బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ రాజకీయంగా దిగజారి మాట్లాడుతున్నాడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ఎన్నికల్లో రూ.25 కోట్లు కాంగ్రెస్ కు కేసీఆర్ ఇచ్చారని రాజేందర్ దిగజారి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్‌ఎస్ నుంచి కానీ, కేసీఆర్ నుంచి కానీ ఒక్క రూపాయి కూడా సాయం పొందలేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కార్యకర్తలు చందాలు వేసుకున్నవేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోని బలహీన వర్గాల నాయకులే మునుగోడు ఉప ఎన్నికలకు ఆర్ధిక సాయం చేశారని తెలిపారు.
వారి శ్రమను , ఆర్థిక సాయాన్ని అవమానించేలా ఈటెల మాట్లాడటం సమంజసం కాదన్నారు. మీరు బీజేపీ భాగ్యలక్ష్మి అమ్మ వారిని నమ్ముతారు కదా.. శనివారం సాయంత్రం 6 గంటలకు వాళ్లు నమ్మే భాగ్యలక్ష్మి టెంపుల్ లో దేవుడిపై ఒట్టేసి చెబుతా.. తనపై ఆరోపణలను ఈటెల నిరూపించడానికి సిద్ధమా? అని అడిగారు.
చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ లో తడి బట్టలతో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు. రాజకీయాల కోసం ఈటెల దిగజారి మాట్లాడటం క్షమించరాని నేరమన్నారు. నాపై ఆరోపణలను రాజేందర్ 24 గంటల్లో నిరూపించాలని రేవంత్ సవాల్ చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు తాను వస్తానని, భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఈటెల సిద్ధంగా ఉండాలన్నారు. భాగ్యలక్ష్మి దేవుడిపై నమ్మకం లేకుంటే.. ఏ ఆలయంలో నైనా తడి బట్టలతో ప్రమాణానికి తాను సిద్దమని రేవంత్ రెడ్డి ప్రకటించారు.