చంద్రబాబు మాటలు వయసుకు తగ్గట్లుగా ఉండాలని, పిచ్చి ప్రేలాపనలు చేయకూడదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. బాబు చేసిన సెల్ఫీ ఛాలెంజ్ కు తాము సిద్ధంగా ఉన్నామని… కోటి 50 లక్షల గడపల వద్దకు రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా అని మంత్రి ప్రశ్నించారు. 17వేల జగనన్న కాలనీల నిర్మాణం జరుగుతోందని, ప్రజలు ఆయా కాలనీల్లో ఎలా ఉంటున్నారో చూసేందుకు తమతో కలిసి వస్తారా అని సవాల్ చేశారు. నెల్లూరులో టిడ్కో ఇళ్ళ దగ్గర చంద్రబాబు సెల్ఫీ తీసుకొని దానిపై ఛాలెంజ్ చేయడం సిగ్గు చేటని మండి పడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జోగి మీడియాతో మాట్లాడారు. బాబు టిడ్కో ఇళ్ళ పరిస్థితికి, ప్రస్తుత స్థితికి తేడా చెప్పేలా నాడు-నేడు పేరుతో ఫోటోలను మంత్రి మీడియాకు ప్రదర్శించారు.
బాబు ఇన్నేళ్ళలో కనీసం ఒక మంచి పని అయినా చేయలేకపోయారని, ఒకవేళ నిజంగా ఆయన మంచి పనులు చేసి ఉంటే 23 సీట్లకు ఎంతుకు పరిమితమయ్యారని జోగి నిలదీశారు. తమ నాలుగేళ్ల పాలనలో ప్రతి గడపకూ మంచి చేశాం కాబట్టే ఇప్పుడు జగనన్నే మా భవిష్యత్తు పేరిట ప్రతి గడపనూ సందర్శిస్తున్నామని చెప్పారు. బాబు హయంలో అన్ని వర్గాల ప్రజలకు ఏం మేలు చేశారు, తమ హయంలో ఏమి చేసామో లబ్ధిదారులనే అడిగి తెలుసుకుందామని. గుడ్డ కాల్చి మీద వేసి తుడుచుకోమని పారిపోవడం కాదని, తమతో కలిసి వచ్చి జగనన్న కాలనీల సందర్శనకు రావాలని బాబు, లోకేష్ లను జోగి ఆహ్వానించారు.
2024 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు కుప్పకూలడం ఖాయమని, వైనాట్ కుప్పం అనేది తమ నినాదమని జోగి స్పష్టం చేశారు. సిఎం జగన్ తాటాకు చప్పుళ్ళకు భయపడే రకం కాదన్నారు.