Sunday, January 19, 2025
HomeTrending Newsహాకీ ప్లేయర్‌ రజనీకి అండగా ఉంటాం: జగన్

హాకీ ప్లేయర్‌ రజనీకి అండగా ఉంటాం: జగన్

అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ. రజనీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి 25 లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇటీవలే ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టులో సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహించిన రజని తన కుటుంబ సభ్యులతో కలిసి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు.  టోక్యో ఒలిపింక్స్ కాంస్య పతక పోరులో భారత మహిళల హాకీ జట్టు చివరివరకూ పోరాడి ఓడిపోయింది. త్రుటిలో కాంస్య పతాకాన్ని చేజార్చుకుంది. జట్టు సాధించిన విజయాల్లో రజనీ కీలక పాత్ర పోషించారు.

రజనీని ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. గత ప్రభుత్వంలో రజనీకి ప్రకటించి, పెండింగ్‌లో ఉంచిన బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. తిరుపతిలో 1000 గజాల నివాస స్ధలం, నెలకు రూ. 40 వేల చొప్పున ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వాలని ఆదేశించారు.

రజనీ స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం. దక్షిణాది రాష్ట్రాల నుంచి హకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా ప్రత్యేక గుర్తింపు పొందారు.  2016లో జరిగిన రియో ఒలింపిక్స్ తో పాటు  2020 టోక్యోలో కూడా పాల్గొన్న క్రీడాకారిణి ఆమె. 110 అంతర్జాతీయ హకీ మ్యాచ్‌లలో పాల్గొని ప్రతిభ కనపరిచారు.

సిఎంతో జరిగిన సమావేశంలో రజనీ కుటుంబ సభ్యులు, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి, రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, శాప్‌ వీసీ అండ్‌ ఎండీ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్