స్వదేశంలో జరుగుతోన్న వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో ఇండియా దూసుకుపోతోంది. న్యూజిలాండ్ తో ధర్మశాల వేదికగా జరిగిన నేటి మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ 19 పరుగులకే రెండు వికెట్లు (కాన్వే డకౌట్, విల్ యంగ్-17) కోల్పోయింది, ఈ దశలో రచిన్ రవీంద్ర- డెరిల్ మిచెల్ మూడో వికెట్ కు 149 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. రవీంద్ర -75 (87బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్); మిచెల్-130 (127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు) రన్స్ చేసి ఔటయ్యారు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ ఒక్కడే 23 పరుగులు చేశాడు. మిగిలి వారు పెద్దగా రాణించలేదు. నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఈ మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ ఆడిన పేసర్ మహమ్మద్ షమీ ఐదు వికెట్లతో రాణించాడు. కుల్దీప్ 2; సిరాజ్, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు.
ఇండియా తొలి వికెట్ కు 71 పరుగులకు చేసింది. రోహిత్ 46 పరుగులు చేసి వెనుదిరగ్గా ఆ వెంటనే శుభ్ మన్ గిల్ (26) కూడా పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ మరోసారి బాధ్యతాయుత ఇనింగ్స్ ఆడి 95 రన్స్ సాధించి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. శ్రేయాస్-33; కెఎల్ రాహుల్- 27; సూర్య కుమార్ యాదవ్-2 పరుగులు చేసి ఔటయ్యారు. జడేజా-36; షమీ-1 పరుగుతో నాటౌట్ గా నిలిచారు. 48 ఓవర్లల్లో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యం చేరుకుంది.
కివీస్ బౌలర్లలో ఫెర్గ్యూసన్ 2; ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, శాంట్నర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
షమీకి ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.