Thursday, April 18, 2024
HomeTrending Newsఈటెల ఏం చేస్తారో చెప్పాలి: హరీష్ రావు

ఈటెల ఏం చేస్తారో చెప్పాలి: హరీష్ రావు

హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటేస్తే ప్రజలకు ఏం చేస్తారో ఈటెల చెప్పాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి. హరీష్ రావు సవాల్ చేశారు. మంత్రిగా చేయలేని పనులు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. హుజురాబాద్ లో మంత్రులు కొప్పు ఈశ్వర్, గంగుల కమలాకర్, ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా ఖరారైన గెల్లు శ్రీనివాస్ లతో కలిసి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇల్లంతకుంట టిఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదనీ, ఆ పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.

బిజెపిలో చేరినప్పుడే ఈటెల పని అయిపోయిందని, కేసిఆర్ ఈటెలను ఎంతో గౌరవించి ఎమ్మెల్యే, మంత్రిని చేసి ప్రాధాన్యత ఇస్తే తల్లి లాంటి పార్టీని గుండెల మీద తన్ని వెళ్లిపోయారని హరీష్ రావు విమర్శించారు. రైతు బంధు కార్యక్రమాన్ని వద్దన్న ఈటెల అదే పథకం ద్వారా 10 లక్షల రూపాయల సాయం పొందారని వెల్లడించారు. 200 కుంటలు పొలం ఉన్న గెల్లుకు, 200 ఎకరాలున్న ఈటెలకు మధ్య పోటీ జరుగుతోందని చెప్పారు. బిజెపిలో చేరాక ఈటెల భాష మారిపోయిందని, కేసీయార్ ను రా అంటూ సంబోధిస్తున్నారని, ఈటెల గెలిస్తే ప్రజలు ఓడిపోతారని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతోందని హరీష్ రావు ఆరోపించారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసిందని,  బి.ఎస్.ఎన్.ఎల్.లో 50 వేల మంది ఉద్యోగులను తొలగించిందని, రిజర్వేషన్లు ఊడగొడుతోందని, రైల్వేలు,  ఎల్ఐసిని ప్రైవేటు పరం చేస్తోందని వివరించారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న బండి సంజయ్ ఏ గ్రామంలోనైనా కనీసం 10 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారా అని నిలదీశారు. గెల్లు శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.

తనకు టికెట్ ఇచ్చినందుకు సిఎం కేసిఆర్ కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. కేసీయార్ ఉద్యమ స్పూర్తితోనే తాను పని చేశానని, ఇకపై కూడా ప్రజలకు అందుబాటులో ఉంది సేవ చేశానని హామీ ఇచ్చారు. తనకు కేవలం రెండు కుంటల భూమి మాత్రమే ఉందని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్