Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్కోల్ కతా విజయం: బెంగుళూరు మరో ‘సారీ’

కోల్ కతా విజయం: బెంగుళూరు మరో ‘సారీ’

ఐపీఎల్ టైటిల్ వేటలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మరోసారి బోల్తా పడింది. సునీల్ నరేన్ ఆల్ రౌండ్ ప్రతిభతో కోల్ కతా నాలుగు వికెట్లతో బెంగుళూరుపై విజయం సాధించి క్వాలిఫయర్-­2 లో అడుగు పెట్టింది. ఎల్లుండి జరిగే మ్యాచ్ లో ఢిల్లీతో కోల్ కతా తలపడనుంది. నాలుగు కీలక వికెట్లు తీసి బెంగుళూరు బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చడంతో పాటు 15 బంతుల్లో మూడు సిక్సర్లతో 26 పరుగులు చేసిన సునీల్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

ఈ సీజన్ లో మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తూ బలమైన జట్టుగా కనబడిన ఆర్సీబీ నేడు జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో స్థాయికి తగ్గ  ప్రదర్శన చూపలేకపోయింది. కీలక మ్యాచ్ లో బెంగుళూరు బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. ఈ సీజన్ రెండో భాగంలో అత్యుత్తమ ప్రదర్శన చూపిస్తూ వస్తోన్న శ్రీకర్ భరత్. పడిక్కల్, గ్లెన్ మ్యాక్ వెల్ లు ఈ మ్యాచ్ లో విఫలమయ్యారు.

షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో బెంగుళూరు కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి వికెట్ కు కోహ్లీ, పడిక్కల్ 49 పరుగులు చేశారు. పడిక్కల్ 21 పరుగులు చేసి ఔటయ్యాడు. శ్రీకర్  9 పరుగులు మాత్రమే చేసి సునీల్ నరేన్ బౌలింగ్ లో ఔటై పెవిలియన్ చేరాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ -15;  ఏబీ డివిలియర్స్-11;  షాబాజ్-13 పరుగులు చేశారు. కోహ్లీ 33 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లతో 39 పరుగులు చేసి నరేన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. బెంగుళూరు ఇన్నింగ్స్ లో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం గమనార్హం. కోల్ కతా బౌలర్లు 13  ఎక్స్ ట్రా పరుగులిచ్చారు. దీనితో బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి  138 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరేన్ నాలుగు వికెట్లు, ఫెర్గ్యుసన్ రెండు వికెట్లు పడగొట్టారు.

లక్ష్యం స్వల్పమే అయినా కోల్ కతా కూడా త్వరగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు శుభమన్ గిల్, వెంకటేష్ అయ్యర్ లు మొదటి వికెట్ కు 41 పరుగులు చేశారు. 18 బంతుల్లో 29 పరుగులు చేసిన గిల్ మొదటి వికెట్ గా వెనుదిరిగాడు. రాహుల్ త్రిపాఠి ఆరు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేష్ -30, నితీష్ రానా-23; దినేష్ కార్తీక్ -10 పరుగులు చేశారు. ఆట 18 వ ఓవర్లోనే సునీల్ నరేన్, దినేష్ కార్తీక్ ఇద్దరూ అవుట్ కావడంతో కోల్ కతా శిబిరంలో టెన్షన్ నెలకొంది. అయితే కెప్టెన్ మోర్గాన్, షకీబ్ అల్ హసన్ లు మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపించారు.  బెంగుళూరు బౌలర్లలో సిరాజ్, హర్షల్ పటేల్, యజువేంద్ర చాహల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్