Sunday, September 22, 2024
HomeTrending Newsఅతి త్వరలో ఎన్నికలు: బాబు అనుమానం

అతి త్వరలో ఎన్నికలు: బాబు అనుమానం

Early Elections: ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోందని, అందుకే అతి త్వరలో ఎన్నికలకు వెళ్లేందుకు సిఎం జగన్ ప్రయతిస్తున్నారని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మరిన్ని రోజులు గడిస్తే వ్యతిరేకత మరింత పెరుగుతుందని జగన్ భయపడుతున్నారని బాబు వ్యాఖ్యానించారు. ఎపుడు ఎన్నికలు జరిగినా తాము విజయం సాధించడం ఖాయమని, వైసీపీని వీలైనంత త్వరగా ఇంటికి పంపేందుకు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని, నెత్తిమీద కుంపటి దించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, దిశా చట్టం తెచ్చినా ఇప్పటికీ దానికి చట్టబద్ధత కల్పించలేక పోయారని విమర్శించారు, సిఎం జగన్ ఇచ్చేది గోరంత, దోచుకునేది కొండంతగా ఉందన్నారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలతో మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసింది తామేనని, గత ప్రభుత్వ హయాంలో తాము మహిళలకు ఉచితంగా ఇళ్ళు కట్టించి ఇస్తే వాటికి ఇప్పుడు ఓటిఎస్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని బాబు ఆరోపించారు. ఎప్పుడో ఎన్టీఆర్ ఇచ్చిన ఇళ్ళకు కూడా ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు. ఓటిఎస్ వసూళ్ళ కోసం వచ్చేవారిని నిలదీయాలని, డబ్బులు కట్టవద్దని బాబు పిలుపు ఇచ్చారు.

ఈ ప్రభుత్వం హయంలో ఖర్చులు ఎక్కువ, ఆదాయాలు తక్కువగా ఉన్నాయని, చెత్తపై కూడా పన్నువేసిన చెత్త ప్రభుత్వమని అభివర్ణించారు. మధ్య నిషేధం పేరుతో కొత్త బ్రాండ్లను తీసుకువచ్చారని, మద్యంపై వచ్చే ఆదాయాన్ని 25 ఏళ్ళు తాకట్టు పెట్టారని బాబు అన్నారు. తాము ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే ఈ ప్రభుత్వం చికెన్, మటన్ షాపుల్లో ఉద్యోగాలిస్తోందని ఎద్దేవా చేశారు.

మరోవైపు, నేడు ప్రభుత్వం నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా చేసిన సవాల్ పై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. నగరిలో రోజా రాజీనామా చేయాలని, ఆమె తిరిగి గెలిస్తే తాము వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయమని ప్రతిస్పందించారు.  మొన్న ఓ సభలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తమకు వచ్చే ఎన్నికల్లో 160 సీట్లు వస్తాయని ధీమాగా చెప్పారు. దీనిపై రోజా నేడు విమర్శలు చేశారు. ఆయనకు అంత ధీమా ఉంటే ఇప్పుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చూడాలని రోజా ఛాలెంజ్ చేశారు, దీనిపై అచ్చెన్నాయుడు స్పందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్