టి 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా-కెనడా జట్ల మధ్య నేడు జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఫ్లోరిడా లాడర్ హిల్ లోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ మైదానంలో జరగాల్సి ఉండగా వర్షంతో మైదానం చిత్తడిగా మారడంతో మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి నెలకొంది.
మొదటి మూడు మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా ఇప్పటికే సూపర్ 8 లో చోటు ఖాయం చేసుకున్న సంగతి తెలిసింది. ఇండియాతో పాటు యూఎస్ఏ కూడా ఈ గ్రూప్ నుంచి సూపర్ 8 కు చేరుకోగా… డిపెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించింది.
వెస్టిండీస్ వేదికగా జరగబోయే సూపర్-8 పోరులో భారత్ మూడు జట్లతో తలపడనుంది. వీటిలో కనీసం రెండు మ్యాచుల్లో గెలుపొందినా సెమీస్ బెర్తు దక్కనుంది. సూపర్-8లో భాగంగా భారత్ తొలి మ్యాచ్ ను ఈ నెల 20న ఆఫ్ఘనిస్తాన్ తో ఆడనుంది. ఆ తర్వాత జూన్ 22న బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ తో తలపడుతుంది. సూపర్-8లో చివరగా జూన్ 24న ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ లు బార్బొడోస్, ఆంటిగ్వా, సెయింట్ లూసియాలో జరగనున్నాయి. ఇండియా, యూఎస్ఏ తో పాటు ఆస్ట్రేలియా , వెస్టిండీస్, ఆఫ్గనిస్తాన్, దక్షిణాఫ్రికాలు ఇప్పటికే తర్వాతి రౌండ్ కు చేరుకోగా బంగ్లాదేశ్ , నెదర్లాండ్, ఇంగ్లాండ్ , స్కాట్లాండ్ జట్లు రేసులో ఉన్నాయి.