Friday, September 20, 2024
HomeTrending NewsG20: కొందరిదే పెత్తనం...అయితేనేం భారత్ చాతుర్యం

G20: కొందరిదే పెత్తనం…అయితేనేం భారత్ చాతుర్యం

ఐక్యరాజ్యసమితిలో 193 దేశాలు ఉన్నా ఆ వేదిక మీద కర్ర ఉన్నవాడిదే పెత్తనం మాదిరిగా అగ్రదేశాల ఆధిపత్యమే కొనసాగుతోంది. దీంతో ప్రాంతీయ సమస్యల పరిష్కారం..అంతర్జాతీయ సహకారం కోసం వివిధ రూపాల్లో.. వివిధ మార్గాల్లో వచ్చిందే జీ 20 కూటమి. 1990 దశకంలో వివిధ దేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభాలు, ప్రపంచ ఆర్ధిక వ్యవహారాల్లో కొన్ని దేశాలకు తగినంతగా గుర్తింపు లేకపోవడంతో జీ20 ఏర్పాటు ఆవశ్యకమైంది.

జీ20 అంటే గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అని అర్ధం. ఇందులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, యూఎస్ఏ దేశాలున్నాయి.

ప్రపంచ జీడీపీలో 85 శాతం జీ20 దేశాలే కలిగి ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం జీ20 దేశాలదే కావడం విశేషం. చెప్పుకునేందుకు ఆసక్తికరంగా ఉన్నా ఈ గ్రూపులో కూడా అమెరికా, రష్యా, చైనా, నాటో కూటమి తమ పంతం నెగ్గించుకునేందుకే వేదికను వాడుకుంటున్నాయనే విమర్శ ఉంది.

జీ-20 సదస్సులో కొందరు నేతలు మాత్రమే అధిపత్యం చెలాయిస్తున్నారు. మిగతా దేశాల ప్రాతినిధ్యం తక్కువేననే అభిప్రాయం ఉంది. చిన్నదేశాలు తమ సమస్యలను కూడా సరిగా చెప్పలేని పరిస్థితి. దాదాపు 170కి పైగా దేశాలను అతిథిగా కూడా పిలవలేని పరిస్థితి నెలకొంది. ఇందులో ఓటింగ్ ప్రక్రియ కూడా ఉండదు. సమావేశాలు, ఒప్పందాలు కూడా అంతా న్యాయబద్దంగా జరగవనే అపవాదు ఉంది.

అంతర్జాతీయ వేదికల మీద ఏ మాత్రం అవకాశం చిక్కినా భారత్ యుఎన్ సంస్కరణలపై గొంతు విప్పుతోంది. ప్రధానంగా ఐరాస భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)ని విస్తరించాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని నరేంద్ర మోడీ జీ 20 వేదికపై అభిప్రాయపడ్డారు. ఐరాసలో సభ్యదేశాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. భద్రతా మండలిలో మాత్రం సభ్య దేశాల సంఖ్య మారడం లేదన్నారు.

భారత్ పరంగా పలు అంశాలలో విజయం సాధించినట్టు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చైనా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు ఇటలీ ప్రకటించింది. ప్రతిష్ఠాత్మకమైన ఇండియా-మిడిల్‌ ఈస్ట్‌-యూరోప్‌ వాణిజ్య కారిడార్‌పై ఆసక్తితో ఉన్నట్టు జీ20 దేశాలు సమావేశంలో ప్రకటించి ఒక రోజు కూడా గడవక ముందే చైనాకు ఎదురుదెబ్బ తగిలింది.

బీఆర్‌ఐ ఒప్పందం నుంచి వైదొలగాలని భావిస్తున్నట్టు ఇటలీ ప్రధాని జియార్జియా మెలోని ఆదివారం జీ20 సదస్సు సైడ్‌లైట్స్‌లో చైనాకు స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలంటూ చైనా ప్రతినిధి చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన ఆమె తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టారు.

మరోవైపు, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై జీ 20 సభ్యదేశాల మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నప్పటికీ, ఏకాభిప్రాయాన్ని సాధించి ఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం లభించేలా భారత్‌ జరిపిన కృషిపై పలు దేశాధినేతలు ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా రష్యా… భారత్‌ సారథ్యాన్ని ఎంతగానో కొనియాడింది.

జీ 20 సమావేశాలకు చైనా అధ్యక్షుడు గైర్హాజరు కావటం కూడా కలిసివచ్చిందని చెప్పవచ్చు. చైనా అన్ని సరిహద్దు దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ గొడవలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జింపింగ్ గైర్హాజరుపై ఏ దేశం కూడా ప్రస్తావన తీసుకురాలేదు. ఇది ఒక విధంగా భారత్ దౌత్య నీతికి విజయంగా చెప్పుకోవచ్చు.

ఆఫ్రికా యూనియన్ కు జీ 20 శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్టు ప్రధానమంత్రి మోడీ ప్రకటించగానే హర్షద్వానాలు వ్యక్తం అయ్యాయి. ఈ తరుణంలో ప్రధానమంత్రి  మోడీ ప్రసంగం ఆపి మరీ ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజాలీ అసూమాని దగ్గరకు వెళ్లి అభినందించటం ప్రశంసనీయం. ఈ పరిణామం ఆఫ్రికా దేశాలతో భారత్  స్నేహాన్ని చాటింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్