కరోనా తర్వాతి కాలంలో ఆర్థికంగా రాబడి పెంచుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు పర్యాటకులను ఆకర్షించే పథకాలు చేపడుతున్నాయి. పరిమిత కాలానికి వీసా లేకుండానే ప్రవేశానికి అనుమతిస్తున్నాయి. ముఖ్యంగా భారత్, చైనా దేశాల పర్యాటకులను దృష్టిలో ఉంచుకొని ఆయా దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. థాయిలాండ్, వియాత్నం, మలేషియా, శ్రీలంక, కెన్యా తదితర దేశాలు ఈ సడలింపులు ఇస్తున్నాయి.
తాజాగా ఈ కోవలోకి గల్ఫ్ దేశం ఇరాన్ చేరుకుంది. భారతీయులకు ఇరాన్ దేశం వీసా ఫ్రీ ఎంట్రీ ప్రకటించటం సాహసోపేతమైన నిర్ణయమనే చెప్పుకోవాలి. మత ఆచారాలు, పరదా కట్టుబాట్లు అధికంగా ఉండే ఇరాన్ లో… ప్రభుత్వ ఆంక్షలు ఉన్నా.. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. ముస్లిం మతపెద్ద ఆయతుల్ల ఖోమైనీగా పిలుచుకునే అయతుల్లా రుహోల్లా ముసావి ఖొమేని 1979లో అధికారంలోకి వచ్చాక ఆయన హయం నుంచి క్రమంగా ఇరాన్ లో మతపరపమైన కట్టుబాట్లు అమలు చేస్తూ… మహిళల మీద ఆంక్షలు అధికం చేశారు.
22 ఏళ్ల మహస అమినీ హిజాబ్ పాటించలేదని హింసించటం… ఆమె దుర్మరణంతో దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా, మానవ హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడిన ఇరాన్ మహిళ నెర్గెస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి లభించింది. హిజాబ్ ధరించకపోతే శిక్షలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, ఆ దేశ మహిళలు హిజాబ్ ధరించాలనే నిబంధనకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించేందుకే సిద్ధంగా ఉన్నారు.
ఇరాన్ పౌరుల నడవడిక పరిశీలించినా స్నేహపూర్వకమైన వారి శైలి విదేశీయుల్ని ఆశ్చర్యపరుస్తుంది. మతపరమైన ఆంక్షల్ని అంతగా పట్టించుకోరు. ఈ పరిస్థితుల్లో వీసా ఫ్రీ ఎంట్రీ ఉద్దేశం ఏంటో రాజకీయ విశ్లేషకులకు అంతుపట్టడం లేదు. విదేశీయులు వెళితే అక్కడి కట్టబాట్లు అంతగా పాటించకపోవచ్చు. ఆ విధానం క్రమంగా పర్షియా ప్రజలు.. ముఖ్యంగా మహిళలపై ప్రభావం చూపనుంది. ఇవన్నీ తెలియకుండా ఇరాన్ పాలకులు ఏలా అనుమతిస్తున్నారు.
అమెరికా ఆంక్షల తర్వాత ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న ఇరాన్ ప్రపంచ దేశాల ప్రజలకు తమ దేశ ఔన్నత్యాన్ని తెలిపేందుకు సడలింపులు ఇచ్చారనే విశ్లేషణలు జరుగుతున్నాయి. పౌరుల మనోభావాలకు అనుగుణంగా పాలన సాగించేందుకు ముందుకొచ్చిన పాలకులు వీసా ఫ్రీ విధానం తెసుకొచ్చారా అనే కోణంలో చర్చ జరుగుతోంది. అసలు కారణం ఏంటీ అనేది త్వరలోనే వెల్లడి కానుంది.
ఏది ఏమైనా ఇరాన్ ప్రభుత్వం వీసా ఫ్రీ ఎంట్రీ ఇవ్వటం హర్షించదగిన పరిణామమని… త్వరలోనే విప్లవాత్మక మార్పులు చూడనున్నామని ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి. పొరుగు ముస్లిం దేశాల మీద ఇరాన్ ప్రభావం ఉండనుంది. ప్రపంచీకరణ క్రమంలో భిన్న సంస్కృతుల వారిని ఆహ్వానించటం మంచి నిర్ణయం కాగా భారతీయులు ఇరాన్ వెళితే మతపరంగా ఆ దేశ ప్రజలు ఎంత స్వేచ్చగా ఉంటున్నారో భారత ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-దేశవేని భాస్కర్