Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Sampoornesh Babu Cauliflower Coming:
‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం ‘క్యాలీ ఫ్లవర్‌’ తో వస్తున్నారు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ సంయుక్తంగా, ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని నవంబరు 26న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు.

ఈ సందర్భంగా హైద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో హీరోయిన్ వాసంతి మాట్లాడుతూ.. ‘మొదటిసారిగా సంపూర్ణేష్ బాబుతో పని చేశాను. ఆయనెంతో మంచి వారు. డౌన్ టు ఎర్త్. ఎంతో సహకరించేవారు. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చినందుకు దర్శకుడికి థ్యాంక్స్. కెమెరామెన్ నన్ను చాలా అందంగా చూపించారు. ప్రజ్వల్‌ అద్భుతంగా సంగీతాన్ని అందించారు. నవంబర్ 26న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ “మగాడు తన శీలాన్ని కాపాడుకుంటే దేశంలో ఎలాంటి నేరాలు జరగవు. ఒక మగాడి శీలం పోతే దాని కోసం చేసే పోరాటమే క్యాలీ ఫ్లవర్ కథ. శీలాన్ని కాపాడే శీల రక్షకుడే ఈ క్యాలీ ఫ్లవర్. నేను ఎన్ని సినిమాలు చేసినా కూడా హృదయకాలేయం, కొబ్బరిమట్ట, సింగం 123 లాంటి సినిమాలే గుర్తున్నాయి. ఇప్పుడు రాబోతోన్న ‘క్యాలీ ఫ్లవర్’ కూడా అదే కోవకు చెందుతుంది. సాయి రాజేష్ అన్న నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాడు. ఆయనతో వర్క్ చేస్తే ఎలా అనిపించిందో.. ఈ మూవీ డైరెక్టర్ రాధాకృష్ణతో పని చేసినప్పుడు కూడా అలానే అనిపించింది. తన శాడిజాన్ని చూపించి.. నాలోంచి నటుడిని బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని నవ్వించే ప్రయత్నమే ‘ఈ క్యాలీ ఫ్లవర్’.

“నిర్మాతలకు ఇది మొదటి సినిమా. అయినా కూడా కరోనా సమయంలో నిబంధనలు పాటిస్తూ.. సినిమాకు ఏం కావాలో అది సమకూర్చారు. కంటిన్యూగా 20 రోజులు షూట్ చేశాం. షెడ్యూల్ పూర్తి చేశాం. షూటింగ్ చేయడం ఒకెత్తు అయితే.. అందరికీ పని కల్పించడం మరో ఎత్తు. అందరూ హ్యాపీగా ఫీలయ్యారు. క్యాలీ ఫ్లవర్‌తో మనం కూర వండుకోవచ్చు. పచ్చడి చేసుకోవచ్చు. సాంబార్ చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. ఈ సినిమాలో కూడా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇది అద్భుతమైన సినిమా అవుతుంది. త్వరలోనే ఓ పాట రాబోతోంది. హీరో రేప్‌కు గురైన తరువాత వచ్చే పాట అది. అద్భుతంగా ఉంటుంది”

“సినిమా హిట్ అయితే దానికి కారణం ఆడియెన్స్. తేడా కొట్టిందంటే అది నా వల్లే అని నేను మనస్ఫూర్తిగా తీసుకుంటాను. ఈ సినిమా గనుక హిట్ అయితే ఇంకో పది సినిమాలు రెడీగా ఉంటాయి. నా నుంచి ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చే ప్రయత్నం చేశాం. నన్ను నమ్మండి. డేట్స్ కొంచెం అడ్జస్ట్ కాకపోవడంతో ఇలా కాస్త ముందుకు వస్తున్నాం. ఇది ఎంత వరకు రీచ్ అవుతుందో మాకు తెలియడం లేదు. మా ప్రయత్నం మేం చేస్తున్నాం. నవంబర్ 26న థియేటర్లోకి రాబోతోన్నాం. మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు’ అని  సంపూర్ణేష్‌బాబు అన్నారు.

Also Read : సంపూర్ణేష్ బాబు ‘క్యాలీఫ్లవర్‌’ 26న విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com