వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో ఇండియా 3 పరుగులతో ఉత్కంఠ విజయం సాధించింది, 309 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ విజయం కోసం చివరి వరకూ పోరాడి, 305 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఇండియా కెప్టెన్ శిఖర్ ధావన్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫామ్ లోకి వచ్చి 97 పరుగులతో (99 బంతులు, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటాడు. శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ కూడా రాణించారు.
ట్రినిడాడ్, పోర్ట్ అఫ్ స్పెయిన్ లోని క్వీన్స్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో విండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు ధావన్- గిల్ లు తొలి వికెట్ కు 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్ 67 పరుగులు (53 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి వెనుదిరగగా, ఆ తర్వాత ధవన్- అయ్యర్ లు రెండో వికెట్ కు 94 పరుగులు జోడించారు. అయ్యర్ అర్ధ సెంచరీ చేసి ఔట్ కాగా, ధావన్ సెంచరీకి మరో మూడు పరుగుల దూరంలో ఔటయ్యాడు. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 308 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, మోటీ చెరో రెండు వికెట్లు; రోమానియో షెఫర్డ్, అకీల్ హోసేన్ చెరో వికెట్ పడగొట్టారు.
లక్ష్య సాధనలో విండీస్ 16 పరుగులకే తొలి వికెట్ (షాయ్ హోప్-7) కోల్పోయింది. రెండో వికెట్ కు కేల్ మేయర్స్- షమ్రా బ్రూక్స్ 115 పరుగులు చేశారు. మేయర్స్-75; బ్రూక్స్-46; బ్రాండన్ కింగ్-54తో రాణించారు. కెప్టెన్ పూరన్ 25 పరుగులు మాత్రమే చేశాడు. చివర్లో అకీల్ హోస్సేన్(32); రోమానియో షెఫర్డ్(39)లు ధీటుగా ఎదుర్కొన్నా విజయం అందుకోలేకపోయారు.
ఇండియా బౌలర్లలో సిరాజ్, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
శిఖర్ ధావన్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : Team India: ఆసీస్, సౌతాఫ్రికాతో వైట్ బాల్ సిరీస్