Tuesday, December 3, 2024
HomeTrending Newsయుద్దానికి సిద్దమవుతున్న ఇరాన్

యుద్దానికి సిద్దమవుతున్న ఇరాన్

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి విమాన ప్రమాదంలో మృతి చెందటం… హ‌మాస్ అగ్రనేత ఇస్మాయిల్ హ‌నియా హ‌త్య తర్వాత ఇరాన్ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. ఇజ్రాయల్ మీద తెగబడాలని ఉవ్విలూరుతోంది. హమాస్- ఇజ్రాయల్ గొడవను ప్రపంచ యుద్ధంగా మార్చాలని దుష్టపన్నాగం పన్నుతోంది. ముస్లిం దేశాలను పశ్చిమాసియా యుద్దంలో పాల్గొనేలా.. తద్వారా అమెరికా, పశ్చిమ దేశాలు – ముస్లిం దేశాల మధ్య స్నేహం దెబ్బతీయాలని దురుద్దేశపూర్వకమైన ప్రణాలికలు సిద్దం చేస్తోంది.

ఈ దిశగా ఇజ్రాయిల్‌పై దాడికి ఇరాన్ సిద్ద‌మ‌వుతున్న‌ది. వారాంతంలో భారీగా దాడులకు దిగే అవ‌కాశాలు ఉన్నాయన్న నిఘా వర్ఘాల హెచ్చరికలతో మ‌ధ్య‌ప్రాచ్యంలో అమెరికా యుద్ధ నౌక‌ల‌ను మోహరిస్తోంది. టెహ్రాన్ గనుక దాడులకు దిగితే తిప్పికొట్టేందుకు అమెరికా సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ‌నౌక‌లు, ఫైట‌ర్ జెట్స్‌ను అమెరికా సన్నద్ధం చేస్తోంది. అమెరికా సిబ్బందికి, ఇజ్రాయిల్‌ కు అండగా ఉండేందుకే పెంటగాన్ ఈ చ‌ర్య‌ల‌కు దిగిందని అంతర్జాతీయ మీడియా కథనం. బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ క్రూయిజ‌ర్లు, డెస్ట్రాయ‌ర్లను కూడా అమెరికా మొహరిస్తోందని పెంట‌గాన్ వర్గాలు వెల్లడించాయి.

1979లో ఇరాన్‌లో ఇస్లామిక్ పాలకులు వచ్చే వరకు ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు మిత్రదేశాలుగానే ఉన్నాయి. ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇజ్రాయెల్ వ్యతిరేకత ఇరాన్ పాలకుల్లో పెరిగింది. ఆనాటి నుంచి హమాస్ సహా పాలస్తీనా గ్రూపులకు, లెబనాన్‌లోని షియా మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లాకు నిధులు, ఆయుధాలు సమకూర్చుతోందని ఆరోపణలు ఉన్నాయి.

హిజ్బోల్లా ఉగ్రవాద సంస్థకు ఇరాన్ ప్రభుత్వం ఆర్థికంగా, సాంకేతికంగా సహకారం అందిస్తోంది. ఇది బహిరంగ రహస్యం. ఈ అంశంలో ఇజ్రాయల్ అంతర్జాతీయ వేదికలపై ఎన్నిసార్లు గగ్గోలు పెట్టినా ఎవరు పట్టించుకోలేదు. హమాస్ దాడుల తర్వాత హిజ్బోల్లా ఉగ్రవాదులు మరింత రెచ్చిపోతున్నారు. లెబనాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ ఉగ్రవాదులు ఇజ్రాయల్ పై ఎన్నోసార్లు దాడి చేయగా ఆ దేశం తిప్పికొట్టింది.

ఇరాక్, సిరియా, జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసిన ఇరాక్‌లోని షియా మిలీషియా గ్రూపులకు ఇరాన్ వెన్నుదన్నుగా ఉంది. యెమెన్‌లోని హౌతీ ఉద్యమానికి ఇరాన్ మద్దతు ఇస్తోంది. యెమెన్‌లోని అనేక ప్రాంతాలు ఈ సంస్థ నియంత్రణలో ఉన్నాయి. గాజాలో హమాస్‌కు మద్దతు తెలిపేందుకు హౌతీలు ఇజ్రాయెల్‌పై మిస్సైల్స్, డ్రోన్లు ప్రయోగించారు.

గతంలో ఇరాన్ దాడి చేసినందుకు ప్రతిగా సిరియా రాజధాని డమస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయల్ దాడులు చేసింది. దాడుల్లో ఇద్దరు సైనిక జనరళ్లు సహా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన మొత్తం ఏడుగురు మృతి చెందారు. ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడులకు కారణం తామేనని ఇజ్రాయెల్ ఎన్నడూ ప్రకటించలేదు. దాడుల వెనుక ఆ దేశం ఉందని ఇరాన్ అనుమానిస్తోంది.

తాజాగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి మృతి … హ‌మాస్ నేత ఇస్మాయిల్ హ‌నియా హ‌త్య..స్వదేశంలో ఇస్లామిక్ బావ జాలం బలపడేందుకు పాలకులు యుద్దమే శరణ్యం అన్నట్టుగా పావులు కదుపుతున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్