Jaladi Raja Rao Live Forever With His Folk And Veda Of Life Genre Songs :
తెలుగు సాహిత్యంలో జానపదాల నడకలు వేరు .. దాని సొగసులు వేరు. ఆ అర్థాలలోని అందం వేరు .. ఆ భావాలలోని అల్లరి వేరు. అలాంటి జానపదాలకు తెలుగు సినిమాలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కథ ఏదైనా ఏదో ఒక సందర్భంలో జానపద గీతానికి స్థానం ఇవ్వడమనేది చాలా కాలంగా వస్తోంది. అప్పటివరకూ ప్రేక్షకుడు ఉన్న మూడ్ ను మార్చేసే శక్తి జానపదానికి ఉంది. ప్రేక్షకుల మనసులకి ఉల్లాసాన్ని .. ఉత్తేజాన్ని అందించే మంత్రంలా జానపద గీతాలు పనిచేస్తాయి. సినిమాల కోసం అలాంటి జానపద గీతాలను రాసిన కవులు కొంతమందే ఉన్నారు .. వారిలో ‘జాలాది’ ఒకరు.
జాలాది పూర్తి పేరు జాలాది రాజారావు. ఆగస్టు 9వ తేదీ 1932లో కృష్ణాజిల్లా గుడివాడ మండలం .. ‘దొండపాడు’ గ్రామంలో ఆయన జన్మించారు. తనకి ఊహతెలిసిన దగ్గర నుంచి తన తండ్రి స్వాతంత్ర్య ఉద్యమంలో తిరగడం చూశారు. అప్పటి నుంచి ఆయనలో దేశభక్తి పెరుగుతూ వచ్చింది. చాలా చిన్న వయసులోనే ఆయన ఆనాటి పోరాట వీరులకు ఆంగ్లేయుల కదలికలపై రహస్యంగా సమాచారాన్ని అందిస్తూ తనవంతు దేశసేవ చేసేవారు.
మొదటి నుంచి కూడా ఆయనకు తెలుగు భాషపై ఎంతో మమకారం ఉండేది .. అందువల్లనే ఆయన ఒక తపస్సు చేసినట్టుగా తెలుగు భాషపై అధికారం సంపాదించారు. ఆంగ్లేయులను ఎదిరించడానికి కలానికి మించిన ఆయుధం లేదు అనే ఉద్దేశంతో ఆయన ప్రజలను చైతన్యవంతులను చేసే కవితలు .. నాటకాలు .. నాటికలు రాస్తూ వెళ్లారు. అప్పట్లో ఆయన కలంలో నుంచి ఆవేశం .. సందేశం తొంగిచూశాయి. అలా దేశం కోసం తనవంతు సేవలను అందించిన ఆయన, ఆ తరువాత సినిమా పాటల వైపు అడుగులు వేశారు.
జాలాది తన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి స్పందించేవారు. మనుషులను .. వాళ్ల మనసులను చూసి అంకురించిన అక్షరాలను గుమ్మరించేవారు. అది చూసిన స్నేహితులు ఆయనను సినిమా పాటల దిశగా ప్రోత్సహించారు. దాంతో ఆయన వాళ్ల మాటను కాదనలేక మద్రాసు వెళ్లారు. జాలాది గారు అప్పటికే రాసిన ఒక జానపద గీతాన్ని దర్శకుడు పీసీ రెడ్డి గారు విని, అప్పుడు తాను తీస్తున్న ‘పల్లెసీమ’ సినిమా కోసం వాడుకున్నారు. ఆ పాటనే ‘సూరట్టుకు జారతాది సితుక్కు సితుక్కు వాన చుక్క’.
జానపదంలోని సున్నితమైన శృంగారాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన ఆయన, ఆ తరువాత ‘ప్రాణం ఖరీదు’ సినిమా కోసం మరో పాట రాశారు. ‘ఏతమేసి తోడినా ఏరు ఎండదు .. పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు’ అనే ఆ పాటకు అనూహ్యమైన రీతిలో గుర్తింపు వచ్చింది. ‘పలుపుతాడు మెడకేత్తే పాడిఆవురా .. పసుపుతాడు ముడులేత్తే ఆడదాయేరా .. కుడితినీళ్లు పోసినా అది పాలు కుడుపుతాదీ .. కడుపుకోత కోసినా అది మనిషికే జన్మనిత్తాది’ అంటూ స్త్రీ ఔన్నత్యాన్ని ఆవిష్కరించిన తీరు మనసు మైదానాన్ని తడిపేస్తుంది.
