“జయ హనుమాన జ్ఞానగుణసాగర జయ కపీశ తిహుం లోక ఉజాగర;
రామదూత అతులితబలధామా అంజనిపుత్ర పవనసుత నామా;
మహావీర విక్రమ బజరంగీ కుమతి నివార సుమతి కే సంగీ…”
జ్ఞానగుణసాగరుడు, కపీశుడు,
రామదూత అయిన అతులితబలధాముడు, అంజనిపుత్రుడు, పవనసుతుడు
మహావీర విక్రమ వజ్ర అంగుడు…అంటూ భాష తెలియకపోయినా అవధి భాషలో తులసీదాస్ రాసిన హనుమాన్ చాలీసాను భయభక్తులతో చదువుకుంటున్నాం. దక్షిణాది భాషల్లో ప్రార్థించకుండా ఇదేమిటని? హనుమంతుడు ఏనాడూ మనల్ను అడగలేదు. అడగడు. అడగాల్సిన అవసరం కూడా రాదు. అవధి చాలీసా సకల అవధులను దాటి విశ్వవ్యాప్తంగా హనుమ భక్తులకు పరమావధి ఎలా అయ్యిందో రాస్తే అదో పెద్ద రామాయణం. హనుమదుపాసనకు సంబంధించిన మంత్రశాస్త్ర రహస్యాలన్నిటినీ తులసీదాస్ ఈ చాలీసాలో ఒడుపుగా బిగించాడు. అందువల్లే దానికంత మహిమ. ఆదరణ. వ్యాప్తి.
సంస్కృతంలో హనువు/హనుమ అంటే దవడ. ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బ తగిలి దవడలు పెరిగాయి అన్న కథ నిజమే అయినా…ఇది చాలా ప్రాథమిక స్థాయి అర్థం. నిజానికి హనుమ అక్షరాల్లో దాగిన హ లో అ; ను లో ఉ, మ లో మ్ కలిస్తే…అ ప్లస్ ఉ గుణ సంధి ఓ చివర మ్…మొత్తం “ఓం”కార స్వరూపుడు హనుమ అన్నది అంతరార్థం అని సామవేదం షణ్ముఖ శర్మ వంటి పెద్దల విశ్లేషణ. మనం మాట్లాడే మాటలకు గాలి ఆధారం. హనుమ పవన సుతుడు. మనం మాట్లాడే మాటలకు దవడలు ఆధారం. హనుమ అక్కడున్నాడు. ఇంతకంటే లోతుగా వెళ్లడానికి ఇది సందర్భం కాదు.
చిరంజీవిగా ఉండమని రాముడు కోరాడు; చిరాయువు కమ్ము బ్రహ్మ కల్పాంతముల్ అని సీతమ్మ దీవించింది కాబట్టి హనుమ చిరంజీవి. భవిష్యత్ బ్రహ్మ.
తిరుమల అంజనాద్రి జపాలి, కర్ణాటక హంపి దగ్గర అంజనాద్రి బెట్టె (హనుమంత హళ్లి), మహారాష్ట్ర ఆంజనేరీలలో హనుమ పుట్టినట్లు గుళ్ళు వెలిశాయి. స్థలపురాణాలు, ఇతర కథలు అనాదిగా ఉన్నాయి.
వేదాలు, పురాణాల్లో ఉన్న మన్వంతరాలు, యుగాల కాల ప్రమాణం వేరు. యుగానికొక నాలుగు వేల సంవత్సరాలు అని మనం వేసుకుంటున్న కాకి లెక్కలు వేరు. ఒక వృత్తం పూర్తయి మళ్లీ త్రేతాయుగం వస్తే…మళ్లీ రాముడు రావాలి. హనుమ రావాలి. ఇది సామాన్య దృష్టికి అందదు.
హనుమ జన్మ స్థలాన్ని తేల్చగల వేద, పురాణ, సకల శాస్త్ర పారంగతులు ఇప్పుడు ఒకవేళ నిజంగా ఉన్నా…ఉండి తేల్చినా…దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ కావచ్చు.
“అణురేణు పరిపూర్ణమైన రూపము…
అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము…”
అని అన్నమయ్య స్పష్టమయిన తెలుగులో చెప్పింది ఈ “ఏకం సత్ విప్రా బహుధా వదంతి” గురించే. రూపం వేరయినా కొలిచే పరబ్రహ్మ ఒకడే అని ఈ ప్రపంచానికి అర్థం కావడానికి అన్నమయ్య 32వేల కీర్తనల ఉదాహారణలతో రుజువు చేశాడు. అయినా మన బతుకులు…
రాత్రంతా రామాయణం విని పొద్దున్నే హనుమ ఎక్కడ పుట్టాడు? అని అడగాల్సిందే.
తెలుగువారికి హనుమ అంజనాద్రిలోనే పుట్టాడు. కన్నడవారికి హనుమంత హళ్లిలోనే పుట్టాడు. మరాఠీలకు ఆంజనేరిలోనే పుట్టాడు. ఇలా ప్రతి రాష్ట్రంలో…ప్రతి ఊళ్లో హనుమ పుట్టి ఉంటాడు. హనుమ విగ్రహం లేని దారి ఉంటుందా? హనుమాలయం లేని ఊరు ఉంటుందా?
రాముడు అయోధ్యలోనే ఉండిపోతే ఇక భద్రాద్రి ఎందుకు?
“యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిం
బాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమతః రాక్షసాంతకం”
హనుమంత హళ్లి, ఆంజనేరి, జపాలి, బీచుపల్లి, కలశాపురాలు దాటి…ఎక్కడెక్కడ రామ కీర్తన జరుగుతూ ఉంటుందో…అక్కడక్కడ నీరు నిండిన కన్నులతో, ముకుళిత హస్తాలతో ఉన్న హనుమకు నమస్కారం అని నిత్యం ప్రార్థన శ్లోకంలో చెప్పుకుంటున్నాం.
హనుమ పుట్టినచోటును వివాదం చేసి…ఆమధ్య స్వాములు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. అందులో వారి భక్తి తీవ్రతను, హనుమ మా దగ్గరే పుట్టాడని నిరూపించడానికి పడ్డ తాపత్రయాన్ని మాత్రమే చూడాలి.
సామాన్య భక్తులమయిన మనకెందుకు ఆ గొడవ?
పుట్టాల్సిన అవసరమే లేని హనుమ మన ఊళ్లోనే పుట్టాడు. మన కోసమే పుట్టాడు. మన ఇంట్లోనే కొలువై ఉన్నాడు. మనల్ను వేధించే రాక్షసుల పని పట్టడానికి మన వెంటే వస్తున్నాడు. వస్తూనే ఉంటాడు- అనుకోవడమే మనకు మంచిది.
అలా “పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు” అన్న అన్నమయ్య మాటలను మననం చేసుకుంటూ… తిరుమల సందర్శనలో జపాలి ఆంజనేయస్వామికి మొక్కుకుని…వచ్చాను.
-పమికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు