సిపాయిల తిరుగుబాటుకు సరిగ్గా పది సంవత్సరాల ముందు 1846-47 మధ్య కాలంలో ఆంగ్లేయులపై తిరుగుబాటు జెండా ఎగురవేసి ముప్పుతిప్పలు పెట్టి గడగడలాడించిన రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.
కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్ల తాలుకా ఉయ్యాలవాడ మండలంలోని రూపనగుడి గ్రామం ఈయన జన్మస్థలం. తండ్రి పెదమల్లారెడ్డి. తల్లి సీతమ్మ. ఇతను ఎక్కువ కాలం ఉయ్యాలవాడలోనే వుండడంతో ఇతనికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని పేరు వచ్చింది. ఇతని తండ్రి పెదమల్లారెడ్డి ఒక పాలెగాడు. మన్రో కాలంలో పాలెగాళ్ళ జాగీర్లన్నీ బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకొని వారికి పింఛను ఏర్పాటు చేశారు. అలా ఉయ్యాలవాడ జాగీరును వశం చేసుకొని నెలకు డెబ్బై రూపాయల పింఛను ఇచ్చేవారు. ఇందులో సగం పెదమల్లారెడ్డి సోదరుడు చినమల్లారెడ్డికి పోయేది. మిగతా ముప్ఫై ఐదు రూపాయల్లో పెదమల్లారెడ్డి ముగ్గురు కుమారులకు సమానంగా పంచగా నరసింహారెడ్డికి పదకొండు రూపాయలా పది అణాల ఎనిమిది పైసలు వచ్చేది.
నొస్సం జమీందారు జయరామిరెడ్డి. ఇతడు కొత్తకోట, జయరామపురం, కోవెలకుంట్ల, గిద్దలూరు, కంభం ప్రాంతాలలోని 70 గ్రామాలకు అధిపతి. బ్రిటీష్ వారు చిన్న చిన్న రాజ్యాలను, సంస్థానాలను తమ సామ్రాజ్యంలో కలుపుకొంటూ వారిలో తిరుగుబాటు రాకుండా పెన్షన్ ఇచ్చే పద్ధతిని ఏర్పాటు చేయసాగారు. జయరామిరెడ్డికి నెలనెలా వెయ్యి రూపాయల పింఛను ఇచ్చేవారు. ఇతనికి ఒక కొడుకు, కూతురు వున్నారు. కొడుకుకు పిల్లలు లేరు. అతను చనిపోవడంతో కూతురు కొడుకైన నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. కానీ జయరామిరెడ్డి మరణానంతరం ఆంగ్లేయ ప్రభుత్వం వారసులకు పింఛను ఇవ్వకుండా నిలిపివేసింది.
ఇంగ్లీషువారు క్రమక్రమంగా కట్టుబడి వంశపారంపర్య హక్కులు రద్దు చేస్తూ వారి మాన్యాలను స్వాధీనం చేసుకోసాగారు. ఇది కట్టుబడి బంట్రోతులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. అప్పటి కలెక్టర్ గా వున్న జె. హెచ్.కాక్రేన్ వైఖరితో జాగీరులు, ఇనాంలు కోల్పోయిన నవాబులు, పాలెగాళ్ళు, శిస్తు కట్టలేని ప్రజలు, పుల్లరి కోల్పోయిన కొండజాతుల ప్రజలు అంతా తీవ్ర అసంతృప్తితో రగిలిపోసాగారు.
Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv
1846 జూన్ నెలలో తనకు రావాల్సిన పింఛను కోసం నరసింహారెడ్డి ఒక చీటీ రాసి సేవకున్ని కోవెలకుంట్ల ట్రెజరీకి పంపించాడు. తహశీల్దార్ పింఛను ఇవ్వకపోగా “ఆ నరసింహ దాసరి క్రింద ఇంకో దాసరా? ఆ నరసింహ దాసరినే రమ్మనుపో” అంటూ అవహేళన చేశాడు. దీంతో నరసింహారెడ్డి ఆత్మాభిమానం దెబ్బ తినింది. “రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నరసింహదాసరే నీ వద్దకు వస్తాడు కాసుకో” అంటూ అదే సేవకునితో తిరిగి కబురు పంపాడు.
