Thursday, November 21, 2024
HomeTrending Newsఇరాన్ అధ్యక్షుడిగా సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్

ఇరాన్ అధ్యక్షుడిగా సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్

ఇరాన్ లో కొత్త శకం ప్రారంభం అయింది. సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి సంప్రదాయవాది సయీద్ జలీలీపై విజయం సాధించారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) మృతితో ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించారు.

ఇరాన్ – హమాస్ యుద్ధం, పశ్చిమ దేశాలతో విబేధాలు, దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న తరుణంలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 6.1 కోట్ల మంది ఓటర్లు ఉండగా తొలి దశలో 40 శాతం మంది మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు. 1979లో ఇరాన్ విప్లవం తర్వాత ఇంత తక్కువ స్థాయిలో ఓటింగ్ నమోదైంది.

మొత్తం 3 కోట్ల ఓట్లలో డాక్టర్ పెజెష్కియాన్‌కు అనుకూలంగా 1.6 కోట్లకుపైగా ఓట్లు ( 53.3 శాతం).. జలీలీకి 1.3 కోట్లకుపైగా ఓట్లు ( 44.3 శాతం) ఓట్లు వచ్చాయి. దాంతో పెజెష్కియాన్ ఎన్నికైనట్టు అధికారులు ధ్రువీకరించారు. ఈ మేరకు ఎన్నికల విభాగం అధికార ప్రతినిధి మెహసెన్ ఇస్లామీ ప్రకటన చేశారు.

హిజాబ్ ధరించలేదన్న కారణంతో 2022లో అరెస్ట్ చేసిన మహస అమిని అనే యువతి పోలీస్ కస్టడీలో చనిపోగా ఆ ఘటన ఇారాన్‌ను కుదిపేసింది. దీనిపై దేశవ్యాప్తంగా యువత వీధుల్లోకి వచ్చి మోరల్ పోలీసింగ్‌కు వ్యతిరేకంగా ఉద్యమించింది. అప్పటి అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఉద్యమాలను కఠినంగా అణచివేశారు.

వైద్యుడైన మసూద్ పెజెష్కియాన్ దేశాధ్యక్ష పదవి చేపడుతున్నా ఆయన ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఇరాన్ మోరల్ పోలీసింగ్‌‌ను తీవ్రంగా వ్యతిరేకించిన మసూద్ ఆంక్షల వల్ల ఏకాకిగా మారిన ఇరాన్‌ను తిరిగి ప్రపంచంతో కలుపుతానని ఎన్నికల్లో వాగ్దానం చేశారు. 2015 నాటి ఇరాన్ – అమెరికా అణు ఒప్పందం పునరుద్దరణకు కృషి చేసే అవకాశం ఉంది.

అమెరికా, యూరోప్ దేశాల ఆంక్షలపై ఆయా దేశాలతో చర్చించి… పశ్చిమ దేశాలతో వాణిజ్యానికి చొరవ తీసుకుంటారని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా స్వదేశంలో మహిళల హక్కులు పునరుద్దరించేందుకు మసూద్ తీసుకునే చర్యలకు ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్ల ఖోమైని ఎంతవరకు సహకరిస్తారో చూడాలి.

ఇరాన్ పాలకులు సంప్రదాయవాదులు కాగా పౌరులు ప్రగతిశీలవాదులు. ముస్లిం దేశాలకు నాయకత్వం వహించేందుకు ఇరాన్ పాలకులు దేశాన్ని మతవాద దేశంగా మార్చేందుకు స్త్రీలపై ఆంక్షలు విధిస్తున్నారు. దీనిపై అక్కడి స్త్రీలు ఉద్యమిస్తుండగా వారికి పురుషులు కూడా మద్దతు ఇస్తున్నారు.

కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పాలనలో ఇరాన్ – ఇండియా భాగస్వామ్యంలో చేపట్టిన చాబహార్ ఓడరేవు పనులు మళ్ళీ గాడిలో పడుతాయని… ఆ దేశ పౌరులకు సుపరిపాలన అందే అవకాశం ఉందని ఇరాన్ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్