శ్రీలంక తో జరిగిన మొదటి టి-20 మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. కొలంబో లోని ప్రేమదాస స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దాసన్ శనక బౌలింగ్ ఎంచుకున్నారు. ఇండియా జట్టులో పృథ్వీ షా, వరుణ్ చక్రవర్తిలు ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టి-20 ల్లో ఆరంగ్రేటం చేశారు.
అయితే పృథ్వీ షా నిరాశపరిచాడు, ఇన్నింగ్స్ మొదటి బంతికే డకౌట్ గా వెనుదిరిగాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ తో కలిసి సంజూ శామ్సన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. రెండో వికెట్ కు 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ తో 27 పరుగులు చేసిన శామ్సన్ హసరంగా బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. వన్డే సిరీస్ లో సత్తా చాటి ప్లేయర్ అఫ్ ద సిరీస్ గెల్చుకున్న సూర్య కుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లోనూ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్సర్ తో 46 పరుగులతో రాణించాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులుచేసింది.
165 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన శ్రీలంక జట్టులో చరిత్ అసలంక, ఓపెనర్ ఫెర్నాండో మినహా ఇతర బ్యాట్స్ మెన్ రాణించలేక పోయారు. భువనేశ్వర్ బంతితో తన సత్తా చాటాడు. 3.3 ఓవర్లలో 22 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. చహార్ కు 2, క్రునాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, చాహల్, వరుణ్ చక్రవర్తిలు తలా ఒక వికెట్ సాధించారు. 18.3 ఓవర్లలో 126 పరుగులకే శ్రీలంక ఇన్నింగ్స్ కుప్పకూలింది. భువీకి ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.