Sunday, January 19, 2025
HomeTrending NewsAfghan Consulate: తాలిబన్లతో దౌత్యం భారత్ కు లాభదాయకం

Afghan Consulate: తాలిబన్లతో దౌత్యం భారత్ కు లాభదాయకం

ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయం అక్టోబర్ 1వ తేదీన మూసివేశారు. భారత ప్రభుత్వం సహకరించటం లేదని… అందుకే కార్యకలాపాలు నిలిపివేసినట్టు తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి రావడం చాలా దురదృష్టకరమని, కొనసాగించడం సవాలుగా మారిందని వివరించింది. దౌత్యవేత్తలకు వీసా రెన్యువల్ విషయంలోనూ ఆలస్యం జరుగుతోందని, ఈ విషయంలో భారత్ చొరవ చూపించకపోవడం వల్ల కార్యాలయాన్ని మూసేయక తప్పడం లేదని నోట్‌ విడుదల చేసింది.

ప్రస్తుతం భారత్‌లో ఆఫ్ఘాన్ రాయబారిగా ఫరిద్ మముండ్జే వ్యవహరిస్తున్నారు. తాలిబన్లు ఆఫ్ఘాన్‌ను ఆక్రమించకముందు ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్న అష్ఱఫ్ ఘని ఇతడ్ని నియమించారు. ప్రస్తుత తాలిబన్ల ప్రభుత్వంలోనూ ఫరీద్ అదే పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఆయన కొద్ది నెలలుగా లండన్ లో ఉంటున్నారు.

భారత్‌లో ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయంలో ట్రేడ్ కౌన్సిలర్‌గా వ్యవహరిస్తోన్న ఖాదిర్ షా కొన్ని నెలల కిందట రాయబార కార్యాలయానికి తానే ఇంఛార్జీని అంటూ భారత విదేశాంగ శాఖకు లేఖ రాశారు. అయితే ఆఫ్ఘాన్ లో తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్ ఇంకా గుర్తించలేదు. ఈ నేపథ్యంలోనే ఆ దేశ రాయబార కార్యాలయానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు.

మరోవైపు ముంబైలోని ఆఫ్ఘన్ కాన్సుల్ జనరల్ జకియా వార్దక్, హైదరాబాద్‌లోని యాక్టింగ్-కాన్సుల్ జనరల్ సయ్యద్ మహ్మద్ ఇబ్రహీంఖైల్ తమ విధులను కొనసాగిస్తామని ధృవీకరించారు. నిజానికి గత కొన్ని నెలలుగా భారత్‌లో ఆఫ్ఘాన్ రాయబారి లేరు. ఢిల్లీలోని ఆఫ్ఘాన్ దౌత్యవేత్తలు కూడా యూకే, అమెరికా వెళ్లి ఆశ్రయం పొందుతున్నారు. ఎంబసీలో అధికారం కోసం కమ్ములాట మొదలైంది.

ఆఫ్ఘనిస్తాన్ లో మానవతా సాయం, వైద్య సహాయం, వాణిజ్యం సులభతరం చేయడానికి కాబూల్‌లో మిషన్ నడుపుతున్న కొన్ని దేశాల్లో భారత్ ఒకటి. 2019-20లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 1.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత ఇది బాగా పడిపోయింది.

భారత్‌లో చాలా మంది అఫ్గాన్ పౌరులున్నారు. భారత్ లో విద్య అభ్యసిస్తున్న వందలాది ఆఫ్ఘాన్ విద్యార్థులు వీసా గడువు ముగిసిపోయినా ఇక్కడే ఉన్నారు. తమను భారత్ లోనే ఉండనివ్వాలని కోరుతూ సెప్టెంబర్ లో వారు న్యూఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారు.
తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టాక ఆఫ్ఘన్-పాక్ దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పాక్ స్వార్థానికి ఆఫ్ఘన్ బలి అయిందని తాలిబన్లు గుర్రుగా ఉన్నారు. ఉత్తర పాక్ లోని సరిహద్దుల విషయంలో నిత్యం రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంటోంది.

తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్ (TTP) పాకిస్తాన్లో ప్రభుత్వాలకు సవాల్ విసురుతోంది. పంజాబ్, ఖైభర్ పఖ్తుంఖ్వ రాష్ట్రాల్లో దాడులు చేస్తూ… టిటిపి సానుభూతిపరులు ఆఫ్ఘన్లో ఆశ్రయం పొందుతున్నారు. బలూచిస్తాన్ లో తిరుగుబాటు గ్రూపులకు సాయం చేస్తున్నారు. టిటిపి వ్యవహారంలో తాలిబన్లు మాట వినటం లేదని పాక్ సైన్యం ఆరోపిస్తోంది.

ప్రస్తుతం ఆఫ్ఘన్లో పాక్ పౌరుడు అంటేనే దాడి చేసే పరిస్థితి నెలకొంది. అదే సమయంలో భారత్ అంటే గౌరవ భావంతో సాదర సత్కారాలు లభిస్తున్నాయి. తాలిబాన్ వర్గాలతో పాటు సాధారణ పౌరులు కూడా భారత్ అంటే ఎంతో గౌరవంగా మర్యాద పాటిస్తున్నారు.

ఆహారం, అత్యవసర వైద్య సాయానికి మందులు, కరోనా సమయంలో వాక్సిన్ సాయం ఇలా వివిధ రకాలుగా భారత్ ఆధుకుంటోంది అని ఆఫ్ఘన్ ప్రజలు వేనోళ్ళ పొగుడుతున్నారు. తాలిబన్లు పాలన పగ్గాలు చేపట్టాక ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రమూకల కార్యకలాపాలు తగ్గాయని విశ్లేషణలు ఉన్నాయి. పాక్ ప్రోత్సహిస్తున్న చొరబాటు దారులే భారత కాశ్మీర్ లో విధ్వంసానికి దిగుతున్నారు. ఈ తరుణంలో భారత ప్రభుత్వం చొరవ తీసుకొని వాణిజ్యం గాడిలా పెట్టేలా చర్యలు తీసుకోవాలి.

అదే సమయంలో చైనా పాలకులు తాలిబన్లతో దౌత్య సంబంధాలు బలోపేతం చేస్తున్నారు. ఆఫ్ఘన్ లో రాయబార కార్యాలయం ప్రారంభించిన చైనా… ప్రపంచంలో అఫ్ఘన్ల పాలనను గుర్తించిన మొదటి దేశంగా నిలిచింది. ఆఫ్ఘన్ లోని లిథియం, జింక్ తదితర గనుల మీద కన్ను వేసిన చైనా వాటిని చేజిక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తోంది.

అయితే ఆఫ్ఘన్ పాలకులు, పౌరులకు చైనా విధానాలపై నమ్మకం లేదు. డ్రాగన్ దేశం అవసరానికి వాడుకుని వదిలేస్తుందని విమర్శిస్తున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇప్పుడు ఎవరో ఒకరి తోడు ఆఫ్ఘన్ కు కావాలి. అమెరికా, నాటో దేశాల మాయలో పడి తాలిబన్లను విస్మరించటం భారత్ కు క్షేమ దాయకం కాదు.

ఈ దశలో భారత నాయకత్వం మానవత సాయం కోసం నిర్వహిస్తున్న మిషన్ మరింత ముమ్మరం చేసి తాలిబన్లతో సఖ్యత కొనసాగిస్తే మేలు జరిగే అవకాశం ఉంది. ఆఫ్ఘన్ రూపాయి -భారత్ రూపాయికి మారకంలో సమానం. మరోవైపు ఆఫ్ఘన్ వ్యాపారులు భారత్ తో వాణిజ్యానికి ఆసక్తిగా ఉన్నారు. డాలర్లు, రూపాయల్లో కాకుండా బార్టర్ (వస్తు మారకం) పద్దతిలో వ్యాపారం చేసేందుకు సిద్దంగా ఉన్నారు.

ఆఫ్ఘన్ కు అవసరమైన వైద్య పరికరాలు, ఔషధాలు, దుస్తులు, గోధుమ, రైస్, పప్పు ధాన్యాలు తదితర అత్యవసర వస్తువులను ఎగుమతి చేసి అక్కడి నుంచి నాణ్యమైన డ్రై ఫ్రూట్స్ దిగుమతి చేసుకోవటం లాభదాయకం. ఈ అవకాశాల్ని ప్రోత్సహించేలా భారత్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్