Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంలిపిని చంపే చిత్రం

లిపిని చంపే చిత్రం

Telugu Lipi: మాతృ భాష. అమ్మ భాష. మదర్ టంగ్. ఎలా చెప్పినా, ఏ భాషలో చెప్పినా సొంత భాష ప్రాధాన్యం ఉండి తీరుతుంది. మనం కూడా అందుకే భాషతో ఎమోషనల్ గా తెలుగు తల్లి / తెలంగాణా తల్లి అని కనెక్ట్ అవుతాం. అవ్వాలి కూడా. భాసించేది భాష. అంటే వెలిగేది, వెలుగును పంచేది. అంటే నిజమయిన వెలుగు గురించి చెప్పాలన్నా కాంతిమంతంగా వెలిగే భాష లేకపోతే సాధ్యం కాదన్నమాట. అందుకే మండే సూర్యుడి వెలుగును సంకేతిస్తూ భాస్కరుడు అంటున్నాం. మాట కూడా అంతటి సూర్యుడికి తక్కువేమీ కాదని భాష అంటున్నాం.

మాట్లాడే భాష ; రాసే భాష, మాండలిక భాష ; ప్రామాణిక భాష; భాషా భేదాలు; భాషా భాగాలు ; బాషా శాస్త్రం ; భాషోత్పత్తి శాస్త్రం; మెదడు- భాష; భాష- ఆలోచనలు; భాష- సృజనాత్మకత; భాష- అభివృద్ధి ఇవన్నీ చాలా లోతయిన అంశాలు. ఏ కొద్ది మందికో తప్ప ఎవరికీ పట్టవు. భారత దేశంలో మాతృభాష పరిరక్షణలో తమిళుల స్ఫూర్తి, పట్టుదల ఇంకెవరికీ అబ్బలేదు. అది వారి రక్తంలో అణువణువునా ఉంది. మన రక్త పరీక్షలో లేదని తేలింది. ఇంకొన్నేళ్ళకు తెలుగుభాష అంతరించిపోతుందని కొందరు అనవసరంగా భయపెడతారు. ఇంత ప్రామాణికమయిన లిపి, వాడుక ఉన్న తెలుగు భాష అంతరించిపోదు. ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణ మూర్తి లాంటివారు 50 ఏళ్ల కిందటే అంచనా వేసినట్లు కనీసం చివర క్రియాపదం ఒంటికాలి మీద అయినా తెలుగు బతికి ఉంటుంది.

ట్రెయిన్ లేట్ గా వచ్చింది.
బ్యాంక్ బ్యాలెన్స్ అయిపొయింది.
డోర్ ఓపెన్ కాలేదు.
కార్ స్పీడ్ గా వెళ్ళింది….. ఇలా మనం రోజువారీ అద్భుతమయిన తెలుగు మాట్లాడుతున్నాం అనుకుని మాట్లాడుతున్న తెలుగులో ముప్పాతిక భాగం తెలుగు కాదు.
ట్రయిన్ ఈజ్ లేట్.
దేర్ ఈజ్ నో బ్యాలెన్స్.
డోర్ ఈజ్ నాట్ ఓపెనింగ్. అని మాట్లాడితే బాధపడాలికానీ- చివర క్రియా పదంలో అయినా తెలుగుభాష వాడుతున్నందుకు అసలు మనల్ను మనమే అభినందించుకోవాలి. ముప్పాతిక భాగం భాష చచ్చి, పాతిక భాగమే బతుకుతోందని బాధపడ్డం దండగ. ఆమాత్రం అయినా బతికిస్తున్నాం కదా అనుకుంటే పండగ.

తెలుగు భాషలో ఒత్తులు నేటితరానికి పెద్ద సమస్య. భాషా పండితులు, మేధావులు, శ్రేయోభిలాషులు అందరూ అలోచించి అసలు ఒత్తులే లేని తెలుగు భాషను ఆవిష్కరించడానికి ప్రయత్నించాలి. ఒత్తులు పలకలేని యాంకర్లను సానుభూతితో అర్థం చేసుకోవాలేగాని, వారిని సంస్కరించడానికి ప్రయతించకూడదు. ఒత్తులు రాయలేనివారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పూర్తిగా ఇంగ్లీషులో రాయడంతో పోలిస్తే ఒత్తుల్లేకుండా అయినా తెలుగులో రాస్తున్నవారు దేవుళ్లతో సమానం. ఒత్తలేని జాతిని పొత్తిళ్లలో పెట్టుకుని కాపాడుకోవాలి. భావం ప్రధానం కానీ భాష ప్రధానం కాదు- అన్న ఆధునికుల సిద్ధాంతాన్ని భాషా శాస్త్రవేత్తలు నిండుమనసుతో, నిర్మాణాత్మక దృష్టితో, వాస్తవ స్థితిగతుల నేపథ్యంలో అంగీకరించాలి.

