Friday, October 25, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనో క్లీన్ షేవ్...నో లవ్! సరికొత్త ఉద్యమం

నో క్లీన్ షేవ్…నో లవ్! సరికొత్త ఉద్యమం

అడ్డాలనాడే బిడ్డలు కానీ…గడ్డాలనాడా? అని తెలుగులో గొప్ప సామెత. కాలప్రవాహంలో ఎన్నెన్నో కథలకు, అనుభవాలకు, సందర్భాలకు కరిగిపోని సజీవ సాక్ష్యాలు సామెతలు. ఆ సామెతల్లోకి తొంగి చూడాలే కానీ…ఎన్నెన్నో వాస్తవాలు బయటపడతాయి. నిజానికి భాషకు ప్రాణం సామెతలు, జాతీయాలు, నుడికారాలు, వాడుక మాటలే. ఎక్కడ తెలుగు భాషకు అలాంటి జీవలక్షణమైన ప్రాణం మిగిలి ఉంటుందోనన్న భయం కొద్దీ వీటికి మనం వీలైనంత దూరంగా ఉంటాం. రైల్వే స్టేషన్లలో ఒక్కో పదాన్ని విరిచి, చంపి, జీవం లేకుండా వినిపించే అనౌన్స్ మెంట్ భాషలో ఉన్న కృత్రిమత్వం, యాంత్రికత అంటే మనకు చచ్చేంత ఇష్టం. తెలుగును ఇంగ్లిష్ లా మాట్లాడితే వెంటనే అప్రయత్నంగా వారికి గౌరవాభిమానాలతో పాదనమస్కారం చేయాలనిపించే భాషాసంస్కారం మనది. అయినా మన చర్చ సామెతల గురించి కాదు కాబట్టి…గడ్డాల గురించి మాత్రమే కాబట్టి…భాషను గాలికొదిలేసి…గడ్డాలకే పరిమితమవుదాం.

మధ్యప్రదేశ్ ముఖ్యపట్టణం ఇండోర్ లో కాలేజీ అమ్మాయిలు, పెళ్లీడుకొచ్చిన యువతులు కొంతమంది ఒకరోజు తూరుపు తెల్లారగానే రోడ్లమీద పడి ఒక ర్యాలీ నిర్వహించారు. దీన్ని నిరసన ప్రదర్శన అనాలో! ధిక్కార ప్రదర్శన అనాలో! డిమాండ్ల సాధనకోసం రోడ్లెక్కిన ర్యాలీ అనాలో! తెలియక మెయిన్ స్ట్రీమ్ మీడియా తికమకపడింది. సోషల్ మీడియా మాత్రం తనకెలా తోస్తే అలా వ్యాఖ్యానించింది.

“No clean shave, no love’:
Indore women’s unique dating demand for ‘no beard’ boyfriends sparks debate”
(గడ్డముందా? అయితే మీరు మా ప్రేమకు అనర్హులు. గడ్డమే ప్రేమకు అడ్డం)
అంటూ హిందుస్థాన్ టైమ్స్ ఇంగ్లిష్ దినపత్రిక చాలా ప్రాధాన్యంతో ప్రచురించిన ఈ వార్తమీద ఇప్పుడు గడ్డమున్న అబ్బాయిలు రగిలిపోతున్నారట.

ఆ ర్యాలీ వీడియో వైరల్ అయి దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యింది. ప్రజాస్వామిక మౌలిక సూత్రాలు, మహిళల స్వేచ్ఛ, స్వావలంబన, ఇష్టాయిష్టాల కళ్లజోడుతో చూస్తే- గడ్డం పెంచుకునే స్వేచ్ఛ అబ్బాయిలకెంత ఉంటుందో! గడ్డం పెంచుకున్న అబ్బాయిలను తిరస్కరించే అధికారం అమ్మాయిలకు కూడా అంతే ఉంటుంది. ఉండాలి కూడా.

ఇది చిన్న విషయంలా అనిపించినా అంత చిన్నది కాదు. క్లీన్ షేవ్ తో నిండు చందురుడిలా, పిండి వెన్నెల పండులా నిగనిగలాడే మోముతో మన్మథుడు మూర్ఛపోయే అందంతో తమ బాయ్ ఫ్రెండ్/కాబోయేవాడు/అయితే భర్త ఉండాలని ఈతరం అమ్మాయిలు ఎందుకు కోరుకుంటున్నారో బవిరి గడ్డం అబ్బాయిలు ఆలోచించకపోతే నష్టపోయేది అబ్బాయిలే!

