జనసేన అభ్యర్ధుల ఎంపిక ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. కూటమిలో భాగంగా 21 ఎమ్మెల్యే, 2 ఎంపి సీట్లలో పోటీ చేస్తున్న పార్టీ మొత్తం సీట్లకు అభ్యర్ధుల ప్రకటన పూర్తి చేసింది. అయితే బిజెపి-తెలుగుదేశం-జన సేన కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ సీట్ల ఎంపికలోనూ… తదనంతరం అభ్యర్ధుల ఎంపికలో కూడా ఎన్నో తప్పటడుగులు వేశారు.
గత ఐదేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరించడంలో పవన్ విఫలమయ్యారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోనే పార్టీకి కొద్దిగా పట్టు ఉంది. అందుకే ఈ ప్రాంతాల్లోనే మెజార్టీ సీట్లు తీసుకున్నా అసెంబ్లీ నియోజకవర్గాల ఎంపికలో మాత్రం తడబడ్డారు. నాలుగేళ్ళుగా జనసేన నేతలు క్షేత్రస్థాయిలో పని చేసుకుంటున్న స్థానాలను తమ పార్టీకి దక్కేలా చూసుకోవడంలో విఫలమయ్యారు. టిడిపి, బిజేపిలు ఎంచుకోగా మిగిలిన వాటిలోనే జనసేన పోటీ చేస్తోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది.
మరోవైపు, గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక సీట్లలో పోటీ చేసిన పవన్ ఈసారి పిఠాపురం సీటును ఎంచుకున్నారు. ఒక నాయకుడిగా ఓడిపోయిన చోటునుంచే మళ్ళీ పోటీ చేస్తే కార్యకర్తలు, నేతల్లో ఆత్మ స్థైర్యం వచ్చేది. నారా లోకేష్ గత ఎన్నికల్లో ఓడిపోయిన మంగళగిరి నుంచే ఈసారి కూడా బరిలో ఉన్న విషయం గమనార్హం. పవన్ కూడా అలా చేస్తే బాగుండేదని జనసైనికులే భావిస్తున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి – పవన్ కళ్యాణ్ కు మధ్య డైలాగ్ వార్ జరిగింది. దమ్ముంటే తనపై పోటీ చేయాలని పవన్ కు సవాల్ కూడా విసిరారు. పవన్ మొదట్లో భారీ డైలాగులు మాట్లాడినా కాకినాడలో పోటీపై ఎందుకో ఆసక్తి ప్రదర్శించలేదు.
ఇదిలా ఉంటే మొత్తం 21 సీట్లలో ఇటీవలే పార్టీలో చేరిన వివిధ పార్టీల నేతలకు దాదాపు పది టిక్కెట్లు కేటాయించారు. పాలకొండ, అవనిగడ్డ సీట్ల విషయంలో పవన్ వైఖరి సొంత పార్టీ నేతలకే మింగుడుపడడం లేదు. నిన్నటి వరకూ టిడిపిలో ఉన్న మండలి బుద్ధ ప్రసాద్, నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరగానే వారికి సీట్లు కేటాయించారు. ఈ చర్య పార్టీ కార్యకర్తల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పవచ్చు.
విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ యాదవ్ కు సీటు కేటాయించారు. ఆయన వైసీపీలో ఎమ్మెల్సీ గా ఉంటూ జనసేన లో చేరారు. ఈయనకు సీటు ఇవ్వడాన్ని సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకించినా వెనక్కు తగ్గలేదు. తిరుపతి విషయంలోనూ అదే జరిగింది. కిరణ్ రాయల్ ఎప్పటినుంచో పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేస్తూ రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు సాధించారు. వైసీపీ నుంచి పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు కేటాయించారు. అలాగే పదేళ్లుగా రాజకీయంగా స్తబ్దుగా ఉన్న కొణతాల రామకృష్ణ కు అనకాపల్లి సీటు ఇచ్చారు. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకొని, రెండేళ్లుగా ప్రజలతో మమేకమై పని చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఆ సీటు వదులుకోవాల్సి వచ్చింది, కనీసం అవనిగడ్డ సీటు పోతిన మహేష్ కు ఇచ్చినా కొంతలో కొంత పార్టీ కేడర్ లో స్థైర్యం పెరిగి ఉండేది. రాజమండ్రి రూరల్ లో పనిచేసుకుంటున్న కందుల దుర్గేష్ ను నిడదవోలుకు మార్చారు. తెలుగుదేశం పార్టీ నేత పులవర్తి రామాంజనేయులుకు భీమవరం సీటు ఇచ్చారు. గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన పులవర్తి…. పవన్ ఓటమికి కారణమయ్యారు.
కడపలో జనసేనకు అంతగా పట్టులేదు. కానీ ఆ జిల్లాలోని రైల్వే కోడూరు సీటును తీసుకున్నారు. అక్కడ ఇప్పటికే ఒక అభ్యర్ధిని ప్రకటించారు, కానీ అతనిపై వ్యతిరేకత ఉందన్న నెపంతో స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి అనుచరుడు అరవ శ్రీధర్ ను ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కాకినాడ ఎంపి సీటును తంగెళ్ల ఉదయ్ కు ఇస్తున్నట్లు ప్రకటించారు, కానీ రెండో సీటు మచిలీపట్నంలో వల్లభనేని బాలశౌరి అభ్యర్ధి అని అందరికీ తెలిసినా ప్రకటనలో జాప్యం ఎందుకు చేశారో ఎవరికీ అంతుబట్టని విషయం.
ఇలా సీట్ల ఎంపిక తోపాటు అభ్యర్ధుల ప్రకటనలో సైతం జన సేనాని చేసిన మేధోమథనం అందరికీ విస్మయం కలిగిస్తోంది. 21 అసెంబ్లీ సీట్లలో మెజార్టీ సీట్లు వలస పక్షులకు కేటాయించారు పవన్ కళ్యాణ్.
21 సీట్లలో పోటీ చేయడంపై వచ్చిన విమర్శలకు స్పందించిన పవన్.. ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది ముఖ్యం కాదని విన్నింగ్ పర్సంటేజ్ ముఖ్యమని, 90 శాతం సీట్లలో గెలిచి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కానీ అభ్యర్ధుల ఎంపిక తరువాత… కూటమి మధ్య ఓట్ల బదలాయింపు అంత సులభం కాదని అనిపిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో పర్యటన సందర్భంగా పవన్ దీనిపై ఎలాంటి వివరణ ఇస్తారో… పార్టీ కోసం శ్రమిస్తూ వచ్చిన కీలక నేతలకు ఎలాంటి హామీ ఇస్తారో వేచి చూడాలి.