విశాఖ రిషికొండ నిర్మాణాలపై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖను రాజధానిగా ప్రకటించిన తరువాత ప్రభుత్వం త్రీమెన్ కమిటీ వేసిందని…. దాని సిఫార్సుల మేరకే ఆ నిర్మాణం చేపట్టామని వివరణ ఇచ్చారు. అక్కడ నిర్మించినవి ప్రభుత్వ భవనాలు అయితే వాటిని జగన్ సొంత భవనాలుగా ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. విశాఖ నగరంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అమర్నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
విశాఖను రాజధానిగా ప్రకటించిన తరువాత గంటా శ్రీనివాస్ మొదట మద్దతు పలికారని గుర్తు చేశారు. రాజధాని కాబట్టి రాష్ట్రపతి, ప్రధాని లాంటి అతిథులు వచ్చినప్పుడు బస చేసేందుకు సరైన అతిథి గృహాలు లేవని…. అందుకే టూరిజం శాఖా ఆధ్వర్యంలో కొండపై ఈ భవనాలు నిర్మించామని వివరించారు. కేవలం జగన్ ను బద్నాం చేసే ప్రయత్నం టిడిపి చేస్తోందన్నారు. ఈ కొండకు ఎదురుగా ఉన్న గీతం కాలేజీలో 13 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఏకంగా నిర్మాణాలు కూడా చేపట్టారని దానిపై కూడా టిడిపి నేతలు చూపించి మాట్లాడితే బాగుండేదని సలహా ఇచ్చారు.
ఓ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలని తాము నిర్ణయించుకున్నామని… కానీ ఇలాంటి అనవసర ఆరోపణలతో రాజకీయ విమర్శలకు దిగడం మంచిది కాదని, ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు చెప్పాలని… వారిని మభ్యపెట్టే పనులు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
మొదటగా 1987లోనే ఈ కొండపై టూరిజం ప్రాజెక్టు నిరించాలని నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సంకల్పించారని మాజీమంత్రి వెల్లడించారు. అప్పుడు కూడా అక్కడ కొండలు, గుట్టలే ఉన్నాయని గ్రహించాలని టిడిపి నేతలకు హితవు పలికారు.