ఉద్యోగులకు మేలు చేసింది నాడు వైఎస్సార్ అయితే, నేడు ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఎవరినో కాపీ కొట్టి, తెలంగాణా సిఎం ఇచ్చారు కాబట్టి ఆయన కంటే ఒక శాతం ఎక్కువ డిఏ ఇస్తున్నామని చెప్పడం కాకుండా, వారికి దీర్ఘ కాలిక ప్రయోజనాలు చేకూర్చేలా సిఎం నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు. జగన్ పై విమర్శలు చేసే కొందరు ఉద్యోగ సంఘాల నేతలు, ఇది ఉద్యోగస్తుల వ్యతిరేక ప్రభుత్వమని ప్రచారం చేసేవారు ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. తాడేపల్లి- సీఎం క్యాంప్ ఆఫీసు మీడియా పాయింట్ వద్ద పేర్ని విలేకరులతో మాట్లాడారు. 2014జూన్ 2 కు ముందు ఐదేళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని నిర్ణయంచడం ద్వారా ‘చెప్పాడంటే – చేస్తాడంతే’ అన్న మాటను జగన్ నిజం చేశారని ప్రశంసించారు.
ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ను ప్రభుత్వంలో విలీనం చేయడం గొప్ప నిర్ణయమన్నారు. నర్సులు, కంపౌండర్లు, ఎంఎన్ఓ లు…ఎంతో కష్టపడి పని చేస్తూ జీతం కోసం ఎదురు చూడాల్సి వచ్చేదని, ఎన్నో ఇబ్బందులు పడుతున్న దాదాపు 13 వేల మంది ఉద్యోగస్తులకు నెల నెలా జీతం వచ్చేలా నిర్ణయం తీసుకోవడం ఉద్యోగస్తుల పట్ల జగన్ కు ఉన్న సానుకూలత కు నిదర్శనమన్నారు. తన చెవులకు చేరిన ప్రతి విషయంపై అలోచించడం ఆయనకే దక్కిందన్నారు.
పోగేసుకున్న జనం కనబడగానే పోలీసులను నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతూ, నిత్యం పోలీసులను ఏకవచనంతో మాట్లాడుతూ విమర్శలు చేసే లోకేష్…. పోలీసులను అసభ్య పదజాలంతో మాట్లాడిన అచ్చెన్నాయుడులు అదే పోలీసులు లేకపోతే బతకలేరని పేర్ని ఆగ్రహంవ్యక్తం చేశారు. లోకేష్ ఒక పార్టీకి అధ్యక్షుడూ కాదు, ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా కాదని… కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు మాత్రమేనని… అయినా అతనికి పరిమితికి మించిన భద్రత ఇస్తున్నామని చెప్పారు. లోకేష్ సెల్ఫీ ఇవ్వలేదని టిడిపి కార్యకర్తే కోడిగుడ్డుతో దాడి చేస్తే.. భద్రత కరువైందని విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.
పవన్ వారాహి యాత్రపై నాని పరోక్ష విమర్శలు చేశారు. ప్రజల మనిషి, ప్రజా నాయకుడిగా ఉండాల్సిన రాజకీయ నేతలు ఇప్పుడు కుల నాయకుల్లా తయారయ్యారని నాని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కులం ఓట్లు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి నెలకొని ఉందన్నారు. ముఖ్యంగా చంద్రబాబు తమ కులాన్ని ఈ విధంగా వాడుకుంటున్నందుకు బాధగా ఉందన్నారు.