తరువాతరోజు నరసింహారెడ్డి ఐదువందల మంది బోయల్ని సైన్యంగా సమకూర్చుకొని పట్టపగలు చెప్పిన సమయానికి కోవెలకుంట్ల ట్రెజరీ మీద దాడి చేశాడు. అడ్డం వచ్చిన తహశీల్దారు, కాపలావాని తలలు నరికి పోలీసుల్ని చంపి ట్రెజరీలోని సొమ్మంతా దోచుకొని తగలబెట్టాడు. ఆ తలల్ని తీసుకొని వచ్చి నయనాలప్ప కొండ మీది శివాలయం పక్కనే వున్న గుహల్లో దాచిపెట్టాడు.
ట్రెజరీని దోచుకున్న విషయం కడప కలెక్టర్ కాక్రేన్ కు తెలిసింది. పోలీసులు నరసింహారెడ్డి వద్దకు వచ్చి కోవెలకుంట్లలో జరిగిన హత్యల గురించి ఆయన్నే ప్రశ్నించారు. దానికి నరసింహారెడ్డి అమాయకంగా తనకేమీ తెలియదని, బహుశా అవుకు రాజులు చేసి వుండవచ్చునేమో అని చెప్పాడు. దాంతో బ్రిటీష్ వారు అవుకు రాజును బంధించి కారాగారంలో వేశారు.
తరువాత పోలీసులు పరిశోధన చేసి కొత్తకోట బురుజుపై నరసింహారెడ్డి ఫిరంగి, నయనాలప్ప కొండల్లో దాచిన శిరస్సుల్ని కనుగొన్నారు. నరసింహారెడ్డి అనుచరుల్ని బంధించి జరిగిన విషయమంతా కనుక్కొని బంధించడానికి పోలీసుల్ని పంపారు. కానీ వాళ్ళు నరసింహారెడ్డిని ఏమీ చేయలేక తన్నులు తిని తిరిగి వచ్చారు.
పోలీసులు అతన్ని బంధించడానికి భయపడసాగారు. నరసింహారెడ్డి తిరుగుబాటుతో అంతవరకూ అసంతృప్తితో రగిలిపోతున్న వారంతా ఒకొక్కరే ఏకం కాసాగారు. కట్టుబడి బంట్రోతులు, చెంచులు, వడెర్డలు, బోయలు, యానాదులు, కొందరు బ్రాహ్మణులు అతని సైన్యంలో చేరిపోయారు. అనేకమంది జమీందారులు, సంస్థానాధీశులు, నవాబుల అండదండలు కూడా వారికి లభించాయి. దాదాపు తొమ్మిదివేల దాకా వీరి సైన్యం పెరిగింది. గోసాయి వెంకన్న, ఒడ్డె ఓబన్న నరసింహారెడ్డికి నమ్మినబంట్లుగా వుండేవారు.
దానితో కలెక్టర్ కాక్రేన్ నరసింహారెడ్డిని బంధించడానికి పెద్ద సైన్యాన్ని పంపించమని దత్తమండలాల సైనికాధికారికి కబురు పంపాడు. కడప, కర్నూలు, బళ్ళారి, కంభం, సికింద్రాబాద్ ల నుంచి సైన్యం నరసింహారెడ్డిని బంధించడానికి అన్నివైపులా చుట్టుముట్టసాగింది.
కంభం నుంచి వస్తున్న లెఫ్టినెంట్ వాట్సన్ నాయకత్వంలోని సైన్యానికి, నరసింహారెడ్డి సైన్యానికి మధ్య 1846 జూలై 23న గిద్దలూరు సమీపంలో ఐదుగంటల పాటు హోరాహోరీగా యుద్ధం జరిగింది. ఇరువైపులా అనేకమంది చనిపోయారు. ఆఖరికి వాట్సన్ నరసింహారెడ్డి ధాటికి తట్టుకోలేక తన సైన్యాన్ని తీసుకొని సెట్టివీడు గ్రామానికి పారిపోయాడు. నరసింహారెడ్డి తన సైన్యంతో ముండ్లపాడు గ్రామం చేరుకున్నాడు.
తరువాత రోజు వాట్సన్ సైన్యానికి, కర్నూలు నుంచి వచ్చిన కెప్టెన్ నాట్, కెప్టెన్ రసూల్ సైన్యాలు కలిశాయి. వీరికి కంభం తహశీల్దార్ తోడుగా నిలిచాడు. అందరూ కలసి ముండ్లపాడు వద్ద నరసింహారెడ్డిపై దాడి చేశారు. ఆ యుద్ధంలో నరసింహారెడ్డి కంభం తహశీల్దారును చంపి తన సైన్యంతో తప్పించుకొన్నాడు. వీరు కొత్తకోటలో తన తండ్రి నిర్మించిన కోటకు అనుచరులతో చేరుకున్నారు. కోటపై ఒక బురుజు నిర్మించి పందొమ్మిది ఫిరంగులను చుట్టూరా ఏర్పాటు చేసి గొరిల్లా తరహా పోరాటానికి తెర తీశాడు. నల్లమల అడవుల్లో రోజుకో ప్రదేశం మారుస్తూ బ్రిటీష్ సైన్యంపై దాడి చేస్తూ వారిని ముప్పుతిప్పలు పెట్టసాగాడు.
