Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంక్యాచ్ మీ ఇఫ్ యూ కెన్

క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్

భారతీయ సనాతన ధర్మంలో వైరాగ్య జ్ఞానం చాలా ప్రధానమయినది. ఎంత సంపద ఉన్నా, ఎన్ని వైభోగాలు ఉన్నా, ఎంత మిసిమి వయసు ఉన్నా…ఇవన్నీ శాశ్వతం కాదని, ఏదో ఒక నాటికి పోయేవే అని ప్రతిక్షణం వాటితో మనకు మనమే డిటాచ్ అయ్యే వైరాగ్యాన్ని బోధించే జ్ఞానం అనంతం. జ్ఞాన వైరాగ్యాలను భిక్షగా ప్రసాదించమ్మా! అని శంకరాచార్యులు చివర ఫలశ్రుతిలో స్పష్టంగా అన్నపూర్ణను అడిగాడు.

అలాంటి వైరాగ్యం ఎవరికీ ఊరికే రాదు. వైరాగ్యం చెట్లకు కాయదు. మన మెదళ్లకే కాయాలి. కేంద్ర ప్రభుత్వం తాజాగా భారతీయుల్లో వైరాగ్యం పెంచడానికి అనేక చర్యలు చేపట్టింది. అందులో ఒకానొకటి- గడచిన అయిదేళ్లలో బడాబాబులు ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు ఎగ్గొట్టిన అప్పు పది లక్షల కోట్లు రద్దు చేసినట్లు ప్రకటించడం!

అప్పిచ్చువాడు లేని ఊళ్లో ఉండనే వద్దని శతకకారుడి ప్రబోధం.

“ఋణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయాః
ఋణక్షయే క్షయం యాంతి కా తత్ర పరిదేవనా”

రుణానుబంధమే లౌకిక ప్రపంచానికి అత్యంత కీలకమయినది. బ్యాంకులతో ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు ఉన్నది జన్మ జన్మల అలౌకిక, పారమార్థిక(పారమార్థిక అనగా పరమ ఆర్థిక సంబంధమైన అన్న వ్యుత్పత్తి అర్థం తప్ప ఇంకే అర్థమూ తీసుకోకూడదని మనవి) రుణానుబంధమే. ఆ ఎగవేత దారుణ రుణ భారం తీర్చాల్సింది బాధ్యతగల సగటు భారతీయులే. ఆ కోణంలో వారిది పెద్ద పారమార్థిక కర్మ. మనది వారి ఉద్దేశపూర్వక కర్మల దెబ్బకు కాలిన ఇంకా పెద్ద “పరమ దౌర్భాగ్య ఖర్మ”!

“అప్పులేని సంసార మైనపాటే చాలు 
తప్పులేని జీతమొక్క తారమైన జాలు

కంతలేని గుడిసొక్క గంపంతైన జాలు 
చింతలేని యంబలొక్క చేరెడే చాలు
వింతలేని సంపదొక్క వీసమే చాలు

తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదే చాలు 
ముట్టులేని కూడొక్క ముద్దడే చాలు 
గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైన చాలు 
వట్టిజాలి బడుకంటే వచ్చినంతే చాలు

లంపటపడని మేలు లవలేశమే చాలు 
రొంపికంబమౌకంటె రోయుటే చాలు 
రంపపు గోరికకంటే రతి వేంకటపతి 
పంపున నాతని జేరే భవమే చాలు”

అని అన్నమయ్య అప్పుల పెను భారం గురించి అయిదు వందల ఏళ్ల కిందటే వెంకన్న దగ్గర మొరపెట్టుకున్నాడు.

కొన్ని శతాబ్దాల బ్యాంకింగ్ సేవలను నిశితంగా గమనించిన నిపుణులు తేల్చిందేమిటంటే-
“అప్పు ఎగ్గొట్టే అత్యంత సంపన్నులను బ్యాంకులు ఏమీ చేయలేవు. అప్పు బాధ్యతగా తిరిగి కట్టేవారి నుండి ఎంత ఎక్కువ వీలయితే అంత ఎక్కువ వడ్డీలు వసూలు చేసుకుంటాయి. జనం డిపాజిట్లకు నామమాత్రపు వడ్డీ ఇవ్వాలి. వేల, లక్షల కోట్ల అప్పులు ఎగ్గొట్టిన వారి భారాన్ని…సామాన్యులు మోయాలి. ఇదొక తీరని రుణం. కరుణలేని దారుణం”.

