్ తో జతకట్టడం బిజెపికి నష్టం జరుగనుందని విశ్లేషణ జరుగుతోంది.

మహారాష్ట్రలో 48 సీట్లకు గాను 39 స్థానాల్లో పంపకాలు కొలిక్కి వచ్చాయి. ఎనిమిది స్థానాలపై ప్రతిష్టంభన నెలకొంది. కాంగ్రెస్, శివసేన, NCP మూడు పార్టీలు బిజెపి బాధితులు కావటంతో మహారాష్ట్రలో కలిసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. మహారాష్ట్ర పరిణామాలను చూసిన ఆప్ నాయకత్వం ఇండియా కూటమితో కలిసి నడిచేందుకు సిద్దమైందని అంటున్నారు.

పశ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌త బెన‌ర్జీ 42 స్థానాల్లో రెండు ఇస్తామని ఇదివరకే ప్రకటించినా.. తాజాగా కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతోంది. కాంగ్రెస్ ఐదు సీట్లు కోరుతోంది. త్వరలోనే స్పష్టత వస్తుందని కాంగ్రెస్ నేతలు భరోసాతో ఉన్నారు. అస్సాంలో కొన్ని సీట్లు, మేఘాల‌యాలోనూ పోటీ చేయ‌నున్న‌ట్లు TMC ఎంపి డెరెక్ ఒబ్రెయిన్‌ వెల్ల‌డించారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలను కలుపుకుని చర్చలు జరిపితే సమస్యలు ఉండవని రెండు పార్టీల నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

కీలక రాష్ట్రాల్లో పొత్తులు కొలిక్కి వస్తుండటం ఇండియా కూటమికి సానుకూల పరిణామం కాగా విపక్ష పార్టీల నేతలపై ఎదో విధంగా బిజెపి ప్రతీకార చర్యలకు పాల్పడటం నష్టం చేయనుంది. కేంద్ర సంస్థల దాడులు, సోదాల వెనుక బిజెపి సూచనలు ఉన్నాయని ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళటం చాప కింద నీరులా ముప్పు తేనుంది. రాహుల్ గాంధి భారత్ జోడు యాత్ర ప్రభావం ఎంపి ఎన్నికల్లో ఉండనుందని కాంగ్రెస్ ధీమాగా ఉంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్