మహిళల టి 20 వరల్డ్ కప్ లో భారత జట్టు సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. నేడు ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ కు వర్షం ఆటకం కలిగించడంతో డక్ వర్త్ లూయీస్ పధ్ధతి ప్రకారం 5 పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది.
సెయింట్ జార్జ్ పార్క్ లో జరిగిన మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు 62 పరుగులు జోడించింది, షఫాలీ 24 చేసి ఔట్ కాగా, హర్మన్ ప్రీత్ (13); జెమైమా రోడ్రిగ్యూస్ (19) పరుగులు చేసి పివిలియన్ చేరారు. స్మృతి మందానా 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేసి 19వ ఓవర్లో ఔటైంది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.
ఐర్లాండ్ బౌలర్లలో లారా దేలానీ మూడు; ప్రెండర్ గాస్ట్ రెండు; కెల్లీ ఒక వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికే రెండో పరుగుకోసం యత్నించి అమీ హంటర్ (1)రనౌట్ కాగా, ఐదో బంతికి ప్రెండర్ గాస్ట్ డకౌట్ గా వెనుదిరిగింది. అయితే మరో ఓపెనర్ గాబీ లూయీస్ (32), కెప్టెన్ లారా డేలానీ(17)లు ఇన్నింగ్స్ చక్కదిద్ది 8.2 ఓవర్లకు 54 పరుగులు చేశారు. ఈ దశలో వర్షం ఆటకం కలిగించింది. ఆ సమయానికి ఇండియా డి ఎల్ ఎస్ ప్రకారం ఐదు పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఆట కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో ఇండియాను విజేతగా ప్రకటించారు.
స్మృతి మందానా కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
గ్రూప్ ‘బి’ నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్, ఇండియా సెమీస్ కు చేరుకోవడంతో రేపు జరగాల్సిన ఇంగ్లాండ్-పాకిస్తాన్ మ్యాచ్ నామమాత్రమే కానుంది.