అప్పుడప్పుడు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను “సవరించింది” అంటుంటారు. ఇందులో “సవరణ”కు వివరణ ఏమిటంటే “వడ్డీ రేట్లను పెంచింది” అని మనం అర్థం చేసుకోవాలి. “మార్కెట్ కరెక్షన్” మాట గొప్పగా ఉన్నా ఆ “కరెక్షన్” భారం పెరిగేదే కానీ…తగ్గేదే ల్యా!

గోరుచుట్టుపై రోకటి పోటు- రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు రెండూ ఒకటే అని సామాన్యుల అవగాహన.

“వాడు నన్ను కొట్టె;
నన్ను వాడు కొట్టె అన్నట్లు”
అని రాయలసీమలో ఒక ఫేమస్ సామెత. రెండు వాక్యాల్లో దెబ్బలు తిన్నది ఒకడే. కాకపొతే సర్వనామం స్థానం మారడంతో ఇద్దరు దెబ్బలు తిన్నట్లు కన్ఫ్యూజ్ అవుతాం- అంతే. రెండు వాక్యాల్లో కొట్టింది ఒకడే. దెబ్బలు తిన్నది కూడా ఒకడే. అలా పేరు రెపో రేటు అయినా, ద్రవ్య విధానమయినా కొట్టేది రిజర్వ్ బ్యాంకే. వడ్డీ దెబ్బలు తినేది మనమే.

“ద్రవ్యోల్బణం అదుపు, వృద్ధి రేటుకు మద్దతుగానే ఇక ద్రవ్య విధానం ఉంటుంది” అంటుంది రిజర్వ్ బ్యాంక్. ఇది అర్థం కాక అనవసరంగా జుట్లు పీక్కుని అమర్త్యసేన్ ఎక్కడున్నాడో? అని పరుగులు తీయాల్సిన పని లేదు.

ద్రవ్యోల్బణం అదుపు చేయలేని ప్రతి సందర్భంలో…
వృద్ధి రేటు వాపును బలుపుగా చూపడానికి లేదా లోటును పూడ్చడానికి సామాన్యుల నడ్డి విరిచి…ఇలా వడ్డీలను పెంచుకుంటూ పోతామని- నర మానవుడికి అర్థం కాకుండా…శాలువలో పెట్టి కొడతారంతే!

అన్నట్లు-
అయిదేళ్లలో ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన పది లక్షల కోట్ల అప్పులను శాశ్వతంగా తిరిగిరానివిగా, ఎట్టి పరిస్థితుల్లోనూ వసూలు చేసుకోలేనివిగా ప్రకటించి…శాశ్వతంగా రద్దు చేసినట్లు-
సామాన్యులమైన మన అప్పులను కూడా కొంతయినా శాశ్వతంగా రద్దు చేయాలని కోరుకోవడంలో దురుద్దేశం అణుమాత్రమైనా ఉంటుందా?

ఉద్దేశపూర్వక ఎగవేతదారులను గుండెల్లో పెట్టుకుని రక్షించే పెద్దల్లారా!
రుణపీడితులమైన మా ఉద్దేశాన్ని కూడా కొంచెం వినండి!

కొస మెరుపు:-
అమెరికాలో వేల కోట్ల బ్యాంక్ మోసాలు చేసిన ఒకడిని చివరికి ఎలాగో పట్టుకుని…జైల్లో వేశారు. అలాంటి బ్యాంక్ మోసాలను గుర్తించి జాగ్రత్త పడడానికి బ్యాంకులు తరచుగా జైలుకు వెళ్లి అతడి సేవలను వినియోగించుకునేవి. శిక్ష పూర్తయి బయటికొచ్చాక అతడు బ్యాంక్ మోసాలను గుర్తించే సేవల కంపెనీ పెట్టి వేల కోట్లు సంపాదించాడు. ఇంకా సంపాదిస్తున్నాడు. అతడి కథతో ఏకంగా హాలీవుడ్ లో “క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్” అని సినిమానే వచ్చింది.

ఈ లెక్కన మన భారత్ లో ఎన్నెన్ని “క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్” సినిమాలు తీయాలో!
ఈ సినిమాల నిర్మాణాలకు కూడా బ్యాంకులు ఎన్నెన్ని లక్షల కోట్లు అప్పులిచ్చి “వుయ్ కాంట్ క్యాచ్ యూ ఫర్ ఎవర్” అని సమాధానంగా తూరుపు తిరిగి దండం పెట్టాలో!!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్