Monday, January 20, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపారాగ్లైడింగ్ ...స్కేటింగ్ ...

పారాగ్లైడింగ్ …స్కేటింగ్ …

ఇదివరకు జర్నలిస్టులకు విషయ పరిజ్ఞానం; వేగంగా, సరళంగా రాయడం; అనువదించడం; పెంచి, కుదించి రాయడం; ఆకట్టుకునే శీర్షికలు పెట్టడంలాంటివి వస్తే సరిపోయేది. తరువాత ప్రకటనలు తీసుకురావడం; యాజమాన్య విధానాల్లోకి ఒదిగేలా వార్తలకు రంగు రుచి వాసనలను అద్దడం లాంటివి అవసరమయ్యాయి. ఆపై ఇతరేతర మేనేజ్మెంట్ విద్యలు కూడా తప్పనిసరయ్యాయి. అవన్నీ ఇక్కడ అనవసరం.

తొలిరోజుల టీ వీ జర్నలిలిజంలో వార్తలు సేకరించేవారు, చదివేవారు వేరు వేరుగా ఉండేవారు. అందుకే న్యూస్ రీడర్, ప్రెజెంటర్, యాంకర్ అనేవారు. ప్రస్తుతం టీ వీ జర్నలిజంలో న్యూస్ రీడర్లు, యాంకర్లు బొమ్మలతో సమానం. ఇప్పుడు టీ వీ జర్నలిస్ట్ అంటే రిపోర్టర్ కమ్ న్యూస్ రీడర్ కమ్ ప్రెజెంటర్ కమ్ కెమెరామ్యాన్ కమ్ ఎడిటర్ కమ్ డ్రయివర్ కమ్…ఇలా ఎన్నెన్నో కమ్ ల కలగలుపు.

డిజిటల్ మీడియా శాఖోపశాఖలుగా విస్తరించాక మెయిన్ స్ట్రీమ్ మీడియా టీ వీ జర్నలిస్టులు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి చాలా కష్టపడాల్సివస్తోంది. స్టూడియోల్లో ఏళ్లతరబడి అదే సీట్లలో అలాగే కూర్చుని చేసే డిబేట్లను నాలుగురోజులు వరుసగా చూస్తే డిబేట్ నిర్వహించే జర్నలిస్ట్ అభిప్రాయాలతోపాటు ప్యానెలిస్ట్ ల అభిప్రాయాలను కూడా ప్రేక్షకులు పొల్లుపోకుండా చెప్పగలుగుతున్నారు.

కుంభమేళాలు, యుద్ధాలు, ఉపద్రవాల్లాంటివి విజువల్ గా చూపడానికి టీ వీ మీడియాకు ఎక్కువగా ఆస్కారముంటుంది. కేంద్ర- రాష్ట్ర సంబంధాలు; జనాభా నిష్పత్తి ప్రకారం దక్షిణాదిలో పార్లమెంటు సీట్లు తగ్గే ప్రమాదం లాంటి లోతైన అకెడెమిక్ విషయాలమీద ప్రేక్షకులను కట్టిపడేసేలా టీ వీ డిబేట్లు నిర్వహించడం, వార్తలను వండి వార్చడం చాలా కష్టం.

అయినా…మనసుంటే మార్గముంటుంది. నిజానికి మనసొక్కటే చాలదు. శారీరక శ్రమ, ఉత్సాహం, సాహసం, నిత్య అధ్యయనం కూడా అవసరం. దానికి ఉదాహరణగా రెండు సందర్భాలివి:-

