శ్రీలంకతో జరిగిన మొదటి టి 20లో ఇండియా 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇండియా విసిరిన 163 పరుగుల లక్ష్య సాధనలో లంక 160 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓ దశలో ఇండియా విజయం సునాయాసమని భావించినా లంక కెప్టెన్ దాసున్ శనక, హసరంగ, కరుణరత్నేలు క్రీజులో నిలబడి జట్టును విజయం అంచుల వరకూ తీసుకెళ్ళారు.
టీమిండియా క్యాప్ తో తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన బౌలర్ శివం మావి నాలుగు వికెట్లు సాధించి రికార్డు నెలకొల్పాడు.
ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 27 పరుగులకు ఇండియా తొలి వికెట్ (శుభ్ మన్ గిల్-7) కోల్పోయింది. సూర్య కుమార్ యాదవ్ (7); సంజూ శామ్సన్ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ దశలో ఇషాన్ కిషన్ వేగం పెంచాడు, 37 పరుగులు చేసి ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా 29 రన్స్ తో రాణించాడు. హార్దిక్ ఔటైన తరువాత దీపక్ హుడా-అక్షర్ పటేల్ లు ఇండియా స్కోరు బోర్డును పరుగులెత్తించారు. హుడా 23 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లతో 41; అక్షర్ పటేల్ 20 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ తో 31 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
లంక బౌలర్లలో దిల్షాన్ మధుశనక, తీక్షణ, కరునరత్నే, ధనుంజయ డిసిల్వా, హసరంగా తలా ఒక వికెట్ సాధించారు.
లంక జట్టులో కెప్టెన్ శనక-45; కుశాల్ మెండీస్-28; కరుణ రత్నే-23; హసరంగ-21 పరుగులతో రాణించారు.
భారత బౌలర్లలో శివం మావి నాలుగు; ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
దీపక్ హుడా కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.