ప్రపంచవ్యాప్తంగా చైనా కృత్రిమ మేధ కంపెనీ ‘డీప్ సీక్’ పేరు ప్రఖ్యాతులు మారుమోగిపోతున్నాయి. చైనా ఎలెక్ట్రిక్ కార్ల కంపెనీ బిడ్(Build your dreams-BYD) అమెరికా అధ్యక్షుడికి చోదకశక్తి అయిన ఎలాన్ మస్క్ కార్ల కంపెనీ టెస్లాకు సవాలు విసురుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలకు అంతే దీటుగా చైనా కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించి వాణిజ్య యుద్ధానికి సై అంటే సై అంటోంది.
‘చైనా సరుకు’ అని మనం చిన్నచూపు చూసే సంగతులెన్ని ఉన్నా…చైనా సరుకు బరువుతో సరితూగగల మార్కెట్లు ప్రపంచంలో ఉన్నాయా? అని తరచి చూడాల్సిన సందర్భంలో ఉన్నామని అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్- చైనా స్టార్టప్ కంపెనీల మధ్య వ్యత్యాసాలను ఎత్తి చూపుతూ అజ్ఞాతవ్యక్తి తయారుచేసిన ఒక పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దానికి తెలుగు అనువాదమిది:-
భారత్ స్టార్టప్ కంపెనీలు వెలుగుతున్న రంగాలు; వాటి పర్యవసానాలు:-
# ఫుడ్ డెలివరీ యాప్స్:-
నిరుద్యోగ యువకులు తక్కువ వేతనానికి ఇందులో డెలివరీ బాయ్స్ గా పనిచేస్తుంటారు. డబ్బున్నవారు కాలు కదపకుండా ఈ యాప్స్ ద్వారా ఆహారం తెప్పించుకుంటూ ఉంటారు.
# అందమైన ఐస్ క్రీములు, కుకీలు:-
ఆరోగ్యకరమైనవి అని ఊదరగొడతారు. ఐస్ క్రీమ్ ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని అందరికీ తెలుసు.
# కిరాణా సరుకులు:-
ఇంటికి కావాల్సినవి వెళ్ళి…తెచ్చుకునే ఓపిక కూడా లేని జనాన్ని మరింత బద్దకస్తులుగా తయారుచేశాయి.
# బెట్టింగ్ యాప్స్:-
జూదాన్ని ఒక ఆటగా మార్చారు. చివరికి జూదమొక వ్యసనమయ్యింది. కష్టపడి పనిచేసి సంపాదించడం మరచిపోతున్నారు.
# రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్స్:-
మతిలేని రీల్స్ చేస్తూ, చూస్తూ అదే వినోదం అనుకుంటున్నారు. బతుకుతెరువు చూపే జ్ఞానాన్ని, ఉపాధి అవకాశాలు చూపే నైపుణ్యాన్ని గాలికొదిలేశారు.
చైనా స్టార్టప్ కంపెనీలు వెలుగుతున్న రంగాలు; వాటి పర్యవసానాలు:-
# ఈ వీ- బ్యాటరీ టెక్నాలజీ:-
ప్రపంచ ఎలెక్ట్రిక్ కార్ల మార్కెట్లను చైనా బిడ్ లాంటి కంపెనీలు శాసించే స్థాయికి ఎదిగాయి.
# సెమీకండక్టర్స్, ఏ ఐ:-
భవిష్యత్తును ఏలే చిప్ ల తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మీద విపరీతంగా పెట్టుబడులు పెడుతోంది. పరిశోధనలు జరుపుతోంది.
# రోబోటిక్స్, ఆటోమేషన్:-
ప్రపంచంలో ఇంకెవరూ అందుకోలేనంతగా పరిశ్రమల్లో రోబోలతో పనులు చేయించుకుంటోంది. కృత్రిమ మేధతో ఉత్పత్తిని ఊహకందనంతగా పెంచుకుంటోంది.
# గ్లోబల్ లాజిస్టిక్స్, ట్రేడ్:-
అలీబాబా, డి జె ఐ, షైన్ లాంటి ప్రపంచవ్యాప్తంగా క్షణాల్లో సరుకును చేరవేయగల సప్లై చెయిన్లను నిర్మించుకుంది.
# డీప్ టెక్, మౌలిక వసతులు:-
అంతరిక్ష పరిశోధనలు, శాటిలైట్ కమ్యూనికేషన్స్, హై స్పీడ్ రైళ్లు, పునర్వినియోగ ఇంధనాలమీద విపరీతంగా ఖర్చు పెడుతోంది.
…ఆ…అయితే ఏంటట? వికసిత్ భారత్ లో అన్నం పొట్లాల బట్వాడా కంపెనీ జొమాటా అన్నం వండదు. హోటళ్ళు నడపదు. కానీ లక్ష కోట్ల కంపెనీ అయ్యిందా? లేదా?
ఇండియా ఈజ్ షైనింగ్.
ఇండియా ఈజ్ సింప్లీ ఈటింగ్.
భారత్ వెలుగుతోంది.
భారత్ అదేపనిగా తింటోంది.
తాగి పారేసిన బాటిళ్ళు;
రాసి పారేసిన కవితల గురించి పట్టించుకోవాలా? అన్నాడు యుగకవి.
తిని పారేసిన పార్శిళ్లు;
యాప్ లకు ధారపోసిన సొమ్ములగురించి పట్టించుకోవాలా? అని అడుగుతోంది కొత్తతరం.
2047 నాటికి మన వికాసం ముందు చైనా ఏపాటి? అని అనుకోవడంలో ఉన్న ఆత్మానందం ముందు...ఆఫ్టరాల్ ఆ డీప్ సీకులు, బివైడీల అంతర్జాతీయ విజయగాథలు ఏపాటి?
మన కలల కాలిగోటికయినా అవి సాటి రాగలవా?
(ఇంగ్లిష్ లో ఈ పోస్ట్ తయారుచేసిన అజ్ఞాతవ్యక్తికి కృతజ్ఞతలతో)
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు