Friday, November 22, 2024
Homeస్పోర్ట్స్మొదటి టి 20లో ఇండియా విజయం

మొదటి టి 20లో ఇండియా విజయం

India Won 1st T20 :

టి-20 సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఇండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో చివరి ఓవర్ నాలుగో బంతిని బౌండరీకి తరలించడం ద్వారా రిషభ్ పంత్ విజయాన్ని అందించాడు. న్యూజిలాండ్ విసిరిన 165 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి  దిగింది ఇండియా. జట్టు స్కోరు 50  వద్ద కెఎల్ రాహూల్ (15) ఔటయ్యాడు. సూర్య కుమార్ యాదవ్- 62 (40 బంతులు, 6ఫోర్లు, 3సిక్సర్లు), కెప్టెన్ రోహిత్ శర్మ-48 (36 బంతులు, 5ఫోర్లు, 2సిక్సర్లు) పరుగులతో రాణించి స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. వీరిద్దరి ఆట తీరుతో సునాయాసంగా గెలవాల్సి ఉంది.  అయితే 17వ ఓవర్లో సూర్య కుమార్ అవుట్ అయిన తర్వాత స్కోరు బోర్డు నెమ్మదిగా సాగింది. అయ్యర్, పంత్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. దీనితో మ్యాచ్ చివరి ఓవర్ వరకూ నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. పంత్ 17 పరుగులతో అజేయంగా నిలిచాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ రెండు, సౌతీ, శాంట్నర్, డేరిల్ మిచెల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.  కివీస్ కు మొదటి ఓవర్లోనే గట్టి దెబ్బ తగిలింది. భువీ బౌలింగ్ లో డేరిల్ మిచెల్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ గుప్తిల్, మార్క్ కెంప్మన్ రెండో వికెట్ కు 109 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. రవిచంద్రన్ అశ్విన్ ఈ జంటను విడదీశాడు. కెంప్మన్ 60 పరుగులు (50 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లు)  చేసి ఔటయ్యాడు.  గుప్తిల్ 42 బంతుల్లో 3 ఫోర్లు, 4సిక్సర్లతో 70 పరుగులు చేసి 18వ ఓవర్లో ఔటయ్యాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164  పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువీ, అశ్విన్ చెరో రెండు, దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.

సూర్యకుమార్ యాదవ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఇండియా ­1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఎల్లుండి శుక్రవారం రాంచీ లో రెండో టి 20 జరగనుంది.

Must Read :  రోహిత్ శర్మకే సారధ్యం

RELATED ARTICLES

Most Popular

న్యూస్