ఎన్నో తరాలుగా అమ్మాయిల్లో గూడుకట్టుకున్న గడ్డాల బాధ ఇండోర్ లో ఇలా కట్టలు తెంచుకున్నట్లుంది. ఇన్నేళ్లల్లో ఎప్పుడూ లేనిది ఇప్పుడే గడ్డాలమీద ప్రత్యక్ష పోరాటానికి దిగడం వెనుక షేవింగ్ క్రీమ్ కంపెనీల విదేశీ హస్తం ఉండి ఉండవచ్చని గడ్డాగ్రేసరచక్రవర్తులు గడ్డం దువ్వుకుంటూ లోలోపల దీనికి కౌంటర్ ఉద్యమాలు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు.

మహాభారతంలో శకుని గడ్డం దువ్వి పాచిక వేస్తే…పాండవులకు పన్నెండేళ్ల అరణ్యవాసం; ఒక ఏడు అజ్ఞాతవాసం కలిపి పదమూడేళ్లు పందెపు ఓటమి శిక్షగా దక్కింది. ఆధునిక భారతంలో గడ్డమున్న తాము కౌంటర్ ఉద్యమ పాచిక వేస్తే…తమకే అరణ్యవాసం; పెళ్లికాని శాశ్వత అజ్ఞాతవాసం శిక్షలుగా దక్కేలా ఉన్నాయని యువకులు అంతర్మథనంలో పడ్డారట.

దీనిమీద సోషల్ మీడియాలో యువకులు రెండుగా చీలిపోయి కామెంట్ల యుద్ధం చేసుకుంటున్నారు. “ఈ యువతుల డిమాండు కరెక్టే. అబ్బాయిలు నీట్ గా ఉండాలి కదా! గడ్డంతో చింపిరి చింపిరిగా వికారంగా ఉంటారు” అని ఒక వర్గం;  “ఈ రోజు గడ్డం అడ్డమంటారు. రేపు నెత్తిన జుట్టే అడ్డమంటారు. అప్పుడు బోడి గుండుతో ఉండాలా? దీనికి అంతెక్కడ? నథింగ్ డూయింగ్. ఆరు నూరైనా…నూరు ఆరైనా…అగ్రహారం బీడైనా…అటు సూర్యుడు ఇటు పొడిచినా…ఇటు సూర్యుడు అటు పొడిచినా…గడ్డం తీయకండి బ్రో! మహా అయితే పెళ్లి కాదు. అంతే కదా! తగ్గద్దు బ్రో!” అని మరొక వర్గం వాదించుకుంటున్నాయి.

సామెతతో మొదలుపెట్టాం కాబట్టి అదే సామెతతో ఉపసంహారం చేస్తే సరి. “అడ్డాలు…గడ్డాలు…” సామెతలో కూడా పురుషాధిక్యతే ఉంది. ఇండోర్ అమ్మాయిలకు ఈ విషయం తెలిస్తే ముందు గడ్డం సామెతలన్నిటినీ తిరగరాయాలని కూడా డిమాండ్ పెట్టేవారేమో! గడ్డాలనాడు ఎవరి ఇష్టాలు వారివి అని అబ్బాయిలకు అన్వయం అయినప్పుడు…అమ్మాయిలకైనా అంతే కదా? వారిష్టం వారిది. వారిష్టానికి వ్యతిరేకంగా గుబురు గడ్డం పెంచుకుంటే…అబ్బాయిలకు పెళ్లికాదనే గుబులు తప్ప ఇంకెలాంటి చీకూ చింతా ఉండవు!

దానవీరశూరకర్ణలో ఎన్ టీ ఆర్ ఫేమస్ డైలాగ్:-
“…ఇప్పుడేదీ కర్తవ్యము? మనుటయా? మరణించుటయా?”

అలా గడ్డం దువ్వుకుంటూ యువకులు కూడా:-
“… ఇప్పుడేదీ కర్తవ్యము? గడ్డం పెంచుటయా? తుంచుటయా?” అని విలోకించుకోవాల్సిన సందర్భం!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్