చేసిన మేలు మరిచిపోయే వారే ఎక్కువ ఈ రోజుల్లో. అసలు సహాయమంటేనే ఏదీ ఆశించకుండా చేయడం. అయినా ఎవరన్నా మనం చేసిన మేలు గుర్తు పెట్టుకుని మనని పలకరిస్తే ఆ అనందమే వేరు. అదే జరిగింది టిజానా స్టోజోవిక్ కి. ఇదంతా జరిగింది మొన్నటి ఒలింపిక్స్ లో
అడుగడుగున అవరోధాలు అవలీలగా దాటగల మొనగాడు జమైకా కు చెందిన స్ప్రింటర్ పార్స్ లే పార్చ్ మెంట్. టోక్యో ఒలింపిక్స్ లో ఇతగాడు 110 మీటర్ల హర్డిల్స్ లో ఫైనల్ కు అర్హత సాధించాడు. ఫైనల్స్ కోసం ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టేడియం కు వెళ్ళడానికి బస్ ఎక్కాడు. తీరా ఆ బస్ వేరే పోటీలు జరిగే స్టేడియం చేరింది. పొరపాటున ఆ బస్సు ఎక్కిన పార్స్ లే అధికారులను సంప్రదించాడు. మళ్ళా ఒలింపిక్ గ్రామం వెళ్లి ఇంకో బస్ ఎక్కాలని సూచించారు. కానీ అలా చేస్తే ఆలస్యం అవుతుంది. ఏం చేయాలో తోచని స్థితిలో దేవతలా వచ్చింది టిజానా.
ఒలింపిక్ వాలంటీర్ ఈ 25 ఏళ్ళ అమ్మాయి. పార్స్ లే ఎవరో, ఏమిటో తెలియక పొయినా అతని పరిస్థితి అర్థం చేసుకుంది. టాక్సీలో వెళ్తే టైంకి చేరగలడని తెలుసుకుంది. ఏ మాత్రం సందేహించకుండా తనదగ్గర ఉన్న డబ్బంతా అతనికి ఇచ్చింది. వెంటనే టాక్సీ పట్టుకుని స్టేడియం చేరాడు. 110 మీ హర్డిల్స్ పోటీలో స్వర్ణ పతకం సాధించాడు. ఆనందం పట్టలేకపోయాడు. అయినా ఏదో వెలితి. టిజానా ను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఒక బస్టాప్ దగ్గర కలిసాడు. తాను గెలిచిన పతకం ఆమె వల్లనే అంటూ మెడల్ ఆమె చేతికిచ్చాడు. అంత గొప్ప అథ్లెట్ కి తాను సాయపడిందని తెలిసి టిజానా ఆనంద పరవశురాలైంది. ఆమె ఇచ్చిన డబ్బుతో పాటు జమైకా టీం జెర్సీ కూడా ఇచ్చాడు పార్స్ లే. ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. టిజానాపై ప్రశంసలు వెల్లువెత్తాయి. జమైకా దేశ అధ్యక్షుడు సైతం ఆమెను అభినందించి తమ దేశానికి ఆహ్వానించారు. ఆ ఆహ్వానం అందుకుని విశిష్ట అతిథిగా జమైకా వాసులను పలుకరిస్తుందేమో చూద్దాం.
-కె. శోభ