సార్వత్రిక ఎన్నికల తర్వాత జమ్ముకాశ్మీర్ పాలన వ్యవహారాల్లో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగింది. త్వరలోనే శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఉధంపూర్ ఎన్నికల సభలో ప్రకటించారు. దీనికి అనుగుణంగా హోం శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
కేంద్ర మాజీ మంత్రి జనరల్ వీకే సింగ్ ఈ దఫా లోక్ సభ ఎన్నికల్లో ఘజియా బాద్ నుంచి పోటీ చేయటం లేదు. రెండో దశలో జరుగుతున్నఘజియాబాద్ నుంచి బిజెపి తరపున అతుల్ గార్గ్ పోటీ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ కొత్త LG గా వికె సింగ్ నియామకం జరగనుందని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాంతంపై అవగాహన ఉన్న వ్యక్తి అవసరమని హోం శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఉధంపూర్ ఎన్నికల సభలో వికె సింగ్ ప్రధానితో కలిసి పాల్గొనటం గవర్నర్ పదవి ఉహాగానాలకు బలం చేకురుస్తోంది.
ఊహాగానాలు నిజమైతే లెఫ్టినెంట్ గవర్నర్‌గా జనరల్ సింగ్ నియామకం మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. పదేళ్లకు పైగా కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు రక్షణరంగంలో అతని కెరీర్ కాశ్మీర్ అభివృద్దికి ఉపయోగపడుతుందని కేంద్రం అంచనా. కొంత కాలంగా రాజపుత్ సామాజిక వర్గం బిజెపి పట్ల కొంత అసంతృప్తిగా ఉందని… వికె సింగ్ కు ఉన్నత స్థానం కల్పించటం కలిసివస్తుందని బిజెపి ఆలోచనగా ఉంది. దీంతో గుజరాత్, రాజస్థాన్ దేశంలోని ఇతర ప్రాంతాలలో బిజెపిపై కోపంగా ఉన్న రాజ్‌పుత్‌లను ప్రసన్నం చేసుకునేందుకు తోడ్పడనుండి.
ఇప్పటివరకు కాశ్మీర్ ఎల్ జి గా ఉన్న మనోజ్ సిన్హా ఎన్నికల క్షేత్రంలోకి దిగే సూచనలు ఉన్నాయి. ఇటీవల మరణించిన మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ సోదరుడు అఫ్జల్ అన్సారీ చేతిలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రస్తుత ఎల్‌జీ మనోజ్ సిన్హా ఘాజీపూర్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం.
మనోజ్ సిన్హా ఘాజీపూర్ నుండి పోటీ చేయటం ద్వారా అతన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం… భూమిహార్లను బిజెపికి అనుకూలంగా సమీకరించడానికి సిన్హా రాక ఉపయోగపడుతుందని కమలం నేతల భావన. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో భూమిహార్ సామజికవర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు యత్నం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ కూడా బిజెపితో టచ్‌లో ఉన్నారని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు పతాక స్థాయికి చేరుకున్నాక తన మాతృ పార్టీలోకి రావచ్చని తెలిసింది.
మోడీ మూడో దఫా అధికారంలోకి వస్తే కాశ్మీర్ పాలనా వ్యవహారాల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయని ఢిల్లీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముందుగా కొత్త గవర్నర్ ను నియమించి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే యోచన సాగుతోందని సమాచారం. కాశ్మీర్ లో బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా బిజెపి వ్యూహ రచన చేస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి.
-దేశవేని భాస్కర్