Thursday, September 19, 2024
HomeTrending Newsఇబ్రహీం రైసి మృతి పట్ల ఇరాన్ లో సంబరాలు

ఇబ్రహీం రైసి మృతి పట్ల ఇరాన్ లో సంబరాలు

ఇరాన్‌ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చనిపోయాడని తెలియగానే ప్రపంచ దేశాల అధినేతలు సంతాప సందేశాలు పంపుతుంటే ఆ దేశ ప్రజలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని స్పష్టత వచ్చాక ఇరాన్‌ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి రైసీ మృతిని వేడుకలుగా చేసుకోవడం చర్చనీయాంశమైంది.

మతపరమైన ఆంక్షలతో ప్రజలను ముఖ్యంగా మహిళలను అణచివేసే కుట్ర చేశాడని ఇరానియన్లు మందు పార్టీలు చేసుకొని చిందులు వేశారు. రైసీ మృతి వార్త తెలియగానే ఇరాన్‌లో వందలాది మంది ప్రజలు టెహ్రాన్‌, మషాద్‌లోని ప్రధాన కూడళ్లలో గుమిగూడి సంబరాలు చేసుకున్నారు.

విదేశాల్లో ఇరానీయుల సంబరం అంతా ఇంత కాదు. లండన్‌లో ఇరాన్ రాయబార కార్యాలయం ముందు ఇరానీయులు వచ్చి సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబరాలపై మహిళా హక్కుల కార్యకర్త మాసిహ్ అలినేజాద్ ఎక్స్‌ వేదిగా స్పందించారు. ఈ ప్రమాదంలో ఎవరైనా ప్రాణాలతో బయటపడితే చరిత్రలో ఆందోళన కలిగించే ఏకైక క్రాష్ ఇదే అవుతుందని … ఈ సందర్భంగా ప్రపంచ హెలికాప్టర్ డే శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు.

రైసీ ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చాలా క్రూరంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. ఇస్లామిక్‌ అచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని… ఇరాక్-ఇరాన్ యుద్ధ సమయంలో చిక్కిన ఖైదీలను దారుణంగా ఉరి వేయించాడని ఆరోపణలున్నాయి.

నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యువతను రైసీ కఠినంగా శిక్షించినట్లు… రైసీ పట్ల ఇరాన్‌ ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు స్థానిక మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మృతిని ఇరాన్‌ ప్రజలు సెలబ్రేట్‌ చేసుకుంటున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ముఖ్యంగా కుర్దు ప్రజల ఆనందానికి అంతు లేదు. దశాబ్దాలుగా స్వాతంత్రం కోసం పోరాడుతున్న కుర్దు జాతి ప్రజలను రైసి అణచివేశారు. కుర్దు ప్రజల హననం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.

https://x.com/memarsadeghi/status

రైసి మృతితో పశ్చిమాసియాలో కొత్త సమస్యలు తలెత్తుతాయని భావించిన పాశ్చత్య దేశాలు… ఇరాన్ ప్రజల సంబరాలతో విస్తుపోతున్నాయి. ఇరాన్ ప్రజల సంబరాలపై ఏ దేశం కూడా అధికారికంగా ఇప్పటివరకు స్పందించలేదు.

ఈ తరుణంలో రాబోయే కొత్త అధ్యక్షుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగించాలని పాశ్చత్య మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ వ్యవహారంతో పాకిస్తాన్, భారత్ లోని ముస్లిం సమాజంలో విభిన్న రీతిలో చర్చ జరుగుతోంది.

రైసి మృతి వెనుక ఇజ్రాయల్ కుట్ర ఉందని కొందరు ఆరోపిస్తే… కట్టుబాట్ల పేరుతో ప్రజలపై ఆంక్షలు విధించటం సరి కాదని అభ్యుదయ వాదులు నిరసిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్