ఇదే పాటలో .. ‘కూతనేర్చినోళ్ల కులం కోకిలంటారా? .. ఆకలేసి అరిసినోళ్లు కాకులంటారా?’ అంటూ ధనిక .. బీద మధ్యగల తారతమ్యం సమాజంలో ఎలా ఉందో చాటిచెప్పారు. జాలాది పాటలో ఇది మకుటాయమానం. ఈ పాటలో అడుగడుగునా ఆయన జీవనవేదాన్ని ఆవిష్కరించారు. జీవితాన్ని కాచి వడబోసిన ఈ ఒక్క పాట వేల పాటల పెట్టు. ఒక గ్రంథానికి కావలసిన ముడిసరుకు ఈ పాటలో కావలిసినంత దొరుకుతుంది. ఈ పాటతో ‘జాలాది ఎవరు’? అనే కుతూహలం ఆనాటి కవులందరిలో కలిగిందనడంలో ఆశ్చర్యం లేదు.
ఈ పాటనే దేవుపల్లి కృష్ణశాస్త్రి .. శ్రీశ్రీ .. ఆరుద్ర .. ఆత్రేయ వంటి వారి సరసన ఆయనకి ఓ స్థానాన్ని సంపాదించి పెట్టింది. వాళ్లతో ఆయనకి సాన్నిహిత్యం పెరిగేలా చేయగలిగింది. అప్పటి నుంచి జాలాది అనేక పాటలు రాస్తూ వెళ్లారు. ‘సందెపొద్దు అందాలున్నా చిన్నదీ’ (తూర్పువెళ్లే రైలు) ‘కొండలమీద సుక్క పోటు’ (అల్లుడు గారు) వంటి రొమాంటిక్ పాటలు రాసిన ఆయన, ‘లే లే బాబా నిదుర లేవయ్యా’ (కుంతీపుత్రుడు) వంటి భక్తి పాటతో అనుభూతి పరిమళాలు వెదజల్లారు. ఇక ‘ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగా’ (ఛల్ మోహన రంగ) పాట ఆయన కలం చేసిన పద విన్యాసాలతో మెరుస్తుంది.
Jaladi Raja Rao :
‘శ్రీరస్తు .. శుభమస్తు’ (బొబ్బిలి సింహం) అనే పాటలో ‘కాలం కనుమూస్తే’ అనే ప్రయోగం చేయడం ఆయనకే చెల్లింది. ‘నిండుకుండలా నీళ్లోసుకుంటాది నీలాల కుండా'(చిట్టెమ్మ మొగుడు)పాట అనంతమైన ఆయన భావ సంపదకు అద్దం పడుతుంది. ఇక ‘యాలో యాలా ఉయ్యాలా’ (ఎర్ర మందారం) పాటలో, ‘కళ్లు తెరుసుకుంటే ఉయ్యాలా .. కళ్లు మూసుకుంటే మొయ్యాలా’ అంటూ ఒక మహా గ్రంథంలో కూడా చెప్పలేని జీవితాన్ని ఆయన ఒకేఒక్క పాటలో .. ఒకేఒక్క మాటలో చెప్పేశారు. అదే ఆయన గొప్పతనం .. అదే ఆయన ప్రత్యేకత.
ఇక వాన పాటలు .. వలపు పాటలు .. జీవన సత్యాలను ప్రతిబింబించే పాటలను రాసిన ఆయన, ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి’ (మేజర్ చంద్రకాంత్) అంటూ తన దేశభక్తిని చాటుకున్నారు. ఈ పాట వింటే ప్రతి ఒక్కరిలో ఊపిరి వేడెక్కుతుంది .. నెత్తురు ఉడుకుతుంది .. హృదయం ఉబుకుతుంది. గుండెను జండాగా చేసి ఎగరేయాలనిపిస్తుంది. అంతగా ఈ పాట ప్రభావితం చేసింది. తెలుగులో వచ్చిన దేశభక్తి గీతాల్లో ఇప్పటికీ ఈ పాటదే అగ్రస్థానం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పాటల ద్వారా అర్థాలను .. పరమార్థాలను .. పరమ సత్యాలను ఆవిష్కరించిన వారాయన. ఈ రోజున (ఆగస్ట్ 9) పాటల సూరీడి జయంతి. ఈ సందర్భంగా మనసారా ఆయనను ఒకసారి స్మరించుకుందాం.
(జాలాది జయంతి ప్రత్యేకం)
— పెద్దింటి గోపీకృష్ణ
Also Read : గర్జించే కవిత్వం .. గర్వించే పాటలు దాశరథి శైలి