తెలుగు భాష అంతరించకపోవచ్చు కానీ, తెలుగు లిపి మాత్రం ఖచ్చితంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. దానికి మనమే కారణం. కానీ మనం ఒప్పుకోము. సినిమా పాటలు ఏవి విడుదల చేసినా-
భాష తెలుగే అయినా ఇంగ్లీషు లిపిలో ఉంటాయి.
పరమ పవిత్రమయిన, పదహారణాల తెలుగును పిండి వండి వార్చిన-
కెవ్వు కేక . . . మా వీధంతా కెవ్వు కేక …
ఎసరులాగా మరుగుతోంది ఒంట్లో కారం,
స్పెషల్ మీల్సు లెక్కుంటది నాతో బేరం. . .
లాంటి అంత్యప్రాసల, తెలుగు నుడికారపు శైలీ విన్యాసాలతో సిగ్గులేకుండా ఏ వేదికమీద, ఎవరి ముందయినా పాడుకోదగ్గ పాట ఉందనుకోండి. దీన్ని ఇలా తెలుగు లిపిలో పొరపాటునకూడా విడుదల చేయరు. ఓవర్సీస్ మార్కెట్ అవసరాలు అన్న పేరుతో దీన్ని ఇంగ్లీషు లిపిలో-
“Kevvuu…
Yee koppuna pulettukoni buggana yelettukoni
eedenta nenelthunte kevvu keka
na eedanta kevvu keka.
Papita billettukoni mamidi pallettu koni
uranta neneltunte kevvu keka
na ooranta kevvu keka…”
ఇలా విడుదల చేస్తారు. నెమ్మదిగా తెలుగు భాషను ఇంగ్లీషు లిపిలో రాయడం ఆచారం, పధ్ధతి, ఫ్యాషన్ గా అలవాటు చేశారు.

మాయాబజార్లో పింగళి మాట- పెళ్లి చేయమంటే కష్టం కానీ; చెడగొట్టమంటే చిటికెలో పని– అన్నట్లు భాషను ఉద్ధరించాలంటే కష్టంకానీ, నాశనం చేయాలంటే చిటికెలో పని. రండి బాబు రండి!
రండి తల్లీ రండి!
తలా ఓ చెయ్ వేసి తెలుగు లిపిని నామరూపాల్లేకుండా చేద్దాం.
తిలాపాపం తలా కడివెడు పంచుకుందాం.

Telugu Words

వారం, పది రోజుల వ్యవధిలో కొన్ని కోట్లమందిని ప్రభావితం చేయగల సినిమా అతి పెద్ద మాధ్యమం. మాస్ మీడియా. అలాంటి సినిమాల్లో ఏటికి ఎదురీదుతూ…పట్టుమని నలుగురయినా తెలుగు భాషను, వ్యక్తీకరణను, సంస్కృతిని, మొత్తంగా తెలుగుతనాన్ని పట్టుకుని వేలాడుతున్నందుకు వారికి ప్రత్యేకంగా నమస్కరించాలి.

ఏనాడో భాషా శాస్త్రవేత్తలు లెక్కకట్టినట్లుగా-
తెలుగు సినిమాల్లో ముప్పాతిక శాతం ఇంగ్లీషును విధిగా వాడాలి.
అర్థంలేని ఆరు పాటల్లో అర్థమున్న రెండుపాటలయినా పూర్తిగా ఇంగ్లీషు భాషలోనే పెట్టాలి. దీనికి హాలీవుడ్ కు వెళ్లాల్సిన పనేలేదు. మనవాళ్లెవరయినా అందమయిన తెలుగు రాయమంటే వణికిపోతారుకానీ, ఇంగ్లీషులో రాయమన్నా, పాడమన్నా అది మనకు వెన్నతో పెట్టిన మిథ్య. ఎలాగూ డిజిటల్ మీడియా అవసరాలు బాగా పెరిగాయికాబట్టి పాటలకే కాకుండా మాటలకు కూడా ఇంగ్లీషులిపిలో అక్షరాలు సినిమా మొత్తం వేయాలి. అసలు తెలుగు సినిమా మొత్తానికి ఇంగ్లీషు లిపిలో అక్షరాల్లేకపోతే సెన్సారు వారు అనుమతించకూడదు. తెలుగు భాషను ఇంగ్లీషు లిపిలోకి దించుతున్న పుణ్యపురుషులకు ఉత్తమ transliteration/ లిపి అంతరీకరణ అవార్డులను ఇబ్బడి ముబ్బడిగా ఇవ్వాలి.
తెలుగు భాషను తెలుగు లిపిలోనే రాసే మైనారిటీ జాతి మీద భవిష్యత్తులో దాడులు జరగకుండా గట్టి భద్రత కల్పించాలి!

-పమిడికాల్వ మధుసూదన్

ఇవి కూడా చదవండి:  

పోయిందే సోయా

RELATED ARTICLES

Most Popular

న్యూస్