పూరీ జగన్నాథ రథయాత్ర అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఓడిశాలోని పూరి నగరంలో జూన్ లేదా జూలై నెలలో నిర్వహించే రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను శ్రీక్షేత్రం వీధుల్లో ఊరేగిస్తారు. పూరీ జగన్నాధ రథయాత్రకు చేపట్టిన భారీ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. జులై 7న ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జగన్నాధ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.
53 ఏళ్ళ తర్వాత ఒకే రోజున నవయవ్వన వేడుక, నేత్రోత్సవం, ఘోషయాత్ర నేత్రపర్వంగా నిర్వహించేందుకు పూరి నగరం ముస్తాబైంది. పూరీ ఆలయం ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటిలో ప్రత్యేకమైనది జగన్నాథ రథయాత్ర. మొదట బలభద్రుని(తాళ ధ్వజం) రథం వరుసగా సుభద్ర(దర్ప దళాన్) ఆ తర్వాత జగన్నాథుని (నంది ఘోష్) రథాలు అనుసరిస్తాయి.
జగన్నాథుని రథం(నంది ఘోష్) 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. నాలుగు వేల మంది భక్తులు ఈ రథాన్ని లాగుతారు.
ఏటా ఆషాడ శుద్ధ తదియ రోజున నేత్రపర్వంగా సాగే ఉత్సవాన్ని వీక్షించేందుకు విదేశాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత కాగా యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది.
జగన్నాథుని రథయాత్ర మేళ తాళాలతో బయలుదేరే సమయంలో పూరి చుట్టుపక్కల ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. రథయాత్ర కోసం అక్షయ తృతీయ రోజు నుంచే రథం తయారు చేసే పనులు ప్రారంభమవుతాయి. రథాల తయారీకి కొత్త వేప, కలప చెట్లను ఉపయోగిస్తారు.
మూడు రథాల తయారీకి 884 చెట్లను వాడతారు. పూజారులు అడవికి వెళ్లి రథాన్ని నడిపేందుకు ఉపయోగించే చెట్లకు పూజలు చేస్తారు. పూజ అనంతరం బంగారు గొడ్డలితో చెట్లను నరికేస్తారు. ఈ గొడ్డలి మొదట జగన్నాథుని విగ్రహాన్ని తాకేలా తయారు చేస్తారు. బంగారు గొడ్డలితో చెట్లను కత్తిరించే పని మహారాజా ద్వారా జరుగుతుంది.
గుండిచా జగన్నాథుని భక్తుడు. తన భక్తిని గౌరవిస్తూ ప్రతి ఏడాది స్వామి వారు ఇక్కడికి వస్తారని నమ్మకం. గండిచా ఆలయాన్ని గుండిచా బారి అని కూడా అంటారు. ఇక్కడే జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర దేవి ఏడు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. గుండిచా ఆలయంలో జగన్నాథుని దర్శనాన్ని ఆడప్ దర్శనం అంటారు. జగన్నాథుడు, బలరాముడు, సుభద్రా దేవి విగ్రహాలను విశ్వకర్మ ఇక్కడ నిర్మించాడని చెబుతారు.
రథయాత్రలో కుల వివక్ష అనేదే ఉండదు. రథయాత్ర ముగింపు సందర్భంగా విగ్రహాలన్నీ జగన్నాథ ఆలయానికి చేరుకునే వరక రథంలోనే ఉంటాయి. ఆషాఢ మాసం దశమి రోజున రథాలు ఆలయానికి బయలుదేరినప్పుడు, రథాల తిరుగు ప్రయాణాన్ని బహుద యాత్ర అంటారు. ఏకాదశి రోజు ఆలయ తలుపులు మూసేస్తారు. తదనంతరం స్నానం చేయించిన తర్వాతే తిరిగి విగ్రహాలను ప్రతిష్టిస్తారు.
రధయాత్ర వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటున్నారు. ఈ ఏడాది రధయాత్రలో పాల్గొనేందుకు రాష్ట్రపతి రావటంతో భద్రత పెంచారు. ఒడిశాలో రథయాత్ర సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులు సెలవు ప్రకటించింది.
-దేశవేని భాస్కర్