Sunday, January 19, 2025
HomeTrending NewsLashkar-e-Taiba: ల‌ష్క‌రే తోయిబాపై ఇజ్రాయిల్ నిషేధం

Lashkar-e-Taiba: ల‌ష్క‌రే తోయిబాపై ఇజ్రాయిల్ నిషేధం

హమాస్ – ఇజ్రాయల్ వైరం ప్రపంచ రాజకీయాలను మలుపులు తిప్పుతుందని విశ్లేషకులు చెపుతుండగానే ఈ రోజు(నవంబర్ 21) యూదు దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం ఉగ్రవాద సంస్థ ల‌ష్క‌రే తోయిబాపై ఇజ్రాయిల్ నిషేధం ప్ర‌క‌టించింది. భారత్ ప్రమేయం లేకుండానే ఇజ్రాయిల్ ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం. ల‌ష్క‌రే సంస్థ స‌మ‌గ్ర స‌మాచారం సేక‌రించిన ఇజ్రాయిల్‌.. ఉగ్ర‌వాద నిషేధ జాబితాలో చేర్చింది. భార‌త్‌లోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం ఇవాళ దీనిపై ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేసింది.

వంద‌ల మంది భార‌త పౌరుల హత్య‌కు లష్కర్ ఏ తోయిబా ఉగ్ర సంస్థ కార‌ణ‌మ‌ని ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది. ముంబైపై ఉగ్ర‌దాడులు జ‌రిగి 15 ఏళ్లు కావొస్తోందని… ముంబై దాడులకు కారణమైన ఉగ్ర సంస్థ‌ను క్షమించేది లేద‌ని ఇజ్రాయిల్ తెలిపింది. 2008, న‌వంబ‌ర్ 26వ తేదీన జ‌రిగిన ఉగ్ర‌దాడిని ఖండిస్తున్న‌ట్లు ఇజ్రాయిల్ వెల్లడించింది. శాంతియుత భ‌విష్య‌త్తు కోసం ఇండియాకు బాస‌టగా ఉంటామ‌ని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది.

లష్కరే ఉగ్రమూకకు ఇటీవల వరుస కష్టాలు మొదలయ్యాయి. అనూహ్యంగా కీలక నేతలు హతమవుతున్నారు. లష్కరే తోయిబా మాజీ కమాండర్ అక్రమ్‌ఖాన్ దారుణ హత్యకు గురయ్యాడు. అక్రమ్ ఘాజీగా సుపరిచితుడైన అతడిని పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని బజౌర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. 2018 నుంచి 2020 వరకు ఘాజీ లష్కరే రిక్రూట్‌మెంట్ సెల్‌లో చురుగ్గా పనిచేశాడు.

2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై దాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ ఈ ఏడాది అక్టోబర్ లో పాకిస్థాన్‌లో కాల్చివేతకు గురయ్యాడు. పాక్‌లోని గుజ్రాన్‌వాలాకు చెందిన షాహిద్.. భారత మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడు. లష్కరే తోయిబాకు చెందిన టాప్ ఉగ్రవాది రియాజ్ అహ్మద్ అలియాస్ అబు ఖాసిం ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్‌కోట్‌లోని అల్ ఖుదూస్ మసీదు లోపల హత్యకు గురయ్యాడు. కోట్లీ నుంచి ప్రార్థనల కోసం వచ్చిన ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు. ఈ తరుణంలో ల‌ష్క‌రే తోయిబాపై ఇజ్రాయల్ నిషేధం విధించటం పాకిస్తాన్ కు ఉహించని షాక్…భారత్ కు నైతిక విజయమని చెప్పవచ్చు.

పాకిస్తాన్ కేంద్రంగా విస్తరించిన లష్కరే తోయిబా దక్షిణాసియాలో ప్రాబల్యం ఉన్న ఇస్లామిక్ తీవ్రవాద సంస్ధ. హఫీజ్ మహమ్మద్ సయీద్, జఫర్ ఇక్బాల్ లు కలిసి ఈ సంస్ధను స్ధాపించారు. అక్రమంగా సంపాదించిన సొమ్మును ఈ సంస్థ పాక్ లోని వివిధ వాణిజ్య సంస్థల్లో  పెట్టుబడిగా పెడుతోంది. దాని అనుబంధ సంస్థ జమాత్ ఉద్ దవా ద్వారా కరాచీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతోందని సమాచారం. ఈ పెట్టుబడుల ద్వారా వచ్చిన లాభాలతో ప్రపంచంలోని వివిధ దేశాల్లో తీవ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుకునేందుకు లష్కరే తోయిబా వాడుతోందని నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఉగ్రవాదుల ఏరివేతలో యూదు నిఘా సంస్థ మొస్సాద్ పరోక్ష పాత్ర ఉందని కథనాలు ఉన్నాయి. భారత్ కు మొస్సాద్ ఎందుకు సాయం చేస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నం కావచ్చు. ఉగ్రవాదం కట్టడిలో RAW(Research and Analsis Wing) – మొస్సాద్(Mossad) దశాబ్దాలుగా సహకరించు కుంటున్నాయని విశ్వాసనీయ వర్గాల బోగట్టా. రాజకీయ ఒత్తిళ్ళ రిత్యా భారత ప్రభత్వం బహిరంగంగా ఇజ్రాయల్ ను సమర్ధించ లేకపోయినా…హమాస్ తో యుద్ద సమయంలో భారత్ ప్రజలు ఇచ్చిన నైతిక మద్దతు యూదుల మనసు చురగొందని విశ్లేషణలు ఉన్నాయి.

ఒకప్పుడు యూరోప్ దేశాలు.. ఇప్పుడు అరబ్ దేశాలు యూదుల అంతమే లక్ష్యంగా పనిచేశాయి. ప్రపంచ దేశాల్లో చెల్లాచెదురైన యూదులని ఆదరించిన దేశాల్లో భారత్ ఒకటి. అందుకే భారత్ అంటే ఇజ్రాయల్ ప్రజలకు అమిత గౌరవం. సైన్యంలో పనిచేసే యూదు యువత సెలవులు రాగానే…అగ్ర దేశాలను కాదని విశ్రాంతి కోసం భారత్ వస్తారంటే అర్థం చేసుకోవచ్చు.

రెండు దేశాలు ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇస్లామిక్ ఉగ్రవాదంతో భారత్ ఇబ్బందులను ఇజ్రాయల్ గమనిస్తోంది. కార్గిల్ యుద్దంలో భారత్ విజయంలో క్రియాశీల పాత్ర పోషించింది. ఇటీవల యుద్దంతో కార్మికుల కొరత ఏర్పడగా గల్ఫ్ దేశాల్లోని భారత్ యువత అధికంగా ఇజ్రాయల్ వెళుతున్నట్టు భారత విదేశాంగ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇజ్రాయల్ తో యుద్దంలో హమాస్ కు ఇప్పటికే హిజ్బొల్ల సహకరిస్తోంది. యెమన్ కేంద్రంగా ఉన్న హుతి, సిరియా కేంద్రంగా ఐసీస్ తదితర ఉగ్ర మూకలు ఇజ్రాయల్ మీదకు దండెత్తాయి. నేరుగా కాకపోయినా ఈ సంస్థల సహకారంతో భారత్ లో లష్కరే తోయిబా విధ్వంసం చేస్తోంది. లష్కరే తోయిబాపై నిషేధం ద్వారా అంతర్జాతీయ వేదికలపై భారత్ సహకారం ఇజ్రాయల్ దేశానికి తోడ్పడనుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్