Sunday, January 19, 2025
HomeTrending Newsకశ్మీర్ లో వేర్పాటువాదుల కదలికలు

కశ్మీర్ లో వేర్పాటువాదుల కదలికలు

ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ లు అధికారం చేపట్టాక జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాట్లు పెరిగాయని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జైష్ ఎ మహమ్మద్ , లష్కర్ ఎ తోయిబా గ్రూపులు కశ్మీర్ లోయలో బలంగా ఉన్నాయి. వీటికి పాకిస్తాన్ లోని హక్కాని నెట్ వర్క్ తో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు గ్రూపులు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ తో కలిసి పనిచేయకపోయినా హక్కాని నెట్ వర్క్ వీరికి ఉమ్మడి కేంద్రంగా ఉంది. ఖైబర్ పఖ్తుంక్వా రాష్ట్రంలో హక్కాని నెట్ వర్క్ క్షేత్ర స్థాయిలో బలంగా విస్తరించి ఉంది. నిరుద్యోగ యువతను ఉపాధి పేరుతో ఉగ్రవాదంలోకి దింపటం హక్కాని నెట్ వర్క్ పని.

370 ఆర్టికల్ రద్దు, జమ్మూ కశ్మీర్ రాష్ట్ర విభజన తర్వాత పాకిస్తాన్ సరిహద్దుల్లో టెర్రరిస్టుల కదలికలు కొంత తగ్గు ముఖం పట్టాయి. 2018లో కశ్మీర్ లోయలో వేర్పాటువాదం పతాకస్థాయిలో ఉండేది. హిమాలయ రాష్ట్రంలో ప్రతి రోజు ఎదో ఒక చోట ఉగ్రవాదుల బీభత్సం, భారత బలగాల ప్రతి దాడులతో రక్తం చిందింది. అల్లకల్లోలంగా ఉన్న రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ప్రశాంతత నెలకొంది. అయితే హక్కాని నెట్ వర్క్ సహకారంతో తాలిబాన్ సానుభూతిపరులు ఇప్పుడు కశ్మీర్ వైపు వస్తున్నారని భారత నిఘా వర్గాలకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో దేశంలో అన్ని సరిహద్దు రాష్ట్రాలని కేంద్రం అప్రమత్తం చేసింది. సరిహద్దుల్లో నిఘా పెంచారు.

భారత నిఘా వర్గాల సమాచారంలో వాస్తవం ఉందని యూరోపియన్ యూనియన్ కూడా ద్రువీకరించింది. రెండు నెలల నుంచి సుమారు వంద మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సు ద్వారా జమ్ముకాశ్మీర్ లోకి దొంగ చాటుగా చొరబడ్డారని ఖచ్చితమైన సమాచారం ఉంది. చైనా మీదుగా నేపాల్ సరిహద్దుల నుంచి ఉగ్రవాదులు చొరబడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని యూరోపియన్ యూనియన్ హెచ్చరిస్తోంది.

నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నట్టుగానే ముష్కర మూకలు ఇటీవల ఇద్దరు ఉపాధ్యాయులను కాల్చి చంపారు. చనిపోయిన వారిలో ఒకరు సిక్కు కాగా మరొకరు కశ్మీర్ పండిట్. పాటశాలలో అందరి గుర్తింపు కార్డులు తీసుకొని అందులో వీరిద్దరినే కాల్చటం ఖచ్చితంగా మత కోణంలోనే జరిగిందని విమర్శలు వస్తున్నాయి. అంతకు ముందు రోజు ఓ మెడికల్ షాపు యజమానిని షాపులోనే కాల్చి చంపారు. మెడికల్ షాపు యజమాని కూడా కశ్మీర్ పండిట్. వీటన్నింటిని పరిశీలిస్తే లోయలో కష్మిరియత్ సంస్కృతిని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్