రోజురోజుకూ నరసింహారెడ్డికి ప్రజల్లో పెరిగిపోతున్న పలుకుబడిని గమనించిన ఆంగ్లేయ ప్రభుత్వం అతన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలని అతని కుటుంబాన్ని కడపలో బంధించింది. కానీ అతను లొంగిపోలేదు. యుద్ధంలో పట్టుబడిన నరసింహారెడ్డి సైనికుల్ని హింసించి వారి ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నారు. నరసింహారెడ్డికి వంట చేసే పనిమనిషి పేరు జానకమ్మ. జానపద గీతాలలో ఈమెను అతని ఉంపుడుగత్తెగా కొందరు చెబుతారు. ఆమెకు కావలసినంత ధనమిచ్చి నరసింహారెడ్డి ఎర్రమల, నల్లమల కొండల మధ్య గల పేరుసోమల కొండల్లోని జగన్నాథ దేవాలయంలో వున్నాడని సమాచారం సేకరించారు. కలెక్టర్ కాక్రేన్ మొత్తం సైన్యాన్నంతా తీసుకొని రహస్యంగా కొండల చుట్టూ మోహరించి ఒక్కసారిగా అన్ని వైపుల నుంచి తుపాకులతో కాలుస్తూ దాడి చేశారు. ఇరు సైన్యాల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. బ్రిటీష్ తుపాకుల ముందు నరసింహారెడ్డి సైన్యం నిలువలేక పోయింది. ఆఖరికి గాయపడ్డ నరసింహారెడ్డిని, అతని సైన్యాన్ని 1846 అక్టోబర్ 6న బంధించగలిగారు.
నరసింహారెడ్డిపై రాజద్రోహ నేరం మోపి విచారణ కోసం గ్రామస్థులను పిలువగా అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఒక్కరు కూడా పోలేదు. చివరికి వారే విచారణ చేసి 1847 ఫిబ్రవరి 22న కోవెలకుంట్ల వద్ద గల జుర్రేరు వాగు వద్ద జనులందరూ చూస్తుండగా నరసింహారెడ్డిని ఉరి తీశారు. ప్రజల్లో తమ పట్ల తిరుగుబాట్లు తలెత్తకుండా, వారిని భయభ్రాంతులకు గురి చేయడం కోసం మరణించిన అతని శిరస్సును ఉయ్యాలవాడ కోట గుమ్మానికి వేలాడ తీశారు. 1877 వరకు ఆ శిరస్సు తాలూకు కపాలం ఆ కోట గుమ్మానికి అలాగే వేలాడుతూ చివరికి గుమ్మంతో పాటే శిథిలమైంది.
Youtube : https://www.youtube.com/@dhatritvtelugu
Facebook : https://www.facebook.com/dhatritelugutv
Instagram: https://www.instagram.com/dhatritelugutv/
Twitter :https://x.com/Dhatri_Tv
నరసింహారెడ్డి భౌతికంగా మరణించినా అతని కథ జానపదగేయాల్లో తిరిగి బ్రతికింది. అనేకమంది ఈ కథను పల్లెల్లో పాడుతూ అతని పౌరుషాన్ని, బ్రిటీష్ వారిని ఎదిరించిన తీరును వేనోళ్ళ కొనియాడసాగారు. స్వాతంత్య్ర ఉద్యమంలో రేనాటి ప్రాంత ప్రజల్లో దేశభక్తిని రగిలిస్తూ, స్వాతంత్ర్య కాంక్షను పెంచడానికి ఈ కథ ఒక కారణమైంది.
-డా. ఎం. హరికిషన్
9441032212
(కర్నూలు జిల్లా చరిత్ర పుస్తకం నుండి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథనం యథాతథంగా. ఐధాత్రిలో ప్రచురణకు అనుమతించినందుకు రచయితకు కృతఙ్ఞతలు))
రేపు:-
నంద్యాల సీమ-6
“ఆళ్ళగడ్డ శిల్పాలు”