Sunday, January 19, 2025
HomeTrending Newsఅరుణాచల్ ప్రదేశ్ పై చైనా పాత పాట

అరుణాచల్ ప్రదేశ్ పై చైనా పాత పాట

చైనా తన కపట బుద్దిని మరోసారి బయట పెట్టుకుంది. అరుణాచల్‌ను భారత్‌ ఆక్రమించుకుందని మరోమారు నోరుపారేసుకుంది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్‌ జియాన్‌ ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. భారత్‌, చైనాల మధ్య సరిహద్దు వివాదం పరిష్కారం కాలేదని… గతంలో అరుణాచల్‌ చైనాలో భాగంగా ఉండేదన్నారు. 1987లో భారత్‌ ఆక్రమించుకొని అరుణాచల్‌ ప్రదేశ్‌గా మార్చుకుందని ప్రకటించారు.

ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటన అనంతరం, ఆ భూభాగం తమదేనంటూ చైనా పదే పదే ప్రకటనలు చేస్తున్నది. దానికితోడు ప్రధాని భూటాన్ పర్యటన చైనాకు కంటగింపుగా మారింది.

ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్‌లో అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ ద డ్రూక్‌ గ్యాల్పో’ను భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ చేతుల మీదుగా శుక్రవారం అందుకున్నారు. ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేతగా మోడీ నిలిచారు. అవార్డును మోడికి 2021లోనే ప్రకటించారు. అప్పటి నుంచి ఆ దేశానికి వెళ్లే అవకాశం ప్రధానికి రాలేదు.

భారత భూభాగంపై చైనా అసంబద్ధ వైఖరిని అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదేనంటూ మొండివాదన చేస్తున్న చైనాకు అమెరికా ప్రకటనతో గట్టి షాక్‌ తగిలింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌దేనని అమెరికా తేల్చి చెప్పింది.

చైనా వాదనను తీవ్రంగా ఖండిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్‌ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ వెల్లడించారు. వాస్తవాధీన రేఖ వెంట చైనా ఏకపక్షంగా చేస్తున్న ఆక్రమణ యత్నాలను వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

చైనా వైఖరి హాస్యాస్పదమంటూ భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై చైనా గుర్రుగా ఉంది. చైనా ఈ విధంగా ప్రకటనలు విడుదల చేయటం ఈ నెలలో ఇది నాలుగోసారి. అరుణాచల్‌ను ఆ దేశం దక్షిణ టిబెట్‌గా పేర్కొంటున్నది.

చైనా సరిహద్దుల వెంబడి అరుణాచల్ ప్రదేశ్ లో రోడ్డు రవాణా వ్యవస్థను కేంద్రం పూర్తి స్థాయిలో అధునీకరిస్తోంది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తోంది. అరుణాచల్ చివరి గ్రామంగా పేర్కొనే అంజావ్ జిల్లాలోని కిబుతు గ్రామాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2023 ఏప్రిల్ లో సందర్శించారు.

సూర్యుడి కిరణాలు భారత భూభాగంలో మొదటగా తాకే కిబితు చివరి గ్రామం కాదని దేశానికి మొదటి గ్రామం అని అమిత్ షా పేర్కొన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించిన అమిత్ షా చైనా సరిహద్దుకు 25 కిలోమీటర్ల దూరం ఉండే ఈ గ్రామానికి రహదారి సౌకర్యం ప్రారంభించారు.

సరిహద్దుల వెంట భారత్ చేపడుతున్న అభివృద్ధి పనులను ఓర్వలేని చైనా మళ్ళీ కయ్యానికి సిద్దం అవుతోంది. తైవాన్ తో భారత్ వాణిజ్య లావాదేవీలు నిర్వహించటం చైనాకు సుతారం ఇష్టం లేదు. ఆ మాట చెప్పకుండా ఈ విధంగా సరిహద్దుల్లో గిల్లికజ్జాలు పెట్టుకోవటం జిత్తుల మారి చైనా నైజం.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్