Tuesday, September 17, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనా పక్కన చోటున్నది ఒక్కరికే - ఆ ఒక్కరు ఎవరన్నది నా కెరుకే

నా పక్కన చోటున్నది ఒక్కరికే – ఆ ఒక్కరు ఎవరన్నది నా కెరుకే

ఏదన్నా ఒక స్థలం, ఇల్లు, ఆఫీస్ … వీటికి అలవాటు పడటం మన రక్తంలోనే ఉంటుందేమో! నాలుగు రోజులు వరసగా ఒక చోట కూర్చుంటే ఆ సీట్ మీద అధికారం మనదే అనుకుంటాం. అందుకే ఐదేళ్లు ఎమ్మెల్యే, మంత్రి పదవులు అనుభవించే రాజకీయ నాయకులు సీట్ వదులుకోడానికి తెగ బాధపడిపోతారు. ముఖ్యమంత్రి, ప్రధాని వంటి పదవుల్లో ఉన్నవారు తమ సీట్ పోతుందని కలలో కూడా అనుకోరు. ఎప్పటికీ ఆ సీట్ తమదే అనుకుంటారు. అయితే వీరికో గొప్ప వెసులుబాటు ఉంది . తమ పక్క సీట్ లో ఎవరుండారో నిర్ణయించగలరు. ఎడాపెడా ఇతరుల సీట్లు లాగేసుకోగలరు కూడా. ఈ కారణం చేతే రాజకీయాలు అతిపెద్ద పరిశ్రమ ఇప్పుడు.

ఆ సంగతి అలా ఉంచితే పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలూ తక్కువేం కాదు. ఒక్కోసారి వీరు ప్రభుత్వంలో ఉన్నవారి ఆసనాలూ లాగేసుకోగలరు. అలాగే తమ శక్తిని బట్టి, హోదాని బట్టి ఇతరుల స్థానాలు లాగేసుకునేవాళ్ళు మనచుట్టూ చాలామందే ఉంటారు. మరి మన సామాన్యుల చేతుల్లో ఏమీ లేదా?

ఈ మధ్య సినిమా హాల్లో సీట్ ఎంచుకునే సౌకర్యం వచ్చింది. అలాగే కొన్నిసార్లు బస్సులో, ట్రైన్ లో, ఫ్లైట్ లో కూడా. కానీ ఇక్కడ ప్రధానంగా మన పక్కన ఎవరు ఉండాలో మనం నిర్ణయించలేం. దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడేది మహిళలు. గతంలో కన్నా మహిళలు ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. ఒంటరిగా విదేశాలకు ప్రయాణించే మహిళలు 30 శాతం పైనే ఉంటున్నారని ప్రయాణ సంస్థలు వెల్లడిస్తున్నాయి. అలా ఒంటరిగా ప్రయాణించే మహిళల ఇబ్బందులేంటి ?

1. కిటికీ పక్క సీట్ లేదా మధ్య సీట్ ఉండి, అటో ఇటో మగవాళ్ళు ఉంటేవాళ్ళని దాటుకుని వెళ్లడం
2. మోచేయి ఆనించే చోట చాలాసార్లు మగవారు దర్జాగా కూర్చోడం. ఫలితంగా అసౌకర్యం
3. పక్క సీట్ లో మగవారు ఉంటే నిద్ర పోవడానికి కూడా సంకోచమే. ఎక్కడ తగులుతామో అని.

ఇలాంటి ఇబ్బందులన్నీ గమనించారు ఇండిగో ఎయిర్లైన్స్ వారు. అందుకే తమ పక్కన ఎవరున్నారో చూసి సీట్ ఎంచుకునే సౌకర్యం మహిళా ప్రయాణికులకు కల్పించారు. పక్కన మహిళలు ఉంటే పైన పేర్కొన్న ఇబ్బందులు ఉండవని వారు భావించారు. సహజం గానే దీనిమీదా వాదోపవాదాలు మొదలయ్యాయి. వీటికన్నా మహిళల భద్రతకు తీసుకోవలసిన చర్యలు ఇంకా ఉన్నాయని కొందరు అంటుంటే, మగవారికీ ఈ సౌకర్యం ఉండాలని కొందరంటున్నారు. అయితే మహిళల ఇబ్బందులు గమనించి ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చిన ఇండిగో సంస్థ తీరు అభినందనీయం.

నిజమే, ఒంటరిగా ప్రయాణించే మహిళా ప్రయాణికులకు గాల్లోనే కాదు, నేలపైనా భద్రత ఉండాలి. ఆ దిశగా ప్రయాణించడానికి ఇప్పడిది మొదటి అడుగు. ఇటువంటి అడుగులు వడివడిగా పడాలని కోరుకోడమే మనం చేయగలిగింది. ఇకముందు ఇండిగో మహిళా ప్రయాణికులు నా పక్కన చోటున్నది ఒక్కరికే- ఆ ఒక్కరు ఎవరన్నది నా కెరుకే అని పాడుకుంటూ ఉల్లాసంగా ఎగిరిపోవచ్చు.

-కె.శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్