Saturday, January 18, 2025
HomeTrending NewsChandrabaabu: యుద్ధభేరీ మోగించడానికే వచ్చా: బాబు

Chandrabaabu: యుద్ధభేరీ మోగించడానికే వచ్చా: బాబు

నాలుగేళ్ళలో రాయలసీమకు సిఎం జగన్ చేసిన ఒక్క మేలు గురించి చెప్పాలని, ఒకవేళ సమాధానం లేకపోతే ముక్కు నేలకు రాసి  క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. పెన్నా టూ వంశధార పేరుతో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలను శ్రీకారం చుట్టిన బాబు నేడు ముచ్చుమర్రి ప్రాజెక్టు వద్దకు వెళుతూ నందికొట్కూరు లో జరిగిన రోడ్ షో లో పాల్గొని ప్రసంగించారు.  సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధ భేరీ మోగించడానికే తాను ప్రాజెక్టుల సందర్శనకు వచ్చానని తెలిపారు.  తెలుగుదేశం హయంలో రాయలసీమ ప్రాజెక్టులకు 12,400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, ఈ ప్రభుత్వం నాలుగేళ్ళలో 2 వేల కోట్లు మాత్రమే వ్యయం చేసిందన్నారు.

తెలుగుదేశం పార్టీ ఎంతో ముందు చూపుతో సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిందన్నారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ప్రతి ఎకరాకూ సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యంతోనే హంద్రీ-నీవా, మరోవైపున గాలేరు-నగరి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామని, కానీ ఈ ప్రభుత్వం చిన్న చిన్న పనులు కూడా పూర్తి చేయకుండా వాటిని నిరుపయోగంగా మార్చిందని, ప్రస్తుతం సీమ ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా ఉందని విమర్శించారు.

మాటలు మాట్లాడడం, బూతులు తిట్టడం కాదని, ముందు ప్రాజెక్టులు పూర్తి చేయాలని, చేతగాకపోతే తప్పుకోవాలని… తానూ వచ్చి ఈ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కావో, రాయలసీమ ఎలా సస్యశ్యామలం కాదో చేసి చూపిస్తానని సవాల్ చేశారు.  కర్నూలు జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నా అక్కడి పొలాలకు సాగునీరు లేని దౌర్భాగ్యం నెలకొని ఉందన్నారు.  రాయల సీమకు జగన్ తీరని ద్రోహం చేస్తున్నారని,  ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొచ్చి వైసీపీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. నాలుగున్నర ఏళ్ళు పూర్తయిందని, ఇంకా ఆరు నెలలు మాత్రమే మిగిలిందని, ఇప్పటి వరకూ ఏ వర్గానికీ ఈ పాలనలో న్యాయం జరగలేదని దుయ్యబట్టారు.

ఇక్కడో మహా నాయకుడు విర్రవీగుతున్నాడని, ఎమ్మెల్యే అంటే కూడా లెక్కలేదని, ఆయన ఆటలు నాముందు సాగవు … రౌడీయిజం చేయడం కాదని, సేవ చేయాలని, ఖబడ్దార్ అంటూ పరోక్షంగా బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్