Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవర్క్ ఫ్రమ్ హోమ్ కాంతులు

వర్క్ ఫ్రమ్ హోమ్ కాంతులు

Work – Ethics: సమస్యకు దూరంగా పరిగెత్తితే…పరిష్కారానికి కూడా దూరంగా పరుగెడుతున్నట్లు అని ఇంగ్లీషులో ఒక సామెత. Running away from any problem only increases the distance from the solution. అంటే సమస్య ఉన్న దగ్గరే పరిష్కారం కూడా దొరుకుతుంది.

సంక్షోభాల్లోనే పరిష్కారాలు కూడా దొరుకుతూ ఉంటాయి. కరోనా వేళ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉద్యోగాలు పోయాయి. జీతాలు తగ్గాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ లు పెరిగాయి. ఆఫీసులు ఖాళీ అయ్యాయి. ఇళ్లు ఆఫీసులు అయ్యాయి. మొదటి, రెండో వేవ్ లు అయి మూడో సంవత్సరంలో పడ్డాం. ప్రస్తుతం ఏ వేవ్ లో ఉన్నామో తెలుసుకుని ఏడ్చే ఓపిక లేక వదిలేశాం.

వర్క్ ఫ్రమ్ హోమ్ లు మొదట మెట్రో నగరాలకే పరిమితం. నెమ్మదిగా పల్లెల్లో కూడా కరెంట్, ఇంటర్నెట్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లు పెరిగాయి. పిల్లలు హోమ్ వర్క్ లు చేసుకుంటూ ఉంటే…పెద్దలు వర్క్ ఫ్రమ్ హోమ్ లు చేసుకుంటున్నారు.

ఫార్మల్ డ్రస్ బాధ లేదు. టైమ్ కు బయలుదేరాలన్న హడావుడి లేదు. లంచ్ బాక్స్ గొడవ లేదు. పైన ఏదో ఒక టాప్ వేసుకుని ల్యాప్ టాప్ లేదా డెస్క్ టాప్ ముందు కూర్చుంటే చాలు. పని జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఉండి ప్రతి అరగంటకు వంటింట్లో చిరు తిళ్ళు తిని తిని బరువులు పెరిగి కొండల్లా తయారుకావడం తప్ప…వర్క్ ఫ్రమ్ హోమ్ లు సాఫీగానే సాగుతున్నాయి. ఆఫీసు చికాకులన్నీ ఇళ్లల్లో ప్రదర్శించడం లాంటి సమస్యలు వర్క్ ఫ్రమ్ హోమ్ లలో పెరిగాయి. అది వేరే విషయం.

ఆఫీసుకెళితే ఒక్క ఆఫీసు పనే. అదే ఇంట్లో ఉంటే ఆఫీసు పనితో పాటు ఇతర పనులు కూడా చేసుకోవచ్చు. ఆ ఇతర పనులు కాస్తా…మరో ఉద్యోగం చేయడం దాకా వెళ్ళింది. ఇంట్లో ఉంటూ ఒకే ఉద్యోగి రెండు, మూడు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తుండడంతో భారత కార్పొరేట్ దిగ్గజాలకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు.

ఇలా ఒకరు ఒకే సమయంలో అనేక ఉద్యోగాలు చేయడాన్ని “మూన్ లైటింగ్” అంటున్నారు. మరికొందరు చెప్పా పెట్టకుండా కంపెనీలు మారడం, పని భారం తగ్గించుకోవడం చేస్తున్నారు. దీనికి “క్వైట్ క్విట్టింగ్” అని పేరు పెట్టారు.

అటు మూన్ లైటింగ్ అనేక ఉద్యోగాలు, ఇటు మధ్యలో జారిపోయే క్వైట్ క్విట్టింగ్ లతో పెద్ద కంపెనీలకు చుక్కలు కనిపిస్తున్నాయి. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే తప్ప ఒకే వ్యక్తి రెండు, మూడు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నట్లు తనకు తాను ఒప్పుకోడు. తమ ఉద్యోగుల్లో ఎవరెవరు మూన్ లైటింగ్ వెన్నెల విహారాల్లో రాత్రి పగలు ఎన్నెన్ని ఉద్యోగాలు చేస్తున్నారో కనిపెట్టడానికి కంపెనీలు ప్రయివేటు డిటెక్టివ్ ఏజెన్సీల సహాయం కూడా తీసుకుంటున్నాయి. ఇలాంటి ఉద్యోగులను చట్టపరంగా పట్టుకోవడం కష్టంగా ఉందట. ఎందుకంటే ఇంకో కంపెనీ జీతం కుటుంబ సభ్యుడి అకౌంట్లో పడుతూ ఉంటుంది.

నైతికంగా ఇది తప్పు. రాత్రి పగలు పని చేస్తూ ఉద్యోగులు ఆరోగ్యాలను కూడా పాడుచేసుకుంటున్నారు అని విప్రో లాంటి కంపెనీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుతానికి సన్ లైట్, మూన్ లైట్. భవిష్యత్తులో ట్యూబ్ లైట్, పెట్రమాక్స్ లైట్ లు కూడా తోడు కావచ్చు. రాత్రి పగలు ఎన్ని రిక్షాలు తొక్కినా సగటు మనిషి జీవితం అక్కడే ఆగి ఉంటుంది. చన్నీళ్ళకు వేణ్ణీళ్ళలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదో కొంత వెసులుబాటు కలిగిస్తే…అప్పుడే కంపెనీలు కన్నెర్రజేస్తున్నాయి. తమ ట్యూబ్ లైట్ వెలుగు తప్ప…ఉద్యోగులు ఎలాంటి సన్, మూన్ లైట్ లు చూడకూడదన్నది కంపెనీల హుకుం!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

ఉద్యోగమో రామచంద్రా!

RELATED ARTICLES

Most Popular

న్యూస్