మంచు దారుల్లో మంచి రిపోర్టింగ్
ఇండియా టుడే న్యూస్ డైరెక్టర్ రాహుల్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేశాడు. “జబ్ వుయ్ మెట్” అని ఇంగ్లిష్ ను భారతీయీకరించిన సినిమా పేరును యథాతథంగా పెట్టారు ఈ ప్రత్యేక కార్యక్రమానికి. ఈమధ్య సోనామార్గ్ సొరంగ మార్గాన్ని ప్రధాని ప్రారంభించిన సందర్భం. కాశ్మీర్ మంచు కొండల అందం గడ్డకట్టే చలికాలంలోనే చూడాలి. అడుగు తీసి అడుగు వేయడమే కష్టమైన మంచులో ఒళ్ళంతా స్వెటర్లు, లెదర్ జాకెట్లు, గ్లౌజు, నల్ల కళ్ళజోళ్ళు, టోపీలు పెట్టుకుని తిరగడమే గగనం. అలాంటిది రాహుల్- ఒమర్ మంచులో స్కేటింగ్ చేస్తూ, కేబుల్ కార్ లో ప్రయాణిస్తూ, మంచులో, ఎడారుల్లో తిరిగడానికి ప్రత్యేకమైన నాలుగు చక్రాల ఏ టీ వీ (ఆల్ టెరైన్ వెహికిల్)ల్లో తిరుగుతూ…కేంద్ర-రాష్ట్ర సంబంధాలు; కాశ్మీర్ లో గవర్నర్ పాత్ర లాంటి చాలా సీరియస్ విషయాలు మాట్లాడుకున్నారు. టెలి ప్రాంప్టర్లు లేవు. స్క్రిప్ట్ అందించేవారు లేరు. సహజసిద్ధమైన కాశ్మీరు మంచుకొండలు, లోయల అందాల బ్యాక్ డ్రాప్ లో చూడముచ్చటగా ఉంది కార్యక్రమం. అనేక యాంగిల్స్ లో వారితోపాటు కదిలే వీడియో కెమెరాలు, ఆడియో రికార్డ్ చేయడం…అంతా పెద్ద యజ్ఞం. అన్నీ చక్కగా కుదిరాయి.

దావోస్ కొండల్లో పారాగ్లైడింగ్ చేస్తూ మేఘాల్లో రిపోర్టింగ్
ఎన్ డి టీ వీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ విష్ణు సోమ్ రక్షణశాఖ సూపర్ సోనిక్ విమానాల్లో వెళుతూ కూడా రిపోర్టింగ్ చేయగలిగినవాడు. స్విట్జర్లాండ్ దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్తలు కవర్ చేయడానికి వెళ్ళాడు. గాజుగదుల్లో హీటర్ ఆన్ చేసుకుని చలికాచుకుంటూ రిపోర్టింగ్ చేస్తే మజా ఏముంది?

పారా గ్లైడింగ్ చేస్తూ స్విస్ దావోస్ మంచు కొండల మీద మేఘాల్లో తేలుతూ రిపోర్టింగ్ చేశాడు. తనే సెల్ఫీ స్టిక్ పట్టుకుని…తన వీడియోను తనే రికార్డ్ చేసుకున్నాడు. అంతెత్తున గాల్లో తేలుతూ దావోస్ సదస్సు ఆర్థిక విషయాలు, భారత్ భాగస్వామ్యం గురించి అలవోకగా చెప్పాడు. అందుకే ఎన్ డి టీ వీ విడిగా ప్రింట్ మీడియాలో కూడా దావోస్ ప్రత్యేకకార్యక్రమాల గురించి ప్రకటన ఇచ్చుకుంది.

కడలి కడుపులో జలాంతర్గామిలో ఉన్నా, ఆకాశంలో మేఘాల్లో ఊగుతున్నా జర్నలిస్ట్ జర్నలిస్టే. బుర్రలో విషయముంటే…చెప్పాలన్న ఉత్సాహముంటే…ఆల్ టెరైన్ వెహికిలే స్టూడియో అవుతుంది. ఆకాశంలో పారా గ్లైడింగ్ తలకిందులుగా గిరగిరా తిరుగుతున్నా నోట్లో మాట వణకదు. పొల్లుపోదు. పోకూడదు.

నేర్చుకుంటే మనలోనూ బయటపడతారు రాహుళ్ళు. విష్ణు సోమ్ లు.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్