Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబతుకుకు దివ్య దీపం

బతుకుకు దివ్య దీపం

India shines in Paralympics Games

మొన్ననే జపాన్ టోక్యో 2021 ఒలింపిక్స్ జరిగాయి. కొన్నయినా మెడల్స్ సాధించి మనం పరువు నిలుపుకున్నాం. ఒలింపిక్స్ లో మెడల్స్ గెలుచుకున్నవారికి ఎక్కడో ఒక చోట సన్మానాలు జరుగుతూనే ఉన్నాయి. జరగాలి కూడా. ఈలోపు పారాలింపిక్స్ మొదలయ్యాయి. ఇందులో కూడా భారత్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో మెడల్స్ వచ్చాయి. మీడియాలో పారాలింపిక్స్ మెడల్స్ వార్తలు వస్తున్నాయి.

ఒక్కొక్క పారాలింపిక్స్ వార్త – విధిని ఎదిరించి, బరిలో గిరి గీచి నిలిచిన విజయ పతాక.
ఒక్కొక్క మెడల్- సంకల్పం గట్టిదయితే అవయవాలు సహకరించకపోయినా ఆడి గెలిచే ఆట.
ఒక్కొక్క పోటీ- తెగిన రెక్కలకు మనసు ముక్కలు అతికించి విను వీధిన విజయ గీతమై పాడుకున్న పాట.

అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవారి ఆటలకంటే పారాలింపిక్స్ ఏ రకంగా చూసినా గొప్పవే. కళ్లున్నందుకు చూడాల్సిన ఆటలు. మనసున్నందుకు మదిలో పొంగిపోవాల్సిన ఆటలు. చేతులున్నందుకు చప్పట్లు చరిచి అభినందించాల్సిన ఆటలు.

కాలికి ముల్లు గుచ్చుకుంటే, చేతికి దోమ కుడితే, ఫెళ ఫెళ ఎండ కాస్తే, గజగజ చలి వణికిస్తే అల్లాడిపోయే అతి సుకుమారులైపోయిన మనకు…ఒక కాలు లేకపోతే, రెండు కాళ్లు లేకపోతే, ఒక చేయి విరిగితే, రెండు చేతుల్లేకుంటే, నడవలేక చక్రాల కుర్చీయే జీవితమైతే…ఎలా ఉంటుందో ఊహించుకోండి. కరోనా పాజిటివ్ వచ్చి రెండు వారాల ఏకాంత వైద్యానికే గుండె జారి పై ప్రాణాలు పైనే పోతున్నవారిని చూస్తున్నాం. పరీక్షల్లో ఫెయిలయితే రైలు పట్టాల మీద ప్రాణాలను పడుకోబెడుతున్నవారిని చూస్తున్నాం. ప్రేమ విఫలమయితే గుండె కోసుకుంటున్నవారిని చూస్తున్నాం. సకల అవయవాలు సరిగ్గా పనిచేస్తుంటే ఒళ్లు పై తెలియకుండా తప్ప తాగి అతివేగంగా వాహనాలు నడుపుతూ అన్నెం పున్నెం ఎరుగని ఎదుటివారిని చంపుతున్నవారిని చూస్తున్నాం. ఎదుటి వారి ప్రాణాలతో ఆడుకుంటున్న మదాంధ మానసిక వికలాంగులను చూస్తున్నాం. సరిగ్గా పనిచేసే కాళ్లు చేతులను ఆడించలేక బద్దక సకలాంగులను చూస్తున్నాం.

కానీ-
తొడ దాకా తెగిన రెండు కాళ్లకు కృత్రిమ కాళ్లను తొడుక్కుని నిలబడి, పారాలింపిక్స్ లో పరుగులిడి మెడలో మెడల్స్ వేసుకున్న ధైర్యానికి, సంకల్పానికి, పట్టుదలకు, సాధనకు, తపనకు, తలరాతను తిరగరాసుకున్న నేర్పుకు ఎన్ని సలాములు చేయాలి? ఎన్ని చప్పట్లు చరచాలి? ఎన్ని ఆనంద బాష్పాలు రాల్చాలి? ఎన్ని ప్రశంసల పూలు చల్లాలి?కాలచక్రం కాళ్లను నలిపేస్తే, కాల చరితను పునర్లిఖించి కాలికి కళ్లను అతికించి, కాలికి చూపును, చుక్కానిని తోడిచ్చి, విధిని ఎదిరించి మెడలో పారాలింపిక్స్ మెడల్ ను వేసుకుంటే ఆ గెలుపును వర్ణించడానికి మాటలేమి సరిపోతాయి?

తెగినవి చేతులే.
విరిగినవి కాళ్లే.
వంగినవి వెన్నెముకలే.
వారి మనసులు తెగలేదు.
వారి సంకల్పం విరగలేదు.
వారి సాధన సడలలేదు.
వారి పట్టుదల తల వంచలేదు.
వారి తపన నీరుగారలేదు.
మారింది వారి గమనమే- గమ్యం కాదు.
మారింది వారు కాదు- విధి.

విధి మాతో ఆడుకుంది అని నిట్టూరుస్తూ నిరాశా, నిస్పృహల్లో తమకు తామే తెరమరుగయ్యేవారు కొందరు. ఆ ఆడుకున్న విధితో పందెం వేసి, విధినే గెలిచి పెన్నిధిగా నిలిచినవారు పారాలింపిక్స్ విజేతలు. నిజానికి పారాలింపిక్స్ విజేతలే కాదు – టోక్యో పారాలింపిక్స్ పోటీల దాకా వెళ్లిన క్రీడాకారులందరూ స్ఫూర్తి దీపాలే.

అవయవాలదేముంది?
తెగుతుంటాయి. మొలుస్తుంటాయి. బరిలోకి దూకాలన్న పట్టుదల తెగిపోకూడదు. తెగే ఒక్కో అవయవానికి ఒక్కో ప్రత్యామ్నాయం జత చేసుకుని చక్రం తిప్పే నేర్పు, ఓర్పు, కూర్పు తెగిపోకూడదు.

“దూరం బాధిస్తున్నా పక్షి విశ్వాసం రెక్కలు విప్పుతుంది.
హోరున వీచే గాలి వెదురులో ఒదిగి వేణుగానమవుతుంది”

అవయవం బాధిస్తున్నా విశ్వాసం రెక్క విప్పాలి.
కాలం కలిసిరాకున్నా ధైర్యం కూడగట్టుకోవాలి.
శరీరం బరువవుతున్నా
మనసు మబ్బుల్లో తేలాలి.

ఆటలకే కాదు-
బతుకు ఆటకే పారాలింపిక్స్ పెద్ద పాఠం. పడిన చోటే లేచి, గెలిచే…ఏ బడిలో చెప్పని దివ్యాంగ పాఠం. నిర్లిప్తత, నిర్వేదం, నైరాశ్యం నిండిన మన మనసుల్లో నిత్యం వెలిగించుకోవాల్సిన దివ్య దీపం.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: మన ఒలింపిక్స్ వేరు

Also Read: మనకు ఆటలంటే మాటలే

RELATED ARTICLES

Most Popular

న్యూస్