తెలుగుదేశం పార్టీ మహానాడుకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గతంలో వైసీపీ ప్లీనరీకి ఏ విధంగా బస్సులు అందించారో, అలాగే మాకూ ఇవ్వాలని అధికారులకు లేఖ రాసినా ఇంతవరకూ స్పందన లేదని విమర్శించారు. కిందిస్థాయి అధికారులను అడిగితే పై నుంచి ఇంకా ఆదేశాలు అందలేదని అంటారని, పై స్థాయి అధికారులను ప్రశ్నిస్తే సిఎం జగన్ ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదని చెబుతున్నారని అన్నారు.  వైసీపీ ప్లీనరీకి కిలోమీటర్ కు ఎంత కట్టించుకున్నారో, ఏ నిబంధనలు పెట్టారో వాటిని తాము కూడా పాటిస్తామని చెప్పినా ఇంతవరకూ సమాధానం ఇవ్వలేదని వివరించారు. ఈ ఏడు మహానాడు రాజమండ్రి నగర శివారు ప్రాంతంలో రేపటి నుంచి రెండ్రోజులపాటు జరగనుంది.  సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి అచ్చెన్న పరిశీలించారు, అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రైవేట్ స్కూళ్ళ బస్సులను అయినా అద్దెకు తీసుకుందామని అనుకుంటే, తాము అడిగిన వెంటనే బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఆయా స్కూలు యాజమాన్యాలకు ఫోన్లు చేసి ఫైన్ వేస్తామంటూ బెదిరిస్తున్నారని  అన్నారు.  ఒంగోలులో జరిగిన గత మహానాడుకు సైతం ఇలాగే అడ్డంకులు సృష్టించినా జన ప్రభంజనం ఆగలేదని, అలాగే రాజమండ్రికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న వాహనాన్ని వినియోగించుకొని మహానాడుకు రావాలని, ఏ వాహనం లేకపొతే దేవుడిచ్చిన వాహనం కాళ్ళ తో నడుచుకుంటూ రావాలని అచ్చెన్న పిలుపు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *