Friday, March 29, 2024
HomeTrending Newsస్త్రీ శక్తి చాటే దిశగా తెలంగాణ - సీఎం కేసీఆర్

స్త్రీ శక్తి చాటే దిశగా తెలంగాణ – సీఎం కేసీఆర్

సమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సంపూర్ణమౌతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. “యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః ” అనే ఆర్యోక్తికి అనుగుణంగా సామాజిక విలువలను మరింతగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరమున్నదని తెలిపారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మహిళందరికీ శుభాకాంక్షలు తెలిపారు.స్త్రీ శక్తి చాటే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మహిళాసాధికారతను సంపూర్ణంగా సాధించేందుకు, వారి గౌరవాన్ని పెంపొందిస్తూ , స్త్రీజనోద్ధరణే లక్ష్యంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు పరుస్తున్నదన్నారు.. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులైన మహిళలకు ప్రత్యేక సెలవు మంజూరు చేసి మహిళలను సమున్నతంగా గౌరవించుకుంటున్నామని తెలిపారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ సత్పలితాలనిస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలు:
గర్భిణులు, బాలింతల సంక్షేమానికి “కేసీఆర్ కిట్” పథకం కింద లబ్దిదారులకు మూడు విడతలుగా మొత్తం రూ. 12 వేలు అందిస్తారు. ఆడపిల్లలకు జన్మనిస్తే ప్రోత్సాహకంగా ఆ తల్లికి మరో వెయ్యి రూపాయలు అదనంగా కలిపి 13 వేలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రయోజం పొందిన లబ్దిదారులు 13,90,639 మంది కాగా అందుకోసం చేసిన ఖర్చు 1261.67 కోట్లు.
గర్భిణుల్లో రక్తహీనత నివారణ, పోషకాహారం అందించే లక్ష్యంతో చేపట్టిన “కేసిఆర్ న్యూట్రిషన్ కిట్” పథకం కింద గర్భిణులకు విడతల వారీగా పోషకాహార కిట్ లను అందిస్తారు. మహిళల సంపూర్ణ రక్షణ కోసం, సామాజిక భద్రత కోసం దేశంలోనే ప్రప్రథమంగా షీ టీమ్ పేరుతో ప్రత్యేక పోలీస్ విభాగం ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధానం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. గర్భిణులకు, బాలింతలకు, 6 సంవత్సరాల లోపు చిన్నారులకు సంపూర్ణ పోహకాహారాన్ని అందించే లక్ష్యంతో 35,700 అంగన్ వాడీల ద్వారా ఆరోగ్య లక్ష్మీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. వందల కోట్ల రూపాయలతో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా 1,73,85,797 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందారు.
గర్భిణులకు ఆసుపత్రులకు వెళ్ళిరావడానికి అమ్మ ఒడి పేరుతో అమలు చేస్తున్న పథకం ద్వారా 22,19,504 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 166.19 కోట్లను ఖర్చు చేసింది.
నేటి వరకు ఆసరా పెన్షన్ పథకం ద్వారా రాష్ట్రంలోని 1,52,050 మంది ఒంటరి మహళలకు, 1,430 కోట్ల రూపాయలను ప్రభుత్వం పెన్షన్ గా చెల్లించింది. భర్తను కోల్పోయిన వితంతువులుగా మారిన 15,74,905 మంది మహిళలు 19,000.13 కోట్ల రూపాయలు, 4,80,861 మంది మహిళా బీడీ కార్మికులు రూ. 5,393.19 కోట్లను పెన్షన్ గా పొందారు.
జీవితం పై భరోసాను కోల్పోయి, సమస్యలతో సతమతమయ్యే మహిళలు, చిన్నారుల కోసం రాష్ట్రం ప్రభుత్వం భరోసా చేయూత కేంద్రాల ద్వారా పోలీసు, ఆరోగ్యశాఖ, ప్రభుత్వ న్యాయవాద సేవలు, సైకో థెరపికి కౌన్సిలింగ్ తో పాటు వారికి, సహాయం, పునరావాసం అందిస్తున్నది
ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక చేయూతనందించి, వారి తల్లిదండ్రులకు అండగా ఉండేందుకు కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకం ద్వారా రూ. 1,00,116 లను ఆర్థిక సహాయంగా అందిస్తున్నది. ఈ పథకం ద్వారా 13,03,818 మంది లబ్దిదారులకు, రూ. 11,775 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి అందిస్తున్నది.
బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం ప్రతి ఏటా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల మహిళలకు బతుకమ్మ చీరలను అందిస్తున్నది. ఈ పథకం కింద నేటి వరకు మహిళలకు 5,75,43,664 చీరెలు పంపిణీ చేయబడ్డాయి. ఇందు కోసం రూ. 1,536.26 కోట్లు ఖర్చు చేయడం జరుగింది.
అంగన్ వాడీ వర్కర్ల నెలవారి వేతనాలను రూ. 4,000 నుండి 225 శాతం పెంచి నెలకు రూ. 13,650, అంగన్ వాడీ హెల్పర్ల వేతనాలను రూ. 2,200 నుండి పెంచి నెలకు రూ. 7,800 లు, ఆశా వర్కర్ల వేతనాలు నెలకు రూ. 7,500 నుండి పెంచి నెలకు రూ. 9,750 లు చెల్లిస్తున్నది.
మహిళల భధ్రత, రక్షణ నిమిత్తం వెంటనే చర్యలు చేపట్టేందుకు హాక్ ఐ మొబైల్ అప్లికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది.
మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక మూలధన సహాయం, వ్యూహరచన, అభివృద్ధికి వీ హబ్ ద్వారా సలహా, సూచనలు ఇవ్వడం జరుగుతున్నది. వీ హబ్ ద్వారా చేపట్టిన 21 కార్యక్రమాల ద్వారా 2194 మంది మహిళల నేతృత్వంలోని స్టార్టప్ లతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలను నెలకొల్పడం జరిగింది. వీ హబ్ ద్వారా రూ. 66.3 కోట్ల నిధులను అందజేయడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 2823 మంది ఉద్యోగాలను కల్పించడం జరిగింది.
ప్రత్యేక మహిళా పారిశ్రామిక పార్కుల నిర్వహణ ద్వారా 1500 మందికి ఉద్యోగ, ఉపాధి కల్పన, మహిళల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక ఎస్టేట్ లో 10 శాతం ప్లాట్లు మహిళల కోసం రిజర్వు చేయడం జరిగింది.
డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రాజెక్టులో పేద మహిళల పేరు మీద ఇండ్లను కేటాయించడం జరుగుతున్నది. రూ. 19,378.32 కోట్లతో 2.92 లక్షల గృహాలను మంజూరు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన మొత్తం 1003 రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, జనరల్ కేటగిరీకి చెందిన 3,03,820 మంది బాలికలుండగా, ప్రతీ విద్యార్థి కోసం ప్రభుత్వం ఏడాదికి సగటున రూ. 1,25,000 లు ఖర్చు చేస్తున్నది.
స్థానిక సంస్థల్లో 50 శాతం, మార్కెట్ కమిటీల్లో 33 శాతం రిజర్వేషన్లను మహిళలకోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది.
సివిల్ పోలీస్ ఉద్యోగ నియామకాల్లో 2015 నుంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లను కల్పించడం జరుగుతున్నది.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ, గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ. 750 కోట్లకు పైగా వడ్డీలేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. అభయహస్తం పథకం కింద రూ. 546 కోట్ల చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసి మహిళా వికాసం పట్ల తన చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రభుత్వం చాటుకున్నది.

Also Read : ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వ కానుక

RELATED ARTICLES

Most Popular

న్యూస్