గత 11 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ఇజ్రాయెల్, హమాస్ ముగింపు పలికాయి. ఈజిప్ట్ చొరవతో భేషరతుగా కాల్పుల విరమణకు ఇరువర్గాలు ఒప్పుకున్నాయి. ఇజ్రాయెల్ కేబినెట్ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. హమాస్ దళాలు కూడా కాల్పుల విరమణకు సమ్మతించాయి.
ఈ ప్రతిపాదన అమల్లోకి రాగానే పెద్దఎత్తున ప్రజలు గాజా వీధుల్లోకి వచ్చి ఆనందోత్సాహాలు జరుపుకున్నారు. ‘అల్లాహో అక్బర్’ అనే నినాదాలు చేశారు. మరికోతమంది తమ ఇంటి బాల్కనీల్లో నిల్చుని ఈలలు వేయగా మరికొంతమంది గాల్లోకి కాల్పులు జరిపారు.
ఇజ్రాయెల్ – పాలస్తీనా సరిహద్దుల్లోని ఓ మసీదు వద్ద జరిగిన ఆందోళన ఈ యుద్ధానికి దారితీసింది. హమాస్ దళాలు జెరూసలేం వైపు రాకెట్ దాడులు చేసాయి, వాటిని తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ కూడా రాకెట్ దాడులతో హమాస్ పై విరుచుకుపడింది. ఈ దాడుల్లో 230 మంది పాలస్తీనియన్లు మరణించగా 2 వేల వరకూ గాయపడ్డారు.
అమెరికా మొదట్లో ఇజ్రాయెల్ ను సమర్ధించింది, కానీ ఈ దాడుల్లో చిన్నారులు, మహిళలు మరణిస్తున్న సంఘటలు వెలుగులోకి వచ్చిన తరువాత యుద్ధం విరమించాల్సిందిగా ఇజ్రాయెల్ పై ఒత్తిడి తేవడం ప్రారంభించింది.
కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు.