Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసేమ్ సీన్ రిపీట్

సేమ్ సీన్ రిపీట్

Home to continue…
దాదాపు తొంభై ఏళ్ల కిందట అంటే 1930లలో ప్రపంచవ్యాప్తంగా పెను ఆర్థిక సంక్షోభం సంభవించింది. అమెరికాలో మొదలై ఈ సంక్షోభం భూగోళమంతా విస్తరించింది. ఆర్థిక శాస్త్రం ఈ సంక్షోభానికి “గ్రేట్ డిప్రెషన్” అని నామకరణం చేసింది. ఈ సంక్షోభానికి మూల కారణం అతి పారిశ్రామికీకరణ అని తేల్చాడు చార్లీ చాప్లిన్. గ్రేట్ డిప్రెషన్ ఇతివృత్తంగా మోడరన్ టైమ్స్ పేరుతో 1936లో చార్లీ చాప్లిన్ తీసిన సినిమా ఒక విషాదానికి కన్నీటి ప్రతిరూపం. షరా మాములుగా ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాత, రచయిత, సంగీతం, కథానాయకుడు అన్నీ చాప్లినే.

మనిషి యంత్రంలో యంత్రమై, బోల్ట్ లో బోల్ట్ అయి, చక్రాల పళ్ల మధ్య బెల్ట్ అయి, సైరన్ మోగగానే మరబొమ్మలా పనిచేసి; మళ్లీ సైరన్ మోగగానే ఆగిపోయే ఒక పరికరంగా ఎలా మిగిలిపోయాడో ఎనభై అయిదేళ్ల కిందటే చాప్లిన్ కన్నీళ్లకే కళ్లల్లో రక్తం కారేలా తెలుపు నలుపు మూగసినిమాలో చెప్పాడు. అప్పటికే అంతగా గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితి అయితే- ఇప్పటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుట్టించిన స్వయంచాలిత రోబో యంత్రాల అధునాతన పరిశ్రమలను, ఆ పరిశ్రమలను ఇళ్లల్లో నుండి నిద్రలో అయినా మానిటర్ చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ లను చూస్తే చాప్లిన్ ఎన్ని మోడరన్ టైమ్స్ సినిమాలు తీయాల్సివచ్చేదో?

ఇంటర్నెట్, సెల్ ఫోన్లు వచ్చాక ఇల్లు- ఆఫీసు తేడా లేదు. ఉద్యోగి రోజుకు 25 గంటలు సిస్టమ్ ముందు కూర్చోవాల్సిందే. సెల్ ఫోన్ లో అందుబాటులో ఉండాల్సిందే. కరోనా రాగానే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగింది. ఉన్న ఉద్యోగం ఊడిపోవడం కంటే ఇంటినుండి పనిచేసుకునే వెసులుబాటు మొదట్లో ఉద్యోగులకు బాగానే అనిపించింది. రాను రాను యాజమాన్యాలు వర్క్ ఫ్రమ్ హోమ్ పని గంటలు పెంచుకుంటూ పోతున్నాయట. ఆఫీసులో అయితే ఎనిమిది గంటలే. ఇంట్లోనే పడి ఉంటారు కదా? ప్రస్తుతానికి పన్నెండు గంటలు చేసి చావండి- మీ ఖర్మ ఇలాగే బాగా కాలితే భవిష్యత్తులో పద్దెనిమిది గంటలు ఖరారు చేద్దాం అంటున్నాయి యాజమాన్యాలు. అసలే బయట ఆర్థిక సంక్షోభంతో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. ఏదో ఇంట్లోనే కదా అనుకుని తిట్టుకుంటూ, విసుక్కుంటూ విధిలేక పని చేస్తున్నారు. రోజంతా సిస్టం ముందు, వీడియో కాన్ఫరెన్సులు, సెల్ ఫోన్లో ఉండడంతో మానసిక, ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఐ టీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అందరికీ తెలిసిందే. ఇంటిగ్రేటెడ్ థెఫ్ట్ అని గిట్టనివాళ్లు ఎగతాళిగా అంటుంటారు. అంటే సమగ్ర దోపిడీ. ఐ టీ సమగ్ర దోపిడీలో ఉద్యోగులను సంపూర్ణంగా, సమగ్రంగా దోచుకోవడం కూడా ఒక భాగం!

కరోనా రెండో వేవ్ తగ్గుముఖం పట్టగానే…వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక చాలు ఆఫీసులకి రమ్మన్నారు. ఆ క్షణాన ఉద్యోగుల అనుభూతి ఇది.

ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు చొక్కా వేసుకోవడం అలవాటు చేసుకోవాలి.

చొక్కా గుండీలు అన్నీ పద్ధతిగా పెట్టుకోవాలి.

ప్రతి గంట గంటకి నెమరు వేసుకునే ఆవులా ఎదో ఒకటి తింటూ ఉండడం మానుకుని, కాస్త నోరు ఆడించకుండా పని చేయడం అలవాటు చేసుకోవాలి.

మీటింగ్ అనగానే చుట్టూ ఉన్న వాళ్ళని హుష్ హుష్ అనడం మానుకోవాలి.

ఉన్న ఒకటి రెండు వెంట్రుకలను అప్పుడప్పుడు సెలూన్ లో నీట్ గా కట్ చేయించుకోవాలి.

సాధు పురుషులం, సత్పురుషులం కాదు కనుక గెడ్డం గీసుకోవడం నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి.

మధ్యాహ్నం భోజనం అవగానే అలా రెండు తలగడలు వెనక్కి వేసి, పడుకుని, లాప్టాప్ ను పొట్ట మీద పెట్టుకుని, నానా దరిద్ర భంగిమల్లో కాకుండా… చక్కగా కూర్చుని లాప్టాప్ ని లాప్టాప్ గా మాత్రమే వాడడం అలవాటు చేసుకోవాలి.

కాఫీ ఎవ్వడు తెచ్చి ఇవ్వరు. మనమే కేఫ్ కి వెళ్ళి తెచ్చుకుని తాగాలి. మర్యాదగా ఆ కప్ అక్కడ ఉన్న ట్రేలో వేసేయాలి తప్ప, ఉదయం తాగిన కప్ నుంచి అర్ధరాత్రి కప్ వరకూ ఎదో స్టీలు సామానుల వాడిలా పక్కన ఉంచుకోకూడదు.

ఆఫీసులో సినిమాలు వెయ్యరు కనుక, నెట్ ఫ్లిక్, ప్రైమ్, హాట్ స్టార్, ఆహా, ఊహా, వూట్ లాంటి వాటిని క్రమక్రమంగా తగ్గించుకుడానికి ప్రయత్నం చెయ్యాలి.


నెమ్మదిగా వర్క్ ఫ్రమ్ ఆఫీసులకు అలవాటు పడి ఆరు నెలలు కూడా కాలేదు. కరోనా మూడో వేవ్ లేదా ఒమిక్రాన్ వ్యాప్తి వార్తలు వ్యాపిస్తున్నాయి. మళ్లీ నైట్ కర్ఫ్యూలు, కంటైన్ మెంట్ జోన్లు, ఆంక్షలు, జీనోమ్ ట్రేసింగులు… మొదలయ్యాయి. జనవరి దాటి వేసవిలోకి పడేసరికి మళ్లీ అవే కష్టాలు; అవే వార్తలు తప్పేలా లేవు. పెద్ద పెద్ద కంపెనీలు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కు ముహుర్తాలు నిర్ణయించాయి.

రుతు చక్రం గతి తప్పదు. ఒక వారం అటు ఇటుగా వేసవి వస్తూనే ఉంటుంది. ప్రతి వేసవి వెంట కరోనా కూడా వచ్చేలా ఉంది.

అన్నట్లు-
మనం వేసుకున్న రెండు డోసుల ఎక్స్పెయిరీ డేట్ ఎప్పటికి అయిపోతుందో?
బూస్టర్ డోస్ గుచ్చుకోవాలా
మళ్లీ రెండు డోసుల కాక్ టెయిల్ పొడిపించుకోవాలా?
ఇంతకూ-
వ్యాక్సిన్ మీద కరోనా గెలిచినట్లా?
లేక కరోనా ముందు వ్యాక్సిన్ తల వంచినట్లా?
ఈ భయానికి ఇక ఎప్పటికీ అభయం దొరకదా?

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్