Friday, November 22, 2024
HomeTrending Newsకేజ్రీవాల్‌ వారసురాలిగా భార్య సునీత!

కేజ్రీవాల్‌ వారసురాలిగా భార్య సునీత!

ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజకీయ ఎత్తుగడలకు పదును పెడుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌.. జూన్ 2వ తేదిన లొంగిపోవాల్సి ఉంది. మళ్ళీ జైలుకు వెళితే ఏం జరుగుతుందో తెలియదు.

మళ్లీ ఆయన జైలుకు వెళ్ళే అవకాశాలు ఉండటంతో భార్య సునీతను తన వారసురాలిగా తీర్చిదిద్దే ఉద్దేశంలో కేజ్రీవాల్‌ ఉన్నారని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే తన ఎన్నికల ప్రచారంలో భార్యతో కలిసి హాజరవుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

దాదాపు 50 రోజులపాటు జైల్లో ఉన్న ఆయనకు లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది.  ఈ బెయిల్‌ పీరియడ్‌లో ఎన్నికలపై పూర్తిగా దృష్టి సారించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీని టార్గెట్‌ చేస్తూ విమర్శలు  సంధిస్తున్నారు.

ఢిల్లీలోని గాంధీనగర్‌లో సోమవారం జరిగిన ఎన్నికల సభలో తొలిసారి తన భార్యతో కలిసి అరవింద్ కేజ్రివాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను ప్రశంసిస్తూ.. ‘ఝాన్సీ కి రాణి’ అంటూ సంబోధించారు. ‘ఈరోజు నాతోపాటు నా భార్యను కూడా వెంట తీసుకొచ్చా. నేను లేని సమయంలో ఆమె అంతా తానై నడిపించారు. నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను తరచూ కలిసేందుకు వచ్చేవారు. ఆమె ద్వారా ఢిల్లీ ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేవాడిని. వారికి నా సందేశాలు పంపేవాడిని. ఆమె ఝాన్సీకి రాణి వంటివారు’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. కేజ్రివాల్ తన భార్య సునీత కేజ్రీవాల్‌ ను ఝాన్సీ రాణితో పోల్చారు.

త్వరలో దేశానికి మంచిరోజులు రాబోతున్నాయని.. మోడీ వెళ్లిపోతున్నారని ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కేజ్రివాల్ కు మరో సంకటం మొదలవుతోంది.

ఖలిస్తాన్ అనుకూల సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ నుంచి అమ్ ఆద్మీ పార్టీకి నిధులు అందాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై NIA విచారణకు ఆదేశించినట్టు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా వెల్లడించారు. ఖలిస్తాని అనుకూల వాదనలు సమర్థించేందుకు 133 కోట్ల రూపాయలు సిఖ్ ఫర్ జస్టిస్ నుంచి అందినట్టు ది వరల్డ్ హిందూ ఫెడరేషన్ ఫిర్యాదు చేసింది.

1993 పేలుళ్ళ నిదితుడుగా ఉన్న దేవేందర్ పాల్ భుల్లార్ కు క్షమాభిక్ష కోసం ఆప్ సిఫారసు చేయటం ఇందులో భాగమని చర్చ జరుగుతోంది. దీన్ని రూడి పరుస్తూ ఈ ఏడాది మార్చిలో ఖలిస్తాని ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను కేజ్రివాల్ మీద ఆరోపణలు చేశారు.

సార్వత్రిక ఎన్నికల తర్వాత బిజెపి అధికారంలోకి వస్తే నిధుల ఆరోపణలపై విచారణ వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేజ్రివాల్ ముందు జాగ్రత్తగా రాజకీయాల్లో తన భార్యను ప్రమోట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్