Sunday, November 10, 2024
HomeTrending Newsకాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణలో కీలక మలుపు

కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణలో కీలక మలుపు

కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలపై న్యాయ విచారణకు ఉపక్రమించిన ప్రభుత్వం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మంగళవారం(జనవరి-09) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వం లేఖ రాసింది. మేడిగడ్డ కుంగుబాటుపై విజిలన్సు విచారణకు ఆదేశించటంతో ఈ రోజు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

ఈ నెల రెండో తేదిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై స్పష్టతనివ్వగా.. చెప్పిన వారం రోజులకే విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ కార్యాలయాలపై మూకుమ్మడిగా ఈరోజు సోదాలు జరిగాయి. ఇంజినీర్-ఇన్-చీఫ్(ENC) మురళీధర్ తోపాటు రామగుండం ఆఫీసుల్లోనూ పొద్దున 9 గంటల నుంచి తనిఖీలు సాగుతున్నాయి. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే నిధులు సేకరించారు కాబట్టి.. అక్కడి ఆఫీసులోని రికార్డులను విజిలెన్స్ స్వాధీనం చేసుకుంది.

కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించిన రికార్డుల్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విభాగం సునిశితంగా పరిశీలన చేస్తున్నది. హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌధలోని కాళేశ్వరం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో విస్తృతంగా సోదాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన రికార్డులన్నింటినీ విజిలెన్స్ బృందం స్వాధీనం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో దాడులకు దిగిన విజిలెన్స్ డిపార్ట్ మెంట్… 12 ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలోనూ సోదాలు చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్ లను పరిశీలించిన అధికారులు… రికార్డులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. విజిలెన్స్ SP రమణారెడ్డి నేతృత్వంలో మొత్తం 10 టీమ్ లు, ఇంజినీరింగ్ బృందాలు ఈ దాడులు కొనసాగిస్తున్నాయి.

కాళేశ్వరం నిర్మాణ సమయంలో మూడు షిఫ్టుల్లో ప్రాజెక్టు పనులు జరిగాయి. పనులు త్వరితగతిన పూర్తి చేయాలనే గుత్తేదారులను ప్రభుత్వం తొందరపెట్టిందని అంటున్నా… దీన్ని ఆసరా చేసుకొని కొందరు తమ అవసరాలు చక్కదిద్దుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.  కేవలం జనరల్ షిఫ్టులో మాత్రమే ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ ఉందని… అంతకు ముందు ఆ తర్వాత ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలని గతంలో అక్కడ విధులు నిర్వహించిన అధికారులు అంటున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ సిఎం కెసిఆర్ మానస పుత్రిక అని గత ప్రభుత్వంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణకు దిగటం… పార్లమెంటు ఎన్నికల వేళ ప్రాధాన్యత సంతరించుకుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించటంతో అక్కడ విధులు నిర్వహించిన అధికారులు భయాందోళనకు గురి అవుతున్నట్టు తెలిసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి సిట్టింగ్ జడ్జితో  ఒక అంశంపై విచారణ జరుపుతున్నారని…విచారణలో సంచలన అంశాలు వెలుగు చూస్తాయని నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్