రష్యా మరోసారి భారత్‌కు బాసటగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపై చిరకాల మిత్రదేశం తన మద్దతు ప్రకటించింది. ప్రపంచ, ప్రాంతీయ అంశాలపట్ల అనుసరిస్తున్న తీరుతో ఐరాస భద్రతామండలికి భారత్‌ అదనపు వెలుగులు అద్దగలదని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ వ్యాఖ్యానించారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రస్తుతం భారత్‌ ముందంజలో ఉన్నదని, త్వరలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించబోతున్నదని లావ్రోవ్‌ పేర్కొన్నారు. వివిధ రకాల సమస్యలను పరిష్కరించుకోవడంలో భారత్‌ అద్భుతమైన దౌత్యపర అనుభవం కలిగి ఉన్నదని ఆయన కొనియాడారు.

ఈ నెల 7న మాస్కోలో జరిగిన ప్రైమకోవ్‌ రీడింగ్స్‌ ఇంటర్నేషనల్ ఫోరమ్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా లావ్రోవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితిలో, షాంఘై సహకార సంఘంలో భారత్‌ క్రియాశీల పాత్ర పోషిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. గత సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి 77వ సర్వప్రతినిధి సభలో కూడా సెర్గీ లావ్రోవ్ ప్రసంగిస్తూ.. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.భారత్‌తోపాటు బ్రెజిల్‌కు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని పేర్కొన్నారు. భద్రతామండలిలో తీసుకురావాల్సిన మార్పులపై ప్రతిపాదనల పరంగా భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు. మండలిలో ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడం అవసరమని, తద్వారా మండలిలో ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *