సిఎం జగన్ ను ఎవరు వ్యతిరేకించినా వారికే నష్టం తప్ప జగన్ కు కాదని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. జగన్ తన జెండా, అజెండా, చరిష్మాతో గెలిపించుకున్న ఎమ్మెల్యేలని, గతంలో చంద్రబాబు 23మంది ఎమ్మెల్యేలను  కొనుగోలు చేసి వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబుకు ఇంత వయసు వచ్చినా నాడు వైస్రాయ్ హోటల్ లో చేసిన రాజకీయాలే ఇంకా సిగ్గు లేకుండా చేస్తున్నారని రోజా దుయ్యబట్టారు. ఇలాంటి నేతను తరిమి కొట్టాలని పిలుపు ఇచ్చారు.

కిరణ్ కుమార్ రెడ్డి పై తాము అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కూడా తన ఎమ్మెల్యేలను ఆయనకు మద్దతుగా నిలిపారని రోజా విమర్శించారు. ఎంత నీతి మాలిన రాజకీయాలు చేస్తే అంత దిగజారిపోతారన్నారు. ప్రజలు జగన్ వైపు ఉన్నారని, టార్గెట్ 175ను తాము సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు, మొత్తం 21 సీట్లకు ఎన్నికలు జరిగితే తాము 17 గెలిచామనన్నారు. ఈ విజయానికే టిడిపి నేతలు చంకలు గుద్దుకొని పండగ చేసుకుంటున్నారంటే ఇంతకంటే పిచ్చోళ్ళు వేరే ఉండరన్నారు.

తమ పార్టీ నుంచి టిడిపికి ఓటు వేసిన వారి భవిష్యత్ ఏంటో ప్రజలే చెబుతారని, జగన్ ను మోసం చేసిన ప్రతి ఒక్కరూ చరిత్ర హీనులుగానే మిగిలిపోతారని ఫైర్ అయ్యారు. ఒకవేళ వారికి ఎవరైనా సీటు ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు.  వారు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లేనన్నారు.

Also Read : Ap Mlc Election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యం ఫలితం; టిడిపి